జూన్ దాకా లాక్‌డౌన్ పొడిగింపు… కన్‌ఫర్మేనా?

దేశంలో లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తుంది? ఎప్పట్నించి నార్మల్ జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తాం? ఇవిప్పుడు దేశంలో ప్రతీ ఒక్కరిని తొలుస్తున్న లక్ష డాలర్ల ప్రశ్నలు. కేంద్రం చెప్పినట్లు మే నెల మూడో తేదీన లాక్ డౌన్ ముగుస్తుందా ? లే తెలంగాణ నిర్దేశించుకున్నట్లుగా మే 7వ తేదీన లాక్ డౌన్ ముగుస్తుందా? ఇవి అంతుచిక్కని ప్రశ్నలుగా మారాయి.

  • Rajesh Sharma
  • Publish Date - 2:13 pm, Fri, 24 April 20
జూన్ దాకా లాక్‌డౌన్ పొడిగింపు... కన్‌ఫర్మేనా?

దేశంలో లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తుంది? ఎప్పట్నించి నార్మల్ జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తాం? ఇవిప్పుడు దేశంలో ప్రతీ ఒక్కరిని తొలుస్తున్న లక్ష డాలర్ల ప్రశ్నలు. కేంద్రం చెప్పినట్లు మే నెల మూడో తేదీన లాక్ డౌన్ ముగుస్తుందా ? లే తెలంగాణ నిర్దేశించుకున్నట్లుగా మే 7వ తేదీన లాక్ డౌన్ ముగుస్తుందా? ఇవి అంతుచిక్కని ప్రశ్నలుగా మారాయి. కునారిల్లుతున్న ఆర్థిక వ్యవస్థ కారణంగా లాక్ డౌన్ ఇంకా ఎంతోకాలం కొనసాగించరని కొందరు వాదిస్తుంటే.. పెరుగుతున్న కరోనా కేసులు, ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తున్న ట్రండ్‌ని ఫాలో అవుతున్న వారు మాత్రం లాక్ డౌన్ కనీసం ఇంకో రెండు నెలలు కొనసాగక తప్పదంటున్నారు.

దేశంలో కరోనా కేసులను పరిశీలిస్తే.. ప్రస్తుతం 23 వేల 140 (ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 11 గంటల దాకా) కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు నెంబర్లలో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. నగరాలను పరిశీలిస్తే.. ముంబయి, ఢిల్లీ నగరాలు కరోనా కేసుల్లో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ముంబయి పరిస్థితి ఆందోళన కరంగా మారుతోంది.

దేశంలో అత్యధిక జనసాంద్రత వున్న నగరమైన ముంబయిలో కరోనా వ్యాప్తిని నియంత్రించే అవకాశాలు చాలా తక్కువగా వున్నాయంటున్నారు. ఇందుకు ధారవి వంటి స్లమ్‌ను ఉదాహరణగా చూపిస్తున్నారు. సుమారు పది లక్షల జనాభా కలిగిన ధారవి ఏరియాలో ఇప్పటికే కరోనా కేసులు రెండొందల సంఖ్యను దాటాయి.

మే నెలాఖరు నాటికి ఒక్క ముంబై నగరంలోనే 70 వేల కరోనా కేసులు నమోదవుతాయని తాజాగా ఓ స్టడీ వెలుగులోకి వచ్చింది. అదే సమయంలో మే నెలాఖరుకు దేశంలో కరోనా కేసులు లక్షన్నర దాటుతాయని మరో స్టడీ చెబుతోంది. ఈ నేపత్యంలో కరోనా వ్యాప్తిలో మే నెల అత్యంత కీలకం కాబోతోందన్నది సుస్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో లాక్ డౌన్ ఎత్తేస్తారా అన్నది సందేహాస్పదమే. కాకపోతే కేంద్రం ఇప్పటికి కొన్ని సడలింపులు ఇచ్చింది. మే నెల మూడో తేదీ తర్వాత కూడా ఇదే రకంగా గ్రీన్ జోన్లలో మాత్రమే సడలింపులు ఇచ్చే పరిస్థితి కనిపిస్తుందని పలువురు అంఛనా వేస్తున్నారు.

కరోనా ప్రబలుతున్న ముంబయి, ఢిల్లీ, అహ్మదాబాద్, సూరత్, ఇండోర్, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలలో మాత్రం జూన్ నెలాఖరుదాకా తీవ్ర స్థాయి ఆంక్షలనే కొనసాగించాలని ఐసీఎంఆర్ కేంద్రానికి సూచిస్తున్నట్లు సమాచారం. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా లాక్ డౌన్ సడలింపులు ఇప్పుడప్పుడే ఇవ్వవద్దని పలు దేశాలకు వార్నింగ్ ఇచ్చింది. జనసాంద్రత అధికంగా వుండే భారత్ వంటి దేశాలకు లాక్ డౌన్ మినహా మరో మార్గాంతరం లేదని కూడా డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది.

ఈ అన్ని అంఛనాలను, స్టడీలను, సూచనలను, గణాంకాలను పరిశీలించిన వారు దేశంలో లాక్ డౌన్ మరో రెండు నెలల కాలం కొనసాగే పరిస్థితి వుందని చెబుతున్నారు. విదేశీ విమానాలు కూడా మే నెలలో ప్రారంభం కాబోవని, దానికి జూన్ నెలలోనే ముహూర్తం కుదరవచ్చని అంటున్నారు. మొత్తానికి లాక్ డౌన్ త్వరలో ముగుస్తుందని భావిస్తున్నవారి ఆశలు నెరవేరే సంకేతాలు మాత్రం అంతంత మాత్రమే.