AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పార్టీ ఆవిర్భావ వేడుకలపై కెసిఆర్ సంచలన నిర్ణయం

సోమవారం ఏప్రిల్ 27వ తేదీ జరగనున్న టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ ఉత్సవాల విషయంలో గులాబీ బాస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఈ నిర్ణయాన్ని పార్టీ నేతలకు, పార్టీ శ్రేణులకు కేసీఆర్ తెలియజేశారు.

పార్టీ ఆవిర్భావ వేడుకలపై కెసిఆర్ సంచలన నిర్ణయం
Rajesh Sharma
|

Updated on: Apr 26, 2020 | 2:50 PM

Share

కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం జరగాల్సిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ ఉత్సవాలను అత్యంత నిరాడంబరంగా జరుపుకోవాలని గులాబీ బాస్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు పార్టీ వర్గాలకు సూచించారు. టిఆర్ఎస్ పార్టీ వర్గాలు ఎవరికి వారు తమ ఇళ్ల కే పరిమితమై పార్టీ జెండాను ఆవిష్కరించి కోవాలని ఇళ్లపై పార్టీ పతాకాన్ని ఎగుర వేయాలని కెసిఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఎవరికి వారు తమ ప్రాంతాల్లో అత్యంత నిరాడంబరంగా ఎక్కడికక్కడే పతాకావిష్కరణ చేయాలి.

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ప్రజలకు, పార్టీ శ్రేణులకు కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాన లక్ష్యమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో పాటు, సాధించుకున్న తెలంగాణలో అన్ని రంగాల్లో గొప్ప విజయాలను టిఆర్ఎస్ పార్టీ సాధించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

‘‘టిఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన ఆరేళ్లలో అనేక అద్భుతాలు సాధించింది. సంక్షేమం, విద్యుత్, మంచినీరు, సాగునీరు, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో గొప్ప విజయాలు నమోదు చేసింది. ప్రజలు దశాబ్దాల తరబడి ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించింది. టిఆర్ఎస్ పార్టీ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నది. ఇది టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణం’’ అని కేసిఆర్ ప్రకటించారు.

‘‘టిఆర్ఎస్ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు గడిచిన సందర్భంగా గొప్పగా జరుపుకోవాల్సిన వేడుకులను కరోనా వైరస్ నేపథ్యంలో నిరాడంబరంగా జరుపుకోవాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. మరో సందర్భంలో పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం. ఈ సారికి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఎవరికి వారు తమ ప్రాంతాల్లో అత్యంత నిరాడంబరంగా ఎక్కడికక్కడే పతాకావిష్కరణ చేయాలి. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించాలి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఖచ్చితంగా లాక్ డౌన్ నిబంధనలు, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు పాటించాలి’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.

పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం 9.30 గంటలకు తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సామాజిక దూరాన్ని ఖచ్చితంగా పాటించేలా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ భవన్ వర్గాలను కెసిఆర్ ఆదేశించారు.