సహకరించండి…సీఏఏపై చర్చ జరగాలి: కెసిఆర్
జీఎస్టీ విషయంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నానని చెప్పారు సీఎం కేసీఆర్. శాసనసభ సమావేశాల్లో సీఏఏ పై విస్తృతంగా చర్చ జరగాలని సీఎం తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ...
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండోరోజు ప్రారంభమయ్యాయి. శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సమావేశాలకు అధ్యక్షత వహించారు. ఉభయ సభల్లో ఇవాళ ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ చేపట్టి ఆమోదం తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు ప్రవేశపెట్టగా, విప్ ప్రభాకర్ తీర్మానాన్ని బలపరిచారు. అదేవిధంగా శాసనసభలో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఎమ్మెల్యే వివేకానంద తీర్మానాన్ని బలపరిచారు.
శాసన సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ కొనసాగుతుండ ఎమ్మెల్యేలు రాజాసింగ్, అక్బరుద్దీన్ సిటిజెన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్(సీఏఏ)పై చర్చకు పట్టుబట్టారు. దీంతో ఇద్దరి మధ్య వాదనలు పెరిగాయి. పరస్పర వాదోపవాదనల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. సభలో సంయమనం పాటించాలని సూచించారు. జీఎస్టీ విషయంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నానని చెప్పారు. సీఏఏపై శాసనసభలో విస్తృతంగా చర్చ జరగాల్సి ఉందన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సీఏఏను వ్యతిరేకిస్తూ తీర్మానం చేశాయని చెప్పారు. తాము సీఏఏను పార్లమెంటులోనే వ్యతిరేకించామని ఆయన గుర్తు చేశారు. సీఏఏ అంశం దేశ భవిష్యత్తుపై ఆధారపడిన విషయంగా చెప్పారు. చర్చ ఒక రోజులో పూర్తయ్యేది కాదన్నారు సీకెం కేసీఆర్. ప్రజాస్వామ్యంలో భిన్నాభిపాయాలుంటాయని, అందరి అభిపాయాలు వినాల్సి ఉందని చెప్పారు. సీఏఏపై చర్చకు అందరికీ అవకాశం కల్పించాలని స్పీకర్‌ను కోరుతున్నట్లు చెప్పారు.