వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై తెలంగాణ నేతల ఫైర్.. కులాలు, మతాల పేరుతో చిచ్చు పెట్టొద్దని వార్నింగ్
సంకల్ప సభలో వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు భగ్గుమంటున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో మళ్లీ తెలంగాణను దోచుకునేందుకు వస్తున్నారని విమర్శించారు..
gutta sukhendar reddy sensational comments : సంకల్ప సభలో వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు భగ్గుమంటున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో మళ్లీ తెలంగాణను దోచుకునేందుకు వస్తున్నారని విమర్శించారు. తమకు పాలించుకునే సత్తా ఉందని, రాజన్న రాజ్యం అవసరం లేదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.
తెలంగాణలో సుస్థిర ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి, అలజడి సృష్టించే పన్నాగాలు ఇక్కడ సాగవని గుత్తా హెచ్చరించారు. ఎన్ని కుయుక్తులు పన్నిన, ఇలాంటి కుట్రలను తెలంగాణ ప్రజలు తిప్పికొడతారని ఆయన స్పష్టం చేశారు.
కులాల పేరుతో రెచ్చగొట్టేవారికి ప్రజలు బుద్ధిచెప్పాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇవాళ నల్లగొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. తెలంగాణను అస్థిరపరిచే శక్తులకు రాష్ట్రంలో స్థానంలేదన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగుతున్నదని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నదన్న ఆయన.. ఆంధ్రాపాలనలో తెలంగాణ ప్రజలు దోపిడీకి గురయ్యారని గుర్తి చేశారు. ఇంకా దుర్బుద్ధితో దోచుకునేందుకు కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయని గుత్తా విమర్శించారు. పోతిరెడ్డిపాడు, సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా నీటి దోపిడీ చేసిందెవరని ప్రశ్నించారు. గడీల పాలన తెలంగాణలో లేదని.. పులివెందులలోనే ఉందని వైఎస్ షర్మిలను ఉద్దేశించి ఘాటుగా స్పందించారు.
మరోవైపు, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తనదైన శైలిలో స్పందించారు. వైఎస్ షర్మిల కు పెద్దగా చరిష్మా లేదని , ఆమె కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు మాత్రమేనని హనుమంతరావు అన్నారు. ఓ వైపు తెలంగాణలో కరోనా విజృంభన చేస్తుంటే.. సంకల్ప సభకు ఎలా అనుమతి ఇస్తారని ఆయన డీజీపీ మహేందర్ రెడ్డిని ప్రశ్నించారు. బీజేపీతో పాటు టీఆర్ఎస్ పార్టీలు ఆంధ్ర ఓట్లను కొల్లకొట్టడానికే వైఎస్ షర్మిలను రంగంలోకి దింపారని ఆయన దుయ్యబట్టారు. షర్మిల రాజకీయాలు చేయాలంటే ఆంధ్రాలో చేసుకోవాలని ఆయన సూచించాడు. ఇక వైఎస్ విజయమ్మ, ఆంధ్రలో కొడుకు, తెలంగాణలో కూతురు ఉండాలని అనుకుంటున్నారా..? అంటూ ఆయన ఎద్దేవా చేశారు. Read Also…ED Raids: మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుని ఇంట్లో ఈడీ సోదాలు.. సంచలనం రేపుతున్న ఈఎస్‌ఐ కుంభకోణం