మీరు ఏసీ వాడినా కరెంట్ బిల్లు సగానికి తగ్గాలా.? రిమోట్‌తో ఇలా చేస్తే చాలు.. సింపుల్ చిట్కాలు
వేసవిలో ఏసీ వాడకం పెరగడం వల్ల కరెంటు బిల్లులు షాక్ ఇస్తున్నాయా? అయితే మీ ఏసీ రిమోట్‌లో దాగి ఉన్న కొన్ని స్మార్ట్ ఫీచర్లను ఉపయోగించి బిల్లును ఎలా తగ్గించవచ్చో ఈ కథనంలో తెలుసుకోండి. అదేంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

మండుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందడానికి ఇప్పుడు ప్రతి ఇంట్లో ఏసీ కనీస అవసరంగా మారింది. అయితే, ఏసీ ఇచ్చే చల్లదనం ఎంత హాయిగా ఉంటుందో, నెల చివరలో వచ్చే కరెంటు బిల్లు అంతగా భయపెడుతుంటుంది. కానీ, మీకు తెలుసా? మీ ఏసీ రిమోట్‌లో ఉండే కొన్ని బటన్లను సరిగ్గా ఉపయోగిస్తే కరెంటు బిల్లును గణనీయంగా తగ్గించవచ్చు. చాలామంది ఏసీ ఆన్ చేసి కేవలం టెంపరేచర్ సెట్ చేస్తారు. కానీ, మీ రిమోట్‌లో ఉండే ‘Sleep Mode’ బటన్ నిజంగా ఒక మ్యాజిక్ లాంటిది.
మీరు నిద్రపోయిన తర్వాత గది ఉష్ణోగ్రతను బట్టి ఇది ఆటోమేటిక్‌గా సెట్టింగ్స్ మారుస్తుంది. దీనివల్ల రాత్రంతా ఏసీ ఒకే వేగంతో పని చేయకుండా కరెంటును ఆదా చేస్తుంది. చాలామంది ఏసీ ఆన్ చేసి మర్చిపోతుంటారు. అలా కాకుండా, రిమోట్‌లోని ‘Timer’ ఫీచర్‌ను ఉపయోగించి ఒక 2 లేదా 3 గంటలకు సెట్ చేసుకుంటే, గది చల్లబడిన తర్వాత ఏసీ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. దీనివల్ల అనవసరమైన విద్యుత్ వృధాను అరికట్టవచ్చు. మరో ముఖ్యమైన బటన్ ‘Eco Mode’ లేదా ‘Energy Saver’. ఇది కంప్రెసర్ పనితీరును నియంత్రించి తక్కువ విద్యుత్తుతో ఎక్కువ చల్లదనాన్ని ఇస్తుంది. రిమోట్ సెట్టింగ్స్‌తో పాటు ఫిజికల్ మెయింటెనెన్స్ కూడా ముఖ్యం. ఏసీ ఫిల్టర్లలో ధూళి చేరితే గాలిని లాగడానికి కంప్రెసర్ ఎక్కువ శక్తిని ఉపయోగిస్తుంది. నెలకు ఒకసారి ఫిల్టర్లను శుభ్రం చేస్తే ఏసీ లైఫ్ పెరగడమే కాకుండా బిల్లు కూడా తగ్గుతుంది. గది కిటికీలు సరిగ్గా మూసి ఉంచడం లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు కూడా మీ జేబుకు చిల్లు పడకుండా కాపాడతాయి. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే ఈ వేసవిలో చల్లదనంతో పాటు ఆర్థికంగానూ ప్రశాంతంగా ఉండవచ్చు.
ఆర్థిక నిపుణుల, ఇంజనీర్ల సూచన ప్రకారం ఏసీని 24 డిగ్రీల వద్ద ఉంచడం ఉత్తమం. ఈ ఉష్ణోగ్రత వద్ద ఏసీ కంప్రెసర్‌పై ఒత్తిడి తక్కువగా ఉంటుంది. కరెంటు పొదుపు అవుతుంది. రిమోట్‌లో 18 డిగ్రీలకు పెట్టడం వల్ల గది త్వరగా చల్లబడదు, కేవలం బిల్లు మాత్రమే పెరుగుతుంది.
Also Read: EMI లేకుండా 5 ఏళ్లు ఇలా చేస్తే రూ. 50 లక్షల ఇల్లు మీ సొంతం.. చాలామందికి ఇది తెలియక తన్నుకుంటున్నారు
