“మోదీ మన్ కీబాత్’ ఏమన్నారో తెలుసా..?
మందులేని మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలో ప్రధాని మోదీ నేర్పుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరోమారు మోదీ మన్‌కీ బాత్ వెల్లడించారు.

కంటికి కనిపించని శత్రువుతో ప్రపంచ దేశాలు ఉమ్మడిగా యుద్ధం చేస్తున్నాయి. కరోనాపై పోరులో భారత్ సైతం పకడ్బందీ ప్రణాళికలతో ఫైట్ చేస్తోంది. ఈ తరుణంలో ప్రధాని నరేంద్రమోదీ దేశప్రజలను ఎప్పటికప్పుడు సమాయత్తం చేస్తూ యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు. ప్రజల్లో వైరస్ పై ఉన్న అపోహలు, అనుమానాలు వదిలిపోయేలా స్పూర్తిని నింపుతున్నారు. మందులేని మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలో నేర్పుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరోమారు మోదీ మన్‌కీ బాత్ వెల్లడించారు.
కరోనాపై ప్రజలే ముందుండి యుద్ధం చేస్తున్నారని ప్రధాని మోదీ కితాబిచ్చారు. ఆకాశవాణి ద్వారా మన్ కీబాత్ కార్యక్రమంలో ప్రజలతో తన మనోభావాలను పంచుకున్నారు. విపత్తు సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని మోదీ అన్నారు. కరోనా సృష్టించిన విలయాన్ని అధిగమించేందుకు అన్ని వర్గాలూ కొత్త మార్గాల గురించి అన్వేషిస్తున్నాయని చెప్పారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా దేశంలోని ప్రతి ఒక్కళ్లూ లాక్‌డౌన్‌ను పాటిస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమానికి ప్రజలు మద్దతుగా నిలిచారని చెప్పారు. కరోనాపై సమరంలో ఉద్యోగులు, ఫించన్‌దారులు తమ వేతనాలో కొంత త్యాగం చేశారన్నారు. సామాన్యుల నుంచి వైద్యులు, పోలీసులు, ఇతర సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని, కరోనాపై పోరాటంలో ప్రజలు చూపుతున్న స్ఫూర్తికి సెల్యూట్ చేస్తున్నానన్నారు. ప్రపంచ దేశాలకూ భారతీయులు స్ఫూర్తిగా నిలుస్తున్నారని, ఎంతో మంది దాతలు పేదలకు అండగా ఉంటున్నారని అన్నారు. ఈ యుద్ధంలో విజయం సాధించాలంటే ఇదే స్ఫూర్తి కొనసాగించాలని ప్రదాని పిలుపునిచ్చారు.




