2047 టార్గెట్: అగ్రశ్రేణి లాజిస్టిక్ హబ్‌గా తెలంగాణ, వేలాది ఉద్యోగాలకు బంగారు బాట
తెలంగాణను 2047 నాటికి దేశంలో అగ్రశ్రేణి లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముంబైలో ఈ విజన్‌ను ఆవిష్కరించారు. మౌలిక సదుపాయాల విస్తరణ, డిజిటల్ ఇంటిగ్రేషన్, నైపుణ్యాభివృద్ధి ద్వారా 'ఫ్యూచర్ రెడీ ఎకోసిస్టమ్'ను నిర్మిస్తూ, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ రంగాలలో పెట్టుబడులకు రాష్ట్రం ఆహ్వానం పలుకుతోంది.

తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం దృఢసంకల్పంతో ముందుకెళ్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ముంబైలో జరిగిన ‘ట్రాన్స్‌పోర్ట్ లాజిస్టిక్ ఇండియా 2026’ సదస్సులో పాల్గొన్న ఆయన, రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే కీలక రంగాల్లో లాజిస్టిక్స్ ఒకటని మంత్రి స్పష్టం చేశారు. 2047 నాటికి ఈ రంగంలో తెలంగాణను తిరుగులేని శక్తిగా నిలబెట్టే లక్ష్యంతో సమగ్ర కార్యాచరణ రూపొందించామని తెలిపారు. ప్రస్తుతం దేశ జీడీపీలో 5 శాతం వాటా కలిగిన తెలంగాణ, దీన్ని 10 శాతానికి పెంచే దిశగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌ను అమలు చేస్తోందన్నారు.
మౌలిక సదుపాయాల విస్తరణ, డిజిటల్ ఇంటిగ్రేషన్, పారదర్శక పాలసీలు, గ్రీన్ లాజిస్టిక్స్, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలతో ‘ఫ్యూచర్ రెడీ ఎకోసిస్టమ్’ నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసుల మార్పులు, ఏఐ ఆధారిత సాంకేతికతలు, సస్టైనబిలిటీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ తన భౌగోళిక ప్రయోజనాలను సమర్థంగా వినియోగించుకుంటోందన్నారు.
రీజినల్ రింగ్ రోడ్, మెట్రో ఫేజ్–2, కొత్త విమానాశ్రయాలు, డ్రై పోర్టు, లాజిస్టిక్స్ పాలసీ 2.0, ప్రత్యేక లాజిస్టిక్ హబ్స్ వంటి ప్రాజెక్టులు రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దనున్నాయని వివరించారు. మల్టీమోడల్ కనెక్టివిటీ, రైల్ లింకులు, ఎయిర్ కార్గో సదుపాయాలు, కోల్డ్ చైన్ వ్యవస్థలు, ఆధునిక వేర్ హౌజింగ్, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.
లాజిస్టిక్స్ రంగానికి అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీతో పాటు ఇతర భాగస్వామ్య సంస్థల సహకారంతో ‘రెడీ టు వర్క్’ మానవ వనరులను తయారు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఉత్పత్తి మాత్రమే కాదు, వేగవంతమైన సరఫరా సామర్థ్యంతో ‘లాజిస్టిక్ పవర్ హౌస్’గా తెలంగాణ ఎదగగలదని ధీమా వ్యక్తం చేశారు.
లాజిస్టిక్స్, వేర్ హౌజింగ్, గ్రీన్ మొబిలిటీ, ఆటోమేషన్, డిజిటల్ సొల్యూషన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు మంత్రి పిలుపునిచ్చారు. వేగవంతమైన అనుమతులు, పారదర్శక విధానాలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




