AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాడా నెత్తిన హుజూర్ నగర్ బండ.. కారణమేంటంటే..?

అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికలు మిగిలిన పార్టీలకు ఏమో గానీ.. సిపిఐ పార్టీకి తలనొప్పిగా మారాయి. ఒకసారి తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతు ప్రకటించి.. ఆర్టీసీ సమ్మె సాకుతో వెనక్కి తీసుకున్నారు. ఆర్టీసీలో బాగా బలంగా వున్న ఎంప్లాయిస్ యూనియన్… సీపీఐ పార్టీకి కొన్ని దశాబ్దాలుగా వెన్నుదన్నుగా నిలుస్తోంది. నిజానికి సిపిఐ అనుబంధ కార్మిక సంఘాల్లో ఎంప్లాయిస్ యూనియనే అత్యంత బలమైనది. ఈ క్రమంలోనే సీపీఐ పార్టీ హుజూర్ నగర్ ఉప […]

చాడా నెత్తిన హుజూర్ నగర్ బండ.. కారణమేంటంటే..?
Rajesh Sharma
| Edited By: Nikhil|

Updated on: Oct 14, 2019 | 5:53 PM

Share

అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికలు మిగిలిన పార్టీలకు ఏమో గానీ.. సిపిఐ పార్టీకి తలనొప్పిగా మారాయి. ఒకసారి తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతు ప్రకటించి.. ఆర్టీసీ సమ్మె సాకుతో వెనక్కి తీసుకున్నారు. ఆర్టీసీలో బాగా బలంగా వున్న ఎంప్లాయిస్ యూనియన్… సీపీఐ పార్టీకి కొన్ని దశాబ్దాలుగా వెన్నుదన్నుగా నిలుస్తోంది. నిజానికి సిపిఐ అనుబంధ కార్మిక సంఘాల్లో ఎంప్లాయిస్ యూనియనే అత్యంత బలమైనది. ఈ క్రమంలోనే సీపీఐ పార్టీ హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి మద్దతిచ్చే విషయంలో యూ టర్న్ తీసుకుంది.

నిజానికి హుజూర్ నగర్ లో మద్దతివ్వాల్సిందిగా కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు సిపిఐ రాష్ట్ర నాయకత్వాన్ని కోరగా.. సిపిఐ నేతలు గులాబీ పార్టీవైపే మొగ్గు చూపారు. టిఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించిన చాడా వెంకట్ రెడ్డిపై ఎన్నో ఊహాగానాలు సోషల్ మీడియాలో కోడై కోశాయి. గులాబీ నేతల నుంచి వచ్చిన బారీ నజరానాకు ఆశపడే… ఆయన టిఆర్ఎస్ పార్టీకి మద్దతివ్వాలన్న నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియాలో విస్తృతంగా కథనాలొచ్చాయి. భారీ నజరానాతోపాటు ఎమ్మెల్సీ పదవికి ఆశపడే చాడా గులాబీ దళంవైపు మొగ్గుచూపారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

అదే సమయంలో… మొదలైన ఆర్టీసీ సమ్మె… అందులో కీలక కార్మిక సంఘం ఎంప్లాయిస్ యూనియన్ ఒత్తిడి వెరసి… టిఆర్ఎస్ పార్టీకి మద్దతిచ్చే విషయంలో సిపిఐ పార్టీ యూ టర్న్ తీసుకునేందుకు కారణమయ్యాయి. ఒక వైపు ఆరోపణల నుంచి బయట పడడం.. ఇంకో వైపు కార్మికుల మనసు చూరగొనడంతో.. సిపిఐ నేతలు.. మరీ ముఖ్యంగా చాడా వెంకట రెడ్డి ఆనందంగానే కనిపించారు. అయితే.. ఆ ఆనందం ఎన్నో రోజులు కొనసాగలేదు.

తాజాగా సిపిఐ నేతలకు కొత్త సమస్య మొదలవడంతో హుజూర్ నగర్ విషయంలో మరోసారి ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తింది. అది కాస్తా సిపిఐ రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పిగా మారింది. దీనికి కారణం టిఆర్ఎస్ నేతల ఒత్తిళ్ళే కారణమని తెలుస్తోంది. గట్టి హామీలు పొందిన తర్వాత ఇచ్చిన మద్దతును ఎలా ఉపసంహరించుకుంటారని గులాబీ నేతలు సిపిఐ రాష్ట్ర నాయకత్వాన్ని నిలదీయడంతో చాడా వంటి నేతలు ఇరకాటంలో పడినట్లు సమాచారం.

ఈ క్రమంలో హుజూర్ నగర్లో టిఆర్ఎస్ మరోసారి మద్దతు ప్రకటించేందుకు సిపిఐ నేతలు సిద్దమవుతున్నా వారికి ఆర్టీసీ సమ్మె అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. సమ్మె ముగిసిన వెంటనే మద్దతు ప్రకటించాలని సిపిఐ పార్టీలోని ఒక వర్గం భావిస్తుండగా.. ఇప్పుడే మద్దతు ప్రకటిద్దామని మరికొందరు పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ రెండు రకాల వాదనలో సిపిఐ పార్టీలో అగమ్యగోచర పరిస్థితి తలెత్తినట్లు విశ్వసనీయ సమాచారం.