కాలుష్యం కోరల్లో ఇండియా.. 48కోట్ల మందికి మృత్యు ముప్పు..

ప్రపంచ పర్యవరణవేత్తల హెచ్చరికలను బేఖాతరు చేసిన కారణంగా మనదేశం వచ్చే ఏడేళ్ళలో భారీ మూల్యం చెల్లించుకోబోతోందా ? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తుంది. అంతే కాదు.. ఈ మూల్యం అంతా ఇంతా కాదు.. ఏకంగా 48 కోట్ల మంది.. అంటే దేశ జనాభాలో సుమారు 36 శాతం మందికి మృత్యు ముప్పు కనిపిస్తోంది. విపరీతంగా పెరుగుతున్న కాలుష్యం భారతీయ నగరాలను కమ్మేస్తోంది. ఈ నగరాల్లో నివసించే వారి ఆయుష్షును అడ్డంగా కోసేస్తోంది. పెరుగుతున్న కాలుష్యం మనుషులపైనే […]

కాలుష్యం కోరల్లో ఇండియా.. 48కోట్ల మందికి మృత్యు ముప్పు..
Follow us
Rajesh Sharma

|

Updated on: Nov 01, 2019 | 2:21 PM

ప్రపంచ పర్యవరణవేత్తల హెచ్చరికలను బేఖాతరు చేసిన కారణంగా మనదేశం వచ్చే ఏడేళ్ళలో భారీ మూల్యం చెల్లించుకోబోతోందా ? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తుంది. అంతే కాదు.. ఈ మూల్యం అంతా ఇంతా కాదు.. ఏకంగా 48 కోట్ల మంది.. అంటే దేశ జనాభాలో సుమారు 36 శాతం మందికి మృత్యు ముప్పు కనిపిస్తోంది. విపరీతంగా పెరుగుతున్న కాలుష్యం భారతీయ నగరాలను కమ్మేస్తోంది. ఈ నగరాల్లో నివసించే వారి ఆయుష్షును అడ్డంగా కోసేస్తోంది.
పెరుగుతున్న కాలుష్యం మనుషులపైనే కాదు.. సమస్త జీవరాశిపై పెను ప్రభావాన్ని చూపిస్తోంది. ఇదే తీరు కొనసాగితే జీవరాశి భూమ్మీద మిగలదు అంటే అతిశయోక్తి కాదు. ఈ కాలుష్య ప్రభావాన్ని తగ్గించేందుకు ఏకంగా ప్రపంచ దేశాలన్నీ ఒక్క తాటిపైకి వచ్చి హీటెక్కుతున్న భూగ్రహంలో వేడిని 2 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు తగ్గించాలని ప్యారిస్ ఒప్పందం చేసుకున్నాయి. అయితే ఈ ఒప్పందాన్ని అమలు చేయడంలో భారత్ ఘోరంగా విఫలమైందని అంతర్జాతీయ సమాజం ఆరోపిస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీ నగర కాలుష్యం గురించి తరచూ వార్తలు చూస్తున్నాం. ఒక్క ఢిల్లీలోనే దారుణమైన పరిస్థితి వుంది అనుకుని మిగిలిన ప్రాంతాల్లో నివసిస్తున్నవారు నిశ్చింతగా వుండే పరిస్థితి లేదు. ఉదాహరణకు హైదరాబాద్ నగరంలోను దారుణమైన కాలుష్య ప్రభావం వుందని ఇటీవల పలు నివేదికలు తేల్చాయి. ఢిల్లీనో.. హైదరాబాద్ అనో అనే తేడా లేకుండా.. పలు భారతీయ మెట్రోపాలిటన్ సిటీలు, ఇతర నగరాలు.. దారుణమైన కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి.
నగరాలతోపాటు పారిశ్రామికవాడలు వెదజల్లుతున్న కాలుష్యం కారణంగా మన దేశంలో కాలుష్య ప్రభావం నిర్ణీత స్థాయులను ఎప్పుడో దాటేసింది. ప్రభుత్వాల తూతూమంత్రం చర్యలు.. ప్రజల్లో అవగాహన లేమి.. వెరసి కాలుష్యం పెరిగేందుకు కారణమవుతోంది.
తాజాగా చికాగో యూనివర్సిటీకి చెందిన ఎనర్జీ పాలసీ సంస్థ (ఎపిక్) కాలుష్య ప్రభావ దేశాల్లో సర్వే నిర్వహించింది. సర్వే వివరాల ప్రకారం చూస్తే భారత దేశంలో చాలా అలార్మింగ్ పరిస్థితి ఉన్నట్లు తేటతెల్లమైంది. మొత్తం 225 దేశాలలో కాలుష్య ప్రమాణాలపై సర్వే చేపట్టారు. 2.5 పర్టిక్యులేట్‌ను పరిగణలోకి తీసుకున్నారు.
ఈ సర్వే నివేదిక ప్రకారం భారత దేశం కాలుష్య ప్రభావ దేశాలలో రెండో స్థానంలో నిల్వడం మన దేశం ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో వుందో తెలియచేస్తోంది. మొదటి స్థానంలో నేపాల్ వుంది. అంటే రెండు పొరుగు దేశాలు కలిసి భూమండలాన్ని హీటెక్కిస్తున్నాయని సర్వే తేల్చిందన్న మాట. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన పరిధి మేరకు కాలుష్యాన్ని అదుపు చేయడంలో విఫలమైందని తేలింది.
ఇంత దారుణమైన పరిస్థితి దేశంలో 48 కోట్ల మందిపై తీవ్ర ప్రభావం చూపుతోందని అంఛనా వేస్తున్నారు. అంటే భారత దేశంలో 36 శాతం ప్రజలు కాలుష్య కోరల్లో మగ్గుతున్నారు. ఫలితంగా వారి ఆయుర్దాయం ఏడేళ్ళు తగ్గిపోయిందని సర్వేలో తేల్చారు. 2013-2017 మధ్య కాలంలో శాంపిల్ సర్వే ఆధారంగా చూస్తే భారతీయుల సగటు ఆయుర్ధాయం 67 నుంచి 69 ఏళ్ళకు పెరిగినప్పటికీ.. కాలుష్య ప్రభావంతో అది ఏడేళ్ళు కుదింపబడి.. 60-62 సగటు ఆయుర్ధాయంగా మారిందని తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తర భారత ప్రాంతాల్లో నివసిస్తున్న వారు విపరీతమైన కాలుష్య ప్రభావంలో జీవిస్తున్నట్లు సర్వే తెలియజెప్పింది.
1998 సంవత్సరానికి ముందు భారత దేశంలో కాలుష్యం ప్రభావం అంతగా లేదని గత 20 సంవత్సరాలలో ఇండియాలో కాలుష్యం స్థాయులు విపరీతంగా పెరిగి ప్రమాదపుటంచుకు చేరాయని నివేదికలో ప్రస్తావించారు. దేశంలోని ఏడు రాష్ట్రాలలో ఈ 20 ఏళ్ళ కాలం కాలుష్య ప్రభావం రెట్టింపైంది. చాలా దేశాల కంటే రెండు, మూడు రెట్ల కాలుష్యం ఈ ఏడు రాష్ట్రాలలో నమోదైంది. సో. కాలుష్య కారకాలను గుర్తించడమే కాదు.. ప్రతీ ఒక్క పౌరుడు కాలుష్యం తగ్గించడం సొంత బాధ్యతగా భావిస్తే తప్ప భారత దేశంలో కాలుష్య కోరల ప్రభావం తగ్గి.. ఎంతో కొంత పరిస్థితి మెరుగుపడే ఛాన్స్ వుంటుందని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు.