కరోనా ఉధృతి కారణంగా పెరుగుతున్న ఆంక్షలు.. భారత ప్రయాణ రాకపోకలపై అమెరికా కీలక సూచనలు

భారత్​లో కరోనా ఉధృతి వేగంగా పెరుగుతుండటంతో పలు దేశాలు భారత్​కు విమాన రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నాయి.

కరోనా ఉధృతి కారణంగా పెరుగుతున్న ఆంక్షలు.. భారత ప్రయాణ రాకపోకలపై అమెరికా కీలక సూచనలు
Us Avoid Travelling To India
Balaraju Goud

|

Apr 20, 2021 | 8:19 AM

US avoid travelling: దేశంలో కరోనా సెకండ్​వేవ్​ విజృంభిస్తోంది. ఎన్నడూ లేని విధంగా గత కొన్ని రోజులుగా నిత్యం లక్షకు మించి కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే భారత్​లో కరోనా ఉధృతి వేగంగా పెరుగుతుండటంతో పలు దేశాలు భారత్​కు విమాన రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే బ్రిటన్ , హాంకాంగ్​ ప్రభుత్వాలు కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా అగ్ర రాజ్యం అమెరికా కూడా భారత ప్రయాణ రాకపోకలపై పలు సూచనలు చేసింది.

కరోనా కేసులు పెరుగుదల నేపథ్యంలో అమెరికా పౌరులకు సెంటర్స్‌ ఫర్డ్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) కీలక సూచనలు చేసింది. భారత్‌లో అన్ని రకాల ప్రయాణాలకు దూరంగా ఉండాలని పేర్కొంది. వ్యాక్సిన్‌ తీసుకున్న ప్రయాణికులకు సైతం కొత్త వేరియంట్లు సోకే ప్రమాదం ఉందని సీడీసీ హెచ్చరించింది. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే ప్రయాణానికి ముందు వ్యాక్సిన్‌ తీసుకుని వెళ్లాలని కోరింది.

కరోనా మహమ్మారి నుంచి ప్రయాణికులకు ప్రమాదం పొంచి ఉన్నందున ప్రపంచవ్యాప్తంగా సుమారు 80శాతం దేశాలకు ‘డునాట్‌ ట్రావెల్‌’ మార్గదర్శకాలు పెంచనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. కొవిడ్‌ 19 పరిమితుల కారణంగా చాలా మంది అమెరికన్లను ఇప్పటికే యూరప్‌లో ప్రయాణించకుండా నిరోధించింది. ఇటీవల యూరప్‌, చైనా, బ్రెజిల్‌, ఇరాన్‌, దక్షిణాఫ్రికాలో తన పౌరులు ప్రయాణించకుండా అమెరికా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే తాజాగా భారతదేశం వెళ్లాలనుకునే వారిని కూడా నిరోధించి, కరోనా కట్టడి చేయాలని అమెరికా భావిస్తోంది.

ఇదిలావుంటే, కరోనా కేసుల భారీగా పెరగడంతో ఇప్పటికే బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. అలాగే ఆ దేశం సోమవారం ట్రావెల్‌ రెడ్ లిస్ట్ దేశాల జాబితాలో భారత్‌ను చేర్చడంతో పాటు కఠిన ఆంక్షలు విధించింది. బ్రిటన్‌ జాతీయులు, విదేశీయులు రెడ్‌ లిస్ట్‌ దేశాల నుంచి తిరిగి వస్తే ప్రభుత్వం అనుమతించిన క్వారంటైన్ హోటల్స్‌లో సొంత ఖర్చులతో పది రోజులు ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఇటు దేశంలో కొవిడ్‌ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మహమ్మారి ప్రారంభమైన తర్వాత రోజువారీ అత్యధిక కేసులు రావడం ఇదే తొలిసారి. దేశంలో కరోనా కేసులు 1.50 కోట్లకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ కేసుల్లో అమెరికా తర్వాత రెండోస్థానంలో భారత్‌ కొనసాగుతోంది.

Read Also…  India in travel red list: భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై బ్రిటన్ ఆంక్షలు.. ట్రావెల్‌ రెడ్ లిస్ట్ జాబితాలో చేర్చిన యూకే

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu