గణపతిని ఈ 21 ఆకులతో పూజించాలి

మోక్షదాయకం. సాధారణంగా ఏ కార్యం మొదలు పెట్టినా గణపతి పూజ తొలి పూజ. అయితే అన్ని సందర్బాల్లో కేవలం పసుపు గణపతి చేస్తే.. ఈ రోజు మాత్రం మట్టి గణపయ్యకు పూజించడం.. 21 రకాల పత్రాలను ఆయనకు సమర్పించడం అనాదిగా వస్తున్న పద్దతి....

గణపతిని ఈ 21 ఆకులతో పూజించాలి

గొరంత పత్రికే కొండంత వరాలను ఇచ్చే గణపయ్య ఎలా పూజించాలి.. వేటితో పూజించాలి. విఘ్నాలకు ఆధినాయకుడు మన విఘ్నేశ్వరుడు. భాద్రపద శుక్ల చవితి రోజున భక్తి శ్రద్ధలతో వినాయక పూజ జరుపుకోవడం పుణ్య ప్రదం. మోక్షదాయకం. సాధారణంగా ఏ కార్యం మొదలు పెట్టినా గణపతి పూజ తొలి పూజ. అయితే అన్ని సందర్బాల్లో కేవలం పసుపు గణపతి చేస్తే.. ఈ రోజు మాత్రం మట్టి గణపయ్యకు పూజించడం.. 21 రకాల పత్రాలను ఆయనకు సమర్పించడం అనాదిగా వస్తున్న పద్దతి.

వినాయక చవితి పూజా విధి. వినాయకుని ప్రతిమను రూపొందించడానికి కేవలం ‘కొత్త’మట్టినే ఎంచుకోవాలి. దానికి 21 పత్రాలతో పూజచేయాలి. గణపతిని నవరాత్రులు పూజించాక జలంలో నిమజ్జనం చేయాలి. ఇదీ పద్ధతి. పూజలో ఉపయోగించే 21 రకాల పత్రులు అనేవి సాధారణమైన ఆకులు కావు. ఇవన్నీ మహాత్కృష్టమైన, శక్తివంతమైన ఔషధులు. కలుషుతమైన నీటిని శుభ్రం చేయడానికి 21 పత్రాలతో చేసిన పత్రియే ఇందకు ఉదాహరణ. అవి బాక్టీరియాను నిర్మూలించి, జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి. ఇదీ వినాయక నిమజ్జనం వెనక ఉండే ‘పర్యావరణ పరిరక్షణ’ రహస్యం.

నాయకుడికి సమర్పించే 21 పత్రాలు వాటి ఔషధగుణాలు ..

1) మాచీపత్రం : మన దేశంలో ప్రతి చోట కనిపిస్తుంది. దీనిని తెలుగులో మాచ పత్రి అంటారు. చామంతి జాతికి చెందిన దీని ఆకు సువాసనా భరితంగా ఉంటుంది. ఇది నేత్రరోగాలకు అద్భుత నివారిణి. మాచీపత్రి ఆకుల్ని నీళ్ళలో తడిపి కళ్ళకి కట్టుకుంటే నేత్రవ్యాధులు నయమవుతాయి. ఇది చర్మరోగాలకు మంచి మందు. ఈ ఆకును పసుపు, నువ్వుల నూనెతో కలిపి నూరి ఆ ముద్దను చర్మవ్యాధి ఉన్న చోట పైపూతగా రోజు రాస్తూ ఉంటే వ్యాధి తొందర్లో నివారణ అవుతుంది. రక్తపు వాంతులకు, ముక్కు నుండి రక్తం కారుటకు మంచి విరుగుడు.

ఇది సమర్పించి గణపతిని ‘ఓం సుముఖాయ నమః – మాచీపత్రం పూజయామి’ అని అర్చించాలి.

2) బృహతీ పత్రం :  భారతదేశమంతటా విస్తారంగా ఎక్కడపడైతే అక్కడ పెరుగుతుంది బృహతీ పత్రం. దీనే మనం ‘వాకుడాకు’, ‘నేలమునగాకు’ అని పిలుస్తాం. దీనిని ములక అని కూడా అంటారు. దీనిలో చిన్న ములక పెద్ద ములక అని రెండు రకాలున్నాయి. పత్రాలు. వంగ ఆకులు మాదిరి. తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో ఉంటాయి. జీర్ణ, గుండె, చర్మ సంబంధ సమస్యలను
నివారించగలదు.

అటువంటి బృహతీపత్రాన్ని ‘ఓం గణాధిపాయ నమః – బృహతీ పత్రం పూజయామి’ అంటూ గణపతికి సమర్పించాలి.

3) బిల్వపత్రం : దీనికే మారేడు అని పేరు. శివుడికి అత్యంత ప్రీతికరం. బిల్వ వృక్షం లక్ష్మీస్వరూపం. ఇది మధుమేహానికి దివ్యౌషధం. పచ్చి మారేడు కాయలు విరోచనాలను తగ్గిస్తాయి, ఆకలిని పెంచుతాయి. మారేడు వ్రేళ్ళు, ఆకులు జ్వరాలను తగ్గిస్తాయి. ఇలా ఇంకా ఎన్నో ఔషధ గుణాలు బిల్వం సొంతం.

అటువంటి బిల్వపత్రాన్ని ‘ఓం ఉమాపుత్రాయ నమః – బిల్వపత్రం పుజాయామి’ అంటూ గణపతికి అర్పించి పూజించాలి.

4) దూర్వాయుగ్మం(గరిక) : గణపతికి అత్యంత ఇష్టమైనవస్తువు గరిక. ఒక్క గరిక సమర్పిస్తే చాలు, మహాసంతోషపడతాడు బొజ్జగణపయ్య. తులసి తరువాత తులసి అంత పవిత్రమైనది గరిక. దూర్వాయుగ్మం అంటే రెండు కోసలు కలిగివున్న జంటగరిక. ఈ గరిక మహాఔషధమూలిక. గరికను పచ్చడి చేసుకుని తింటే మూత్రసంబంధిత వ్యాధులు నయమవుతాయి.గాయాలు, ఆలర్జీలు, ఉదర సంబంధ సమస్యలను నివారించే గుణం దీనికి ఉంది.

ఓం గజననాయ నమః – దూర్వాయుగ్మం సమర్పయామి అంటూ స్వామికి గరికను సమర్పించాలి.

5) దత్తూర పత్రం : దీనిని మనం ఉమ్మెత్త అని కూడా పిలుస్తాం. ఉష్ణతత్వం కలిగినది. కఫ, వాతా దోషాలను హరిస్తుంది. కానీ ‘నార్కోటిక్’ లక్షణాలు కలిగినది కనుక వైధ్యుని పర్యవేక్షణ తీసుకోకుండా ఉపయోగించకూడడు. దుత్తూర పత్రం అంటే ఉమ్మెత్త. ముళ్ళతో కాయలు వంకాయ రంగు పూలు ఉంటాయి. కాలిన చర్మానికి, బొబ్బలకు ఈ ఆకు చక్కగా పని చేస్తుంది.

ఇలా ఎన్నో, ఇంకెన్నో ఔషధ గుణములు కలిగిన దత్తూర(ఉమ్మెత్త) పత్రాన్ని ‘ఓం హరసూనవే నమః – దత్తూరపత్రం పూజయామి’ అంటూ వరసిద్ధి వినాయకుడికి సమర్పించాలి.

6) బదరీ పత్రం : దీనినే రేగు అని పిలుస్తాం. బదరీ వృక్షం సాక్షాత్తు శ్రీ మన్నారాయణ స్వరూపం. చిన్నపిల్లల వ్యాధుల నివారణకు పనిచేస్తుంది. 3 ఏళ్ళ పైబడి 12 ఏళ్ళలోపు వయసులో ఉన్న పిల్లల్లో సామాన్యంగా వచ్చే అన్ని రకాల సాధారణ వ్యాధులకు ఉపయోగిస్తారు.

‘ఓం లంబోదరాయ నమః – బదరీ పత్రం పూజయామి’ అంటూ గణపతికి బదరీ పత్రం సమర్పించాలి.

7) అపామార్గ పత్రం: దీనికే ఉత్తరేణి అని వ్యవహారనామం. దీని కొమ్మలతో పళ్ళు తోముకుంటే దంతవ్యాధులు, ఆకులు నూరి పైపూతగా రాస్తే చర్మవ్యాధులు నివారణమవుతాయి. దీని పుల్లలు యజ్ఞయాగాదుల్లో, హోమాల్లో వినియోగించడం వలన హోమగుండం నుంచి వచ్చిన పొగను పీల్చడం చేత శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి.

‘ఓం గుహాగ్రజాయ నమః – అపామర్గ పత్రం పూజయామి’

8) తులసి: ‘తులానాం నాస్తు ఇతి తులసి’ – ఎంత చెప్పుకున్నా, తరిగిపోని ఔషధ గుణములున్న మొక్క తులసి. పరమ పవిత్రమైనది, శ్రీ మహాలక్ష్మీ స్వరూపం, విష్ణు మూర్తికి ప్రీతికరమైనది. తులసి మొక్క లేని ఇల్లు ఉండరాదు అంటుంది మన సంప్రదాయం. అంత గొప్ప తులసి గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాం.

కఫ, వాత, పైత్య దోషాలనే మూడింటిని శృతిమించకుండా అదుపులో ఉంచుతుంది తులసి. కాలుష్యాన్ని తగ్గిస్తుంది, తులసి వాసనకు దోమలు దరిచేరవు. తులసి ఆకులు, వేర్లు, కొమ్మలల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి.

‘ఓం గజకర్ణాయ నమః – తులసి పత్రం పూజయామి’ అంటూ గణపతికి తులసి పత్రాన్ని సమర్పించాలి.

9) చూత పత్రం : మామిడి ఆకులను చూత పత్రం అని సంస్కృత బాషలో అంటారు. మామిడి మంగళకరమైనది.  చెట్టు నుంచి కోసిన కొన్ని గంటల తరువాత కూడా ఆక్సిజెన్(ప్రాణవాయువు)ను విడుదల చేయగల శక్తి మామిడి ఆకులకుంది. మామిడి దేవతావృక్షం. అందువల్ల ఇంట్లో ఏ దిక్కులో మామిడి చెట్టున్నా మంచిదే.

ఓం ఏకదంతాయ నమః – చూతపత్రం పూజయామి అంటూ గణపతికి ఇన్ని విశిష్టతలున్న మామిడి ఆకులను సమర్పించాలి.

10) కరవీర పత్రం : దినినే మనం గన్నేరు అని పిలుస్తాం. గన్నేరుకు శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉందట. దీనినే గన్నేరు అంటారు. తెలుపు, పసుపు, ఎరుపు రంగుల పూలుంటాయి. పూజలో ఈ పూలకు విశిష్ట స్థానం ఉంది. క్యాన్సర్, ఆస్తమా నివారణకు ఉపయోగపడుతుందట.

‘ఓం వికటాయ నమః – కరవీర పత్రం పూజయామి’ అంటూ గణపతికి గన్నేరు ఆకులను సమర్పించాలి.

11) విష్ణుక్రాంత పత్రం : మనం వాడుకబాషలో అవిసె అంటాం. ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలి పువ్వులుండే రకాన్ని విష్ణుక్రాంత అంటారు. జ్ఞాపకశక్తిని పెంచడానికి, జుట్టు పెరుగుదలకు, జలుబు, దగ్గు, జ్వరం, ఆస్తమా, నరాల బలహీనత నివారణకు
ఉపయోగపడుతుంది విష్ణుక్రాంతం మేధస్సును పెంచుతుంది.

ఓం భిన్నదంతాయ నామః – విష్ణుక్రాంత పత్రం పూజయామి

12) దాడిమీ పత్రం : అంటే దానిమ్మ. భారతదేశమంతటా పెరిగే చెట్టు ఇది. లలితా సహస్రనామాల్లో అమ్మవారికి ‘దాడిమికుసమప్రభ’ అనే నామం కనిపిస్తుంది. దానిమ్మ పండు ఆకలిని, అరుగుదలను పెంచుతుంది. విరోచనాలను తగ్గిస్తుంది. గొంతురోగాలకు ఔషధం దానిమ్మ. దానిమ్మ పళ్ళు, పు
వ్వులు, ఆకులు, వేర్లు అన్ని ఔషధ గుణాలు కలిగినవై ఉంటాయి.

ఓం వటవే నమః – దాడిమీ పత్రం పూజయామి

13) దేవదారు : ఇది వనములలో, అరణ్యాలలో పెరిగే వృక్షం. పార్వతీ దేవికి మహాఇష్టమైనది. చల్లని ప్రదేశంలో, ముఖ్యంగా హిమాలయ పర్వతాల వద్ద పెరుగుతుంది ఈ వృక్షం. దేవదారు ఆకులను తెచ్చి ఆరబెట్టి, తరువాత ఆ ఆకులను నునెలో వేసి కాచి, చల్లార్చిన తరువాత నూనె తలకి రాసుకుంటే మెదడు కంటి సంబంధ రోగాలు దరిచేరవు.

ఓం సర్వేశ్వరాయ నమః – దేవదారు పత్రం పూజయామి

14) మరువక పత్రం : మనం దీన్ని వాడుక బాషలో మరువం అంటాం. ఇది అందరి ఇళ్ళలోనూ, అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నవారు కుండిల్లో కూడా పెంచుకోవచ్చు. మంచి సువాసనం కలది. మరువం వేడినీళ్లలో వేసుకుని ఆ నీటితో స్నానం చేస్తే శరీరానికున్న దుర్వాసన తొలగిపోతుంది.

ఓం ఫాలచంద్రాయ నమః – మరువక పత్రం పూజయామి

15) సింధువార పత్రం : వావిలి ఆకు. ఇది తెలుపు-నలుపు అని రెండు రకాలు. రెండింటిన్లో ఏదైనా వావికి ఆకులను నీళ్ళలో వేసి మరిగించిన నీటితో బాలింతలకు స్నానం చేయిస్తారు.

ఓం హేరంభాయ నమః – సింధువార పత్రం పూజయామి

16) జాజి పత్రం: జాజి పత్రానికి అనేక ఔషధ గుణాలున్నాయి. ఇది అని చోట్ల లభిస్తుంది. జాజిపూలు మంచి సువాసన కలిగి మనిషికి ఉత్తేజాన్ని, మనసుకు హాయిని కలిగిస్తాయి. ఈ సువాసన డిప్రేషన్ నుంచి బయటపడడంలో బాగా ఉపకరిస్తుంది. జాజి ఆకులు వెన్నతో నూరి ఆ మిశ్రమంతో పళ్ళుతోముకుంటే నోటి దుర్వాసన నశిస్తుంది.

ఓం శూర్పకర్ణాయ నమః – జాజి పత్రం సమర్పయామి

17) గండకీపత్రం: దీనిని మనం దేవకాంచనం అని పిలుస్తాం. థైరాయిడ్ వ్యాధికి ఔషధం గండకీ పత్రం. అరణ్యాలలో లభించే ఈ గండకీ చెట్టు ఆకు మొండి, ధీర్ఘవ్యాధులకు దివౌషధంగా పనిచేస్తుంది. చర్మరోగాలను, పైత్య రోగాలను హరిస్తుంది. దగ్గు, జలుబును హరిస్తుంది.

ఓం స్కంధాగ్రజాయ నమః – గండకీ పత్రం సమర్పయామి

18) శమీ పత్రం: దేని వ్యవహార నామం జమ్మి. మహాభారతంలో విరాటపర్వంలో పాండవులు దేనిమీదనే తమ ఆయుధాలను దాచిపెడతారు. జమ్మి ఆకుల పసరు తీసి దానిని పుళ్ళు ఉన్నచోట రాస్తే కుష్ఠువ్యాధి నశిస్తుందట. జమ్మి చెట్టు బెరడు దగ్గు, ఆస్తమా మొదలైన వ్యాధులకు ఔషధంగా పనిచేస్తారట.

ఓం ఇభవక్త్రాయ నమః – శమీ పత్రం సమర్పయామి

19) ఆశ్వత్థపత్రం: రావి వృక్షం. తులసి లేని ఇల్లు, వేపలేని వీధి, ఒక్క రావి చెట్టు కూడా లేని ఊరు ఉండరాదన్నది మన పెద్దలమట. రావి సాక్షాత్ శ్రీ మహావిష్ణుస్వరూపం. పరమాత్మయే తనును తాను రావిచెట్టుగా చెప్పుకున్నాడు. అందుకే యజ్ఞయాగాదులు, హోమాల్లో రావికొమ్మలను వాడుతారు. రావి వేర్లు దంతవ్యాధులకు మంచి ఔషధం.

ఓం వినాయకాయ నమః – అశ్వత్థ పత్రం సమర్పయామి

20) అర్జున పత్రం: మనం దీనినే మద్ది అంటాం. ఇది తెలుపు-ఎరుపు అని రెండు రంగులలో లభిస్తుంది. మద్ది చెట్టు హృదయ సంబంధిత జబ్బులకు మంచి ఔషధం. హృదయానికి సంబంధించిన రక్తనాళాలను గట్టిపరుస్తుంది. భారతదేశంలో నదులు, కాలువల వెంట, హిమాలయాలు, బెంగాలు, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో విరివిగా పెరుగుతుంది.

ఓం సురసేవితాయ నమః – అర్జున పత్రం సమర్పయామి

21) అర్క పత్రం: జిల్లేడు ఆకు. జిల్లేడు చెట్టు గణపతి స్వరూపం.

ఓం కపిలాయ నమః – అర్క పత్రం సమర్పయామి

శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమః – ఏకవింశతి పత్రాణి సమర్పయామి..

Click on your DTH Provider to Add TV9 Telugu