ఏపీలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు.. కొత్తగా నిబంధనల అమలు దిశగా రాష్ట్ర సర్కార్!

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

ఏపీలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు.. కొత్తగా నిబంధనల అమలు దిశగా రాష్ట్ర సర్కార్!
Corona Virus Tests
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 18, 2021 | 8:17 PM

AP coronavirus cases : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి రోజు రెండు వందలకు తగ్గకుండా కేసులు నమోదు అవుతుండడం భయాందోళనకు గురిచేస్తోంది. భారత్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. మరోసారి కఠిన నిబంధనలు అమలు చేయాలని భావిస్తోంది.

తాజాగా ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31,165 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 218 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఒక్కరు కూడా మరణించలేదని వైద్య శాఖ వెల్లడించింది. ఇక, ఇవాళ కొత్తగా 117 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,92,740 కి చేరుకుంది. ఇక ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 8,83,759కి చేరింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాతో 7,186 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,795 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో వెల్లడించింది రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ.

Ap Coronavirus Cases

Ap Coronavirus Cases

కాగా, కరోనా నిబంధనల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాల్లో కోవిడ్ నిబంధనల్ని తప్పక అమలు చేయాలని మరోమారు ఆదేశాలు జారీ చేసింది. కరోనా రెండో దశ వ్యాపిస్తున్నందున్న నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. అవకాశం ఉన్నంత వరకు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని మరో మారు అవలంభించాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దేశంలోనూ రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా పరిశ్రమలు, దుకాణ సముదాయాలు, ఫ్యాక్టరీల్లో నియంత్రణా చర్యలకు ఆదేశాలు జారీ చేసింది.

ఇక, రవాణా వాహనాలు, యంత్రాలు, ప్రాంగణాల్ని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ వ్యక్తుల మధ్య భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలంటూ కంపెనీలను ఆదేశించింది రాష్ట్ర సర్కార్. ముఖ్యంగా వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలు, దుకాణాల్లోకి ప్రవేశించే సమయంలో థర్మల్ స్కానింగ్ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. మాస్కులు, శానిటైజేషన్, భౌతిక దూరం విధిగా పాటించేలా చూడాలని స్పష్టంగా తెలిపింది. డైనింగ్ హాళ్లు, క్యాంటీన్లలో ప్రతీ రెండు గంటలకూ శానిటేషన్ చేయాల్సిందిగా ఆదేశించింది. ఉద్యోగులు, సిబ్బందికి వ్యాక్సినేషన్ వేయించేందుకు చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా జరుగుతున్నసమయంలో.. కేసుల పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజల్లో నిర్లక్ష్యంగా కారణంగా కేసులు సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.

Read Also..  మంత్రుల ఫిర్యాదుపై చర్చించిన అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ.. నిమ్మగడ్డకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయం..!