Adani : ఆసియా అపర కుబేరుడు గౌతమ్‌ అదానీకి భారీ షాక్.! ఒక్కరోజులోనే ఆవిరైపోయిన ఒక లక్షా మూడు వేల కోట్ల రూపాయల సంపద..! ఎందుకు? ఎలా..?

అపర కుబేరుడు గౌతమ్‌ అదానీకి ఇవాళ భారీ షాక్ తగిలింది. గంట వ్యవధిలోనే అతని సంపద రూ. 55వేల కోట్లు ఆవిరైపోయింది. ఉదయం 10 గంటలకు అదానీ..

Adani : ఆసియా అపర కుబేరుడు గౌతమ్‌ అదానీకి  భారీ షాక్.! ఒక్కరోజులోనే ఆవిరైపోయిన ఒక లక్షా మూడు వేల కోట్ల రూపాయల సంపద..! ఎందుకు? ఎలా..?
Adani
Venkata Narayana

|

Jun 14, 2021 | 4:01 PM

Adani Group shares fell sharply on stock market : అపర కుబేరుడు గౌతమ్‌ అదానీకి ఇవాళ భారీ షాక్ తగిలింది. ఒకే ఒక్క రోజులో అతని సంపద అక్షరాలా ఒక లక్షా మూడు వేల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది. ఉదయం 10 గంటలకు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు 25శాతం పతనమై రూ. 1,201.10 కనిష్ఠ స్థాయిని తాకింది. అదానీ పోర్ట్స్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ పవర్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌ షేర్లు కూడా భారీ స్థాయిలో పతనమయ్యాయి. దీంతో వీటి ట్రేడింగ్‌ను కొంతసేపు నిలిపివేశారు. ఉదయం ట్రేడింగ్‌లో అదానీ నికర సంపద 7.6బిలియన్ డాలర్ల మేర తగ్గింది. అయితే, ఈ హఠాత్పరిణామానికి నేషనల్ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌(ఎన్‌ఎస్‌డీఎల్‌) చర్యలే కీలకమని భావిస్తున్నారు. మరోవైపు, అదానీ గ్రూప్‌ కంపెనీల్లో భారీ పెట్టుబడులు పెట్టిన మూడు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల ఖాతాలను NSDL స్థంభింపజేసింది. ఈ మేరకు ఎకనమిక్‌ టైమ్స్‌ కథనం వెల్లడించింది.

ఈ వార్తలతో నేటి స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో అదానీ గ్రూప్‌ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. కేవలం గంట వ్యవధిలోనే షేర్లన్నీ లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. దీంతో ఆసియాలో అపర కుబేరుడైన అదానీ నికర సంపద ఒకే ఒక్క రోజులో దాదాపు రూ. 1.03 కోట్లు ఆవిరైపోయాయి. కాగా, NSDL స్తంభింపజేసిన అల్బులా ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌, క్రెస్టా ఫండ్‌, ఏపీఎంఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌లకు.. అదానీ గ్రూప్‌కు చెందిన నాలుగు కంపెనీల్లో రూ.43,500 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. కొత్తగా వచ్చిన మార్కెట్‌ నిబంధనల ప్రకారం.. FIPల కస్టమర్ డాక్యుమెంటేషన్‌ను వెల్లడించడం తప్పనిసరైంది. అంటే ఫండ్‌ మేనేజర్స్‌, కామన్‌ ఓనర్‌షిప్‌ వంటి వివరాలను వెల్లడించాలి. లేదంటే వారి డీమ్యాట్‌ ఖాతాలను ఫ్రీజ్‌ చేస్తారు. అదానీ గ్రూప్‌ విషయంలోనూ అదే జరిగింది. ఆ వివరాలేవీ వెల్లడించకపోవడంతో మూడు ఎఫ్‌పీఐల ఖాతాలను నిలిపివేశారు.

దీనికి తోడు, సెబీ రిజిస్ట్రేషన్‌ ప్రకారం.. ఈ మూడు ఎఫ్‌పీఐ కంపెనీలకు మారిషస్‌లోని పోర్ట్‌లూయిస్‌కు చెందిన ఒకే అడ్రస్‌ ఉంది. వీటికి ప్రత్యేక వెబ్‌సైట్లు కూడా లేవు. ఈ నేపథ్యంలో డొల్ల కంపెనీలతో పెట్టుబడులు పెట్టి ఉంటారనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ మూడు ఫండ్‌ కంపెనీలకు కలిపి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 6.82శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్‌లో 8.03శాతం, అదానీ టోటల్‌ గ్యాస్‌లో 5.92శాతం, అదానీ గ్రీన్‌లో 3.58శాతం షేర్లు ఉన్నాయి. దీనిపై సెబీ దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే, హర్షద్​ మెహతా స్టాక్ మార్కెట్ కుంభకోణం బయటపడటంలో ముఖ్య భూమిక పోషించిన మహిళా జర్నలిస్ట్ సుచేత దలాల్ రెండు రోజుల క్రితం​ చేసిన ట్వీట్ ఇందుకు కారణమన్న చర్చకూడా మార్కెట్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

ఆమె చేసిన ట్వీట్ సారాంశం ఏంటంటే, సెబీ నిఘా వ్యవస్థలు గుర్తించలేని స్థాయిలో మరో కుంభకోణం జరుగుతోందని.. విదేశీ సంస్థల ద్వారా ఇది జరుగుతున్నట్లు దలాల్ పేర్కొన్నారు. కంపెనీ పేరును నేరుగా చెప్పకపోయినప్పటికీ.. దలాల్ చేసిన ట్వీట్​లు అదానీ గ్రూప్​ను ఉద్దేశించేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, విదేశీ పెట్టుబడి సంస్థల ఖతాల నిలిపివేత సహా.. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం గురించి ఆదానీ గ్రూప్​ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. కాగా, గతేడాది అదానీ గ్రూప్‌ షేర్లు 200 నుంచి 1000శాతం మేర పెరిగిన సంగతి తెలిసిందే.

ఇదిలాఉండగా, ఈనెల మొదటివారంలో వెలువడ్డ ప్రపంచ ధనవంతుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ గౌతమ్ అదాని ప్రపంచ సంపద ర్యాంకింగ్స్‌లో జాక్ మా వంటి చైనా బిలియనీర్లను అధిగమించారు. బ్లూమ్‌బెర్గ్ యొక్క డేటా ప్రకారం, అంబానీ సంపద 84 బిలియన్లకు చేరుకోగా, అదానీ సంపద 78 బిలియన్లకు పెరిగింది. దీంతో ఆసియా అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తలుగా నిలిచారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచ ధనవంతుల జాబితాలో అదానీ 14 వ స్థానంలో ఉన్నారు.

రెండునెలల కిందట ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణపట్నం పోర్టులో అదానీ పోర్ట్స్ లిమిటెడ్.. తమ పెట్టుబడుల్ని వందశాతానికి పెంచుకుంది. కృష్ణపట్నం పోర్టులో ఇప్పటి వరకూ ఉన్న విశ్వసముద్ర హోల్డింగ్స్ నుంచి 25 శాతం వాటాను అదానీ పోర్ట్స్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. 25 శాతం వాటా విలువ 2800 కోట్ల రూపాయలు ఉంటుందని అదానీ పోర్ట్స్ సెజ్ లిమిటెడ్ కంపెనీ వెల్లడించింది. ఈ మేరకు అదానీ పోర్ట్స్ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆ డీల్‌తో కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం అదానీ పోర్ట్స్‌కు బదలాయింపు అయ్యింది. కాగా, 2020లో కృష్ణపట్నం పోర్టులో 75శాతం వాటాను అదానీ పోర్ట్స్ కొనుగోలు చేసింది. ఆ డీల్ విలువ 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 13,675 కోట్లుగా అదానీ గ్రూప్ పేర్కొంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu