కేరళ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు షాక్.. ఎన్‌సీపీలో చేరిన మాజీ ఎంపీ పిసి చాకో.. ఎల్‌డిఎఫ్ తరుపున ప్రచారం
కాంగ్రెస్ మాజీ నాయకుడు పిసి చాకో కాంగ్రెస్ పార్టీని వీడి మంగళవారం శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) లో చేరారు.
PC Chacko joins in NCP : కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బ తగిలింది. కాంగ్రెస్ మాజీ నాయకుడు పిసి చాకో కాంగ్రెస్ పార్టీని వీడి మంగళవారం శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) లో చేరారు. కేరళలోని ఎన్‌సిపితో పొత్తు పెట్టుకున్న పాలక లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్) కోసం చాకో ప్రచారం చేయనున్నారు. పిసి చాకో గతంలో త్రిశూర్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యులుగా కూడా పనిచేశారు.
ఈ సందర్భంగా చాకో మాట్లాడుతూ.. “నేను ఈ రోజు అధికారికంగా ఎన్‌సిపిలో చేరుతున్నాను. ఎన్‌సిపి కేరళలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్‌లో భాగం. మరోసారి ఎన్‌సిపిలో భాగంగా ఎల్‌డిఎఫ్‌లోకి తిరిగి వచ్చాను” అని ఆయన చెప్పారు. కేరళ ప్రజలు కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావాలని కోరుకుంటున్నారని, అయితే పార్టీలోని వర్గ విభేదాల కారణంగా ఇది కష్టమేనని అన్నారు.
Delhi: Former Congress leader PC Chacko joins Nationalist Congress Party, in the presence of party chief Sharad Pawar pic.twitter.com/L1qOUXoqrt
— ANI (@ANI) March 16, 2021
కాంగ్రెస్ సీనియర్ నాయకుడుగా క్రియాశీలకంగా వ్యవహరించిన పిసి చాకో గత మార్చి 10న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ‘పూర్తిగా వైఫల్యం’ చెందిందని అయన ఆరోపించారు. తాను అన్ని పదవులకు రాజీనామా చేసి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సమర్పించినట్లు తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు గెలుపు సామర్థ్యం ఆధారంగా అభ్యర్థులను కాంగ్రెస్ ఎంపిక చేయలేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రెండు వర్గాలుగా (ఎ అండ్ ఐ) విడిపోయిందని, ఈ రెండు వర్గాలకు చెందని వారిని రక్షించాలని పార్టీ హైకమాండ్‌ను కోరినట్లు పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ స్పందించలేదని అందుకే కాంగ్రెస్ పార్టీ వీడి ఎన్‌సీపీలో చేరినట్లు ఆయన తెలిపారు.