డేంజర్ జోన్‌గా మలక్‌పేట్ మార్కెట్

హైదరాబాదులోని మలక్‌పేట మార్కెట్ యార్డు డేంజర్ జోన్‌గా మారింది. రెండు రోజుల క్రితం మార్కెట్‌లో పనిచేస్తున్న ఓ హమాలీ కరోనా వైరస్ లక్షణాలతో చనిపోయాడు. దానికి తోడు మరో పండ్ల వ్యాపారి కూడా కరోనా వైరస్ బారిన పడి మృతి చెందాడు.

డేంజర్ జోన్‌గా మలక్‌పేట్ మార్కెట్
Follow us
Rajesh Sharma

|

Updated on: May 02, 2020 | 5:10 PM

హైదరాబాదులోని మలక్‌పేట మార్కెట్ యార్డు డేంజర్ జోన్‌గా మారింది. రెండు రోజుల క్రితం మార్కెట్‌లో పనిచేస్తున్న ఓ హమాలీ కరోనా వైరస్ లక్షణాలతో చనిపోయాడు. దానికి తోడు మరో పండ్ల వ్యాపారి కూడా కరోనా వైరస్ బారిన పడి మృతి చెందాడు. వీరిద్దరి కారణంగా ఇంకెంత మందికి కరోనా సోకిందోనని ఆందోళన అధికారుల్లో మొదలైంది. దాంతో మలక్‌పేట్ గంజ్‌ను రెడ్ జోన్‌గా ప్రకటించి.. విస్తృతంగా వైద్య పరీక్షలు ప్రారంభించారు.

రెండు రోజుల క్రితం మలక్‌పేట్ గంజ్ మార్కెట్‌లో పనిచేస్తున్న ఒక హమాలీ కరోనా లక్షణాలతో మృతిచెందాడు. ఆ వెంటనే మరో వ్యాపారస్తుడు కరోనా బారిన పడ్డాడు. ఒకరోజు తిరక్కుండానే ఆ వ్యాపారస్తుడు మృతి చెందడంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. స్థానిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఆ తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షలో చాలామంది వ్యాపారస్తులకు, కూలీలకు కరోనా వైరస్ లక్షణాలు బయట పడ్డాయి. వారందరిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు.

వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు శనివారం ఉదయం నుంచి మలక్‌పేట్ గంజ్ మార్కెట్‌ను అధికార యంత్రాంగం పూర్తిగా స్వాధీనం చేసుకుంది. అక్కడ బిజినెస్ చేసే వ్యాపారులకు, పనిచేసే కూలీలు, హమాలీలకు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే మలక్‌పేట మార్కెట్ ఇప్పుడు బోసిపోయి కనిపిస్తుంది. కనిపించిన ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే కరోనా వైరస్ ప్రభావం కనిపించిన 45 రోజుల నుంచి ఈ మార్కెట్‌కు ఎంతమంది వచ్చివెళ్ళి ఉంటారనే విషయంపై దృష్టి సారించారు. కాంట్రాక్ట్ ట్రేసింగ్‌ ప్రారంభించారు అధికారులు. ఇందుకోసం పోలీసుల సహాయాన్ని తీసుకుంటున్నారు.