లాక్ డౌన్ మీద సీక్రెట్ సర్వే
దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ మీద కేంద్ర ప్రభుత్వం సీక్రెట్ గా సర్వే చేయిస్తోందా ? దేశ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే నిజమనిపిస్తుంది.

దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ మీద కేంద్ర ప్రభుత్వం సీక్రెట్ గా సర్వే చేయిస్తోందా ? దేశ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే నిజమనిపిస్తుంది. పరిస్థితి ప్రమాదకరంగా ఉందనుకున్న పెద్ద నగరాలకు, రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అధ్యయన బృందాలను పంపింది.
హైదరాబాద్ నగరంతో పాటు కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న ముంబై, సూరత్, ఇండోర్, చెన్నై, అహ్మదాబాద్ వంటి నగరాలతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అధ్యయన బృందాలను పంపింది.
గత రెండు రోజులుగా అంటే ఏప్రిల్ 25, 26 తేదీలలో తెలంగాణలో పర్యటిస్తున్న కేంద్ర బృందం.. రాష్ట్రంలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అమలవుతున్న లాక్ డౌన్ పరిస్థితులను, లాక్ డౌన్ పీరియడ్ లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తీరుతెన్నులను రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేసింది. కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షల అమలు తీరును పరిశీలించింది.
మే నెల 3వ తేదీ తర్వాత దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఎత్తి వేయాల్సి వస్తే కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రాంతాలను ఎలా ట్రీట్ చేయాలి అనే విషయంలో ఒక నిర్దిష్టమైన కార్యాచరణను రూపొందించేందుకు రెడ్ జోన్లు, కంటైన్మెంట్ ఏరియాలు, ప్రత్యేక ఆసుపత్రులు, క్వారంటైన్ జోన్లను కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం నిశితంగా పరిశీలించింది. తమకు కలిగిన సందేహాలను రాష్ట్ర ప్రభుత్వ వర్గాల నుంచి తీర్చుకునే ప్రయత్నం చేసింది.
హైదరాబాద్ వచ్చిన కేంద్ర ప్రభుత్వ బృందం తరహాలోనే కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందిన ముంబై వంటి నగరాలకు కూడా కేంద్ర బృందం పర్యటనకు వెళ్లింది. అక్కడ కూడా రెడ్ జోన్లు, కంటైన్మేంట్ ఏరియాలు, ప్రత్యేక కరోనా ఆసుపత్రులు, క్వారంటైన్ సెంటర్లను కేంద్ర బృందం పరిశీలించింది.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మరికొంత కాలం కొనసాగించడం వల్ల ఆర్థికపరమైన సంక్షోభం తీవ్రమయ్యే పరిస్థితి ఉన్నందున కేవలం కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు లాక్ డౌన్ పరిమితం చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సీక్రెట్ సర్వే కోసమే కేంద్ర బృందాలను రాష్ట్రాలకు పంపినట్లుగా ఢిల్లీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.




