Breaking News తెలంగాణలో మే 7 దాకా లాక్ డౌన్
కేంద్రం ఒక్కరోజు జనతా బంద్ అంటే.. కేసీఆర్ వారం పాటు లాక్ డౌన్ అన్నారు. ఆ తర్వాత కేంద్రం 21 రోజుల పాటు లాక్ డౌన్ అంటే దాన్ని ఇంకా ఎక్కువ రోజులు పొడిగించాలన్న డిమాండ్‌ను ముందుకు తెచ్చారు.

కేంద్రం ఒక్కరోజు జనతా బంద్ అంటే.. కేసీఆర్ వారం పాటు లాక్ డౌన్ అన్నారు. ఆ తర్వాత కేంద్రం 21 రోజుల పాటు లాక్ డౌన్ అంటే దాన్ని ఇంకా ఎక్కువ రోజులు పొడిగించాలన్న డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. ఇపుడు కేంద్రం మే 3వ తేదీ దాకా లాక్ డౌన్ పొడిగిస్తే… తెలంగాణ ప్రభుత్వం ఏకంగా మే నెల 7వ తేదీ దాకా లాక్ డౌన్ కొనసాగించాలని భావిస్తోంది. ఆదివారం (ఏప్రిల్ 19) జరిగిన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ముందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన ప్రపోజల్ అదే. కేసీఆర్ పెట్టిన ప్రపోజల్‌కు యావత్ కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దాంతో మే 7వ తేదీ దాకా మరింత స్ట్రిక్టుగా లాక్ డౌన్ కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
అదే సమయంలో కేంద్రం ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఇవ్వనున్న సడలింపులను తెలంగాణలో ఇవ్వబోవడం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఏ మాత్రం సడలింపులు ఇచ్చినా కరోనా వైరస్ వ్యాప్తి మరింత వేగవంతమయ్యే ప్రమాదం వున్న నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన సూచనను పాటించవద్దని నిర్ణయం తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రానికి విమానాల ద్వారా ఎవరైనా వద్దాం అనుకుంటే వారంతా మే 7వ తేదీ దాకా తెలంగాణకు రావద్దని కేసీఆర్ కోరారు.
తెలంగాణాలో మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో స్విగ్గీ, జొమాటో సహా పలు పిజ్జా డోర్ డెలివరీలను సోమవారం (ఏప్రిల్ 20) నుంచి నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. అన్ని మతాల ప్రార్థనలను ఇళ్ళలోనే చేసుకోవాలని, సామూహిక ప్రార్థనలను అనుమతించబోమని ఆయన స్పష్టంగా చెప్పారు. రంజాన్ ప్రార్థనలను కూడా ఇళ్ళలోనే జరుపుకోవాలని ఆయన సూచించారు.
అదే రకంగా తెలంగాణలో అద్దెకుంటున్న వారు మార్చి నెల నుంచి మూడు నెలల పాటు ఇంటి ఓనర్లకు అద్దె చెల్లించ కుండా నిర్దిష్టంగా ఆదేశాలు జారీ చేశారు కేసీఆర్. కేబినెట్ సమావేశం తర్వాత ఈ నిర్ణయాలను కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. లాక్ డౌన్‌కు ప్రజలంతా సహకరించాలని, కంటైన్మెంట్ జోన్లలో పూర్తి బంద్‌కు కోపరేట్ చేయాలని ఆయన కోరారు.





