India in travel red list: భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై బ్రిటన్ ఆంక్షలు.. ట్రావెల్ రెడ్ లిస్ట్ జాబితాలో చేర్చిన యూకే
భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరగడంతో మన దేశం నుంచి ప్రయాణికుల రాకపై నిషేధం విధిస్తున్న దేశాల సంఖ్య పెరుగుతోంది.
Britain adds India to travel red list: భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరగడంతో మన దేశం నుంచి ప్రయాణికుల రాకపై నిషేధం విధిస్తున్న దేశాల సంఖ్య పెరుగుతోంది. తాజా కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో ట్రావెల్ రెడ్ లిస్ట్ దేశాల జాబితాలో బ్రిటన్ చేర్చింది. ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దయిన కొన్ని గంటల్లోనే ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఉదయం 3 గంటల నుంచి భారత్‌ను రెడ్ లిస్ట్ దేశాల జాబితాలో చేర్చినట్లు బ్రిటన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి మాట్ హాన్కాక్ సోమవారం తెలిపారు. యూకే, ఐరిస్ దేశీయులు తప్ప భారత్ నుంచి ప్రయాణికులపై నిషేధం విధించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికే ఏప్రిల్ 11 నుంచి 28 దాకా భారత్ నుంచి ప్రయాణికుల రాకపై న్యూజిలాండ్ నిషేధం విధించింది. తాజాగా మనదేశాన్ని రెడ్‌లిస్ట్‌లో పెడుతున్నట్టు యూకే ప్రకటించింది. ప్రపంచంలో ఏ దేశానికి చెందినవారైనా గత 10 రోజుల్లో భారతదేశంలో ఉండి ఉంటే, వారికి బ్రిటన్‌లో ప్రవేశం నిలిపివేస్తున్నట్లు తెలిపింది. భారత్ నుంచి వచ్చే బ్రిటిష్, ఐరిష్ పౌరులను మాత్రం అనుమతిస్తామని మాట్ హాన్కాక్ పేర్కొన్నారు. అయితే, వారు ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాల్లో 10 రోజులపాటు ఉండాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. భారత్‌లో కరోనా కేసుల పెరుగుదల, వందల సంఖ్యలో వేరియంట్ల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో రెడ్ లిస్ట్ దేశాల జాబితాలో చేర్చాల్సి వచ్చిందని పార్లమెంట్‌కు తెలిపారు. ఈ రెడ్‌లిస్ట్‌లో భారత్‌తో కలిపి 40 దేశాలు ఉన్నాయి. హాంకాంగ్ కూడా మంగళవారం ఏప్రిల్ 20 నుంచి మే 3 దాకా భారత్ నుంచి వచ్చే అన్ని విమానాలపై నిషేధం విధించింది. పాకిస్థాన్, ఫిలిప్పీన్స్ ప్రయాణికులపైనా కూడా నిషేధం విధించింది.
ఇప్పటికే ఈ దేశాల నుంచి హాంకాంగ్‌కు వచ్చి, పాజిటివ్‌గా తేలి, క్వారంటైన్‌లో ఉన్నవారు పాజిటివ్‌గా తేలిన నాటి నుంచి 26వ రోజున తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలన్న షరతు విధించింది బ్రిటన్ సర్కార్. మరోవైపు.. కేసులు ఆందోళనకరంగా ఉన్న మహారాష్ట్ర నుంచి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోని ప్రయాణికులను ఢిల్లీకి తీసుకొచ్చినందుకు కేజ్రీవాల్ సర్కార్ 4 విమానయాన సంస్థలపై ఫిర్యాదు చేసింది. మహారాష్ట్ర నుంచి ఢిల్లీకి ప్రయాణించాలంటే ఆర్టీపీసీఆర్ టెస్టులో నెగెటివ్ రావడాన్ని తప్పనిసరి చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఈ నెల మొదట్లో ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని ఉల్లంఘించినందుకు ఇండిగో, స్పైస్‌జెట్, విస్తారా, ఎయిర్‌ఏసియా సంస్థలపై కేజ్రీవాల్ ప్రభుత్వం పోలీసులకు ఫిర్యాదు చేసింది.