Dairy Farming: పశుపోషణకి పెద్దపీట వేస్తున్న కేంద్రం.. ఈ పథకం కింద రైతులకి ప్రత్యేక సబ్సిడీ..!
Dairy Farming: మన దేశంలో వ్యవసాయంతో పాటు పశుపోషణ కూడా ఎక్కువగా ఉంటుంది. రైతులు తమ అవసరాల కోసం, వ్యవసాయం నుంచి వేరుగా సంపాదించడం కోసం పశుపోషణ చేస్తారు.
Dairy Farming: మన దేశంలో వ్యవసాయంతో పాటు పశుపోషణ కూడా ఎక్కువగా ఉంటుంది. రైతులు తమ అవసరాల కోసం, వ్యవసాయం నుంచి వేరుగా సంపాదించడం కోసం పశుపోషణ చేస్తారు. పశుసంవర్ధక రంగంలో చాలా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పాల వ్యాపారం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ కారణంగానే ప్రభుత్వం పశుపోషణ, డెయిరీ అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. ఇందుకోసం కేంద్ర అనేక పథకాలని ప్రవేశపెట్టింది. అందులో రైతులకు సబ్సిడీ ఇవ్వాలనే నిబంధన కూడా ఉంది. వీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చు. పశుసంవర్ధక రైతులు సేంద్రియ వ్యవసాయం కోసం ఆవు పేడను ఉపయోగిస్తారు. దీని నుంచి కంపోస్ట్ ఎరువు తయారు చేస్తారు. ఒక వేళ మీరు సేంద్రియ వ్యవసాయం చేయకపోయినా పొలాల్లో ఆవు పేడను ఉపయోగించవచ్చు. మరోవైపు ఆవు మూత్రాన్ని అనేక రూపాల్లో వినియోగించవచ్చు.
డెయిరీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ స్కీమ్
డెయిరీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ స్కీమ్ 1 సెప్టెంబర్ 2010న ప్రారంభించారు. పాడి పరిశ్రమ వృద్ధి రేటును పెంపొందించడం, కొత్త పాడి పరిశ్రమలను ప్రోత్సహించడం, స్వచ్ఛమైన పాల ఉత్పత్తి కోసం కొత్త ఆధునిక డెయిరీ ఫామ్‌ల ఏర్పాటు, దూడల పెంపకాన్ని ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం. అలాగే పాలను ప్రాసెస్ చేసే క్రమంలో స్వయం ఉపాధి దొరుకుతుంది. అసంఘటిత రంగానికి మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది.
ఈ పథకం కింద అనేక పనులకు సబ్సిడీ
డెయిరీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ స్కీమ్ అనేది నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) అమలు చేస్తున్న పథకం. డైరీ రంగంలో నిర్మాణాత్మక మార్పులను తీసుకురావడానికి ఈ పథకం చిన్న డెయిరీ ఫామ్‌లు, ఇతర అనుబంధ సంస్థలకు విస్తరించింది. ఈ పథకం ప్రకారం డెయిరీ ఏర్పాటుకు అయ్యే ఖర్చులో 25 శాతం సబ్సిడీ అందిస్తుంది. ఈ సబ్సిడీ గరిష్టంగా 10 పాలు ఇచ్చే జంతువులకు మాత్రమే ఇస్తారు. అంతే కాకుండా ఈ పథకం కింద పాల ఉత్పత్తుల తయారీ యూనిట్‌ను ప్రారంభించేందుకు కూడా సబ్సిడీ ఇస్తారు.
మీరు పాల ఉత్పత్తులని ప్రాసెసింగ్ చేయాలనుకుంటే, దీని కింద పరికరాలను కొనుగోలు చేయాలనుకుంటే సబ్సీడీ తీసుకోవచ్చు. ఈ పథకం కింద పాలు, పాల ఉత్పత్తుల సంరక్షణ కోసం కోల్డ్ స్టోరేజీ యూనిట్‌ను ప్రారంభించవచ్చు. దీని ఖర్చుకి ప్రభుత్వం సబ్సిడీని అందిస్తుంది. రైతులు, పారిశ్రామికవేత్తలు, కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక బృందాలు, డెయిరీ కోఆపరేటివ్ సొసైటీలు మొదలైనవి డెయిరీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ స్కీమ్ కింద ప్రయోజనాలను పొందవచ్చు.