ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌లో AI మ్యాజిక్.. ఉద్యోగం కోల్పోయిన వ్యక్తికి రూ.1.5 కోట్ల ప్యాకేజీ
ఉద్యోగం కోల్పోయి ఐదు నెలల పాటు తీవ్రంగా ప్రయత్నించిన ఓ వ్యక్తికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కీలకంగా మారింది. ఇంటర్వ్యూలకు సిద్ధం కావడంలో AI టూల్స్‌ను సమర్థంగా ఉపయోగించుకుని చివరకు ఏడాదికి సుమారు రూ.1.5 కోట్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని సాధించాడు. రెడ్డిట్‌లో 'kml3141' అనే యూజర్‌నేమ్‌తో తన అనుభవాన్ని పంచుకున్నాడు..

ఉద్యోగం కోల్పోయి ఐదు నెలల పాటు తీవ్రంగా ప్రయత్నించిన ఓ వ్యక్తికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కీలకంగా మారింది. ఇంటర్వ్యూలకు సిద్ధం కావడంలో AI టూల్స్‌ను సమర్థంగా ఉపయోగించుకుని చివరకు ఏడాదికి సుమారు రూ.1.5 కోట్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని సాధించాడు. రెడ్డిట్‌లో ‘kml3141’ అనే యూజర్‌నేమ్‌తో తన అనుభవాన్ని పంచుకున్న ఈ ప్రొఫెషనల్.. తాను ఒకే కంపెనీలో దాదాపు 10 సంవత్సరాలు పనిచేసి, మూడు ప్రమోషన్లు పొందిన తర్వాత ఫిబ్రవరి చివర్లో ఉద్యోగం కోల్పోయానని తెలిపాడు. అకస్మాత్తుగా ఉద్యోగం పోవడం తనకు పెద్ద షాక్‌గా మారిందని పేర్కొన్నాడు. ఉద్యోగం కోసం ప్రయత్నించిన సమయంలో అనేక ఇంటర్వ్యూలకు హాజరైనప్పటికీ పదేపదే తిరస్కరణలు ఎదురయ్యాయని తెలిపాడు. కొన్ని ఉద్యోగ ఖాళీలు రద్దు కావడం, మరికొన్ని తాత్కాలికంగా నిలిపివేయడం, ఇంకొన్ని సంస్థలోని అంతర్గత అభ్యర్థులకు ఇవ్వడం జరిగిందని వివరించాడు. ఈ సమయంలో తన ఇంటర్వ్యూ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి AI టూల్స్‌ను ఉపయోగించడం ప్రారంభించినట్లు వెల్లడించాడు.
10 ఏళ్లుగా చేస్తున్న జాబ్ హుష్.. ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌లో AI సహాయం
ఉద్యోగ ప్రకటనలోని వివరాలను AI టూల్స్‌లో నమోదు చేసి, ఇంటర్వ్యూ చేసే వ్యక్తుల గురించి సమాచారం అందించేవాడినని చెప్పాడు. దాని ఆధారంగా AI తనకు అవసరమైన ఇంటర్వ్యూ ప్రశ్నలు సిద్ధం చేయడం, ఇంటర్వ్యూ ప్యానెల్ సభ్యులపై పరిశోధన చేయడం, తన అనుభవాలను సరైన విధంగా వివరించేందుకు STAR (Situation, Task, Action, Result) పద్ధతిలో సమాధానాలు తయారు చేయడం వంటి వాటిలో సహాయం చేసిందని తెలిపాడు. ఇంటర్వ్యూలలో ఎక్కువగా వివరించే తన అలవాటును తగ్గించి సమాధానాలను స్పష్టంగా, సంక్షిప్తంగా చెప్పడానికి AI ఉపయోగపడిందని పేర్కొన్నాడు.
రూ.1.5 కోట్లకు పైగా వార్షిక వేతనంతో కొత్త ఉద్యోగం
చివరకు ఏజెన్సీ రంగానికి చెందని ఓ కంపెనీలో అతనికి ఉద్యోగ అవకాశం లభించింది. ఈ ఉద్యోగంలో ఏడాదికి 1,55,000 డాలర్ల వేతనం, 15 శాతం వార్షిక బోనస్, మొదటి రోజు నుంచే ఉద్యోగ ప్రయోజనాలు లభిస్తాయని తెలిపాడు. ఇది తన గత ఉద్యోగంతో పోలిస్తే ఎక్కువ జీతమని, అందువల్ల చర్చలు జరపకుండా ఆ ఆఫర్‌ను అంగీకరించినట్లు చెప్పాడు. ఈ అనుభవం తనకు పట్టుదల, ఓర్పు విలువను నేర్పిందని ఆ వ్యక్తి తెలిపాడు. ఉద్యోగం కోసం ఎక్కువ కాలం ప్రయత్నిస్తున్న వారు నిరుత్సాహపడకుండా, తమ సామర్థ్యానికి మించినవిగా అనిపించే అవకాశాలకు కూడా దరఖాస్తు చేయాలని సూచించాడు. ప్రస్తుతం ఉద్యోగ అన్వేషణ, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, నైపుణ్యాల అభివృద్ధి, కెరీర్ ఎదుగుదలలో AI ఒక ఉపయోగకరమైన సాధనంగా మారుతోందని ఈ ఘటన మరోసారి చూపించింది.
