AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big News Big Debate: మలుపులు తిరుగుతున్న ఏపీ సినిమా స్టోరీలో క్లైమాక్స్‌ ఏంటి..?

ఆది లేదు.. అంతం లేదన్నట్టుగా సాగుతోంది APలోని సినిమా వివాదం. పూటకో కామెంట్‌. రోజుకో రచ్చగా మారింది మూవీ టికెట్ల వ్యవహారం.

Big News Big Debate: మలుపులు తిరుగుతున్న ఏపీ సినిమా స్టోరీలో క్లైమాక్స్‌ ఏంటి..?
Big News Big Debate
Ram Naramaneni
|

Updated on: Dec 24, 2021 | 10:06 PM

Share

మలుపులు తిరుగుతున్న స్టోరీలో క్లైమాక్స్‌ ఏంటి.? సినీ ఇండస్ట్రిని AP ప్రభుత్వమే టార్గెట్‌ చేసిందా? ప్రజా ప్రయోజనం కోసమే జీవో తెచ్చిందా.? పార్టీలు చూస్తున్న పొలిటికల్‌ ఈక్వేషన్స్‌ ఏంటి.?

ఆది లేదు.. అంతం లేదన్నట్టుగా సాగుతోంది APలోని సినిమా వివాదం. పూటకో కామెంట్‌. రోజుకో రచ్చగా మారింది మూవీ టికెట్ల వ్యవహారం. సామాన్య ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ధరలు తగ్గించాలంటోంది ఏపీ ప్రభుత్వం. జీవో ప్రకారం అయితే కిరాణా కొట్టు, టీ బండి కంటే దారుణంగా కలెక్షన్లు ఉంటాయంటోంది చిత్ర పరిశ్రమ. కేసు కోర్టులో నడుస్తుండగానే ఇండస్ట్రీలో ఉక్కపోత మొదలైంది. తెలంగాణలో వరాలు ఇస్తుంటే.. ఏపీలో మాత్రం సవాళ్లేంటని పరిశ్రమ పెద్దలకు గాలి ఆడటం లేదు. టాలీవుడ్‌లో హెమాహెమీలు కూడా గట్టిగా అడగలేరు. బయటపడకుండా ఉండలేరు. కక్కలేక మింగలేక సతమతమవుతున్నారా?

న్యూ ఇయర్‌ to సంక్రాంతి పండగ సీజన్‌. పైగా రిలీజులకు బడా మూవీలున్నాయి. కలెక్షన్లతో కళకళలాడాల్సిన థియేటర్లు ఇలా మూగబోయాయి. ఏపీ అంతటా అధికారులు సీజ్‌ చేసినవి 50కి పైగా ఉంటే మరో 50 స్వచ్చందంగానే మూసేశారు థియేటర్ల యజమానులు. కరోనా పేండమిక్‌ తర్వాత కొత్త సినిమాలతో కష్టాల నుంచి గట్టెక్కుతామని ఆశగా చూసిన ఎగ్జిబిటర్స్‌ వ్యవస్థకు ఆశనిపాతంగా మారింది తాజా వివాదం.

ఏపీలో టికెట్‌ వివాదం సినిమా హాలు యజమాని నుంచి హీరోదాకా అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 35 ప్రకారం ధరలు మరీ తక్కువగా ఉన్నాయంటోంది ఇండస్ట్రీ. దీని వల్ల కరెంట్‌ ఖర్చులు రావన్నది వారి వాదన అయితే సామాన్యులను దృష్టిలో పెట్టుకుని మరీ GO తెచ్చామంటోంది సర్కార్‌. జీవో వ్యవహారం కోర్టుకు చేరినా.. ఇరువర్గాల మాటకు మాటతో వివాదం రోడ్డున పడింది.

కిరాణ కలెక్షన్ల కంటే దారుణమని నాని వ్యాఖ్యలు అగ్గిరాజేస్తే… హీరో సిద్దార్థ్‌ తన సంచలన ట్వీట్‌తో ఆజ్యం పోశారు. పన్నులు రూపంలో కట్టే మా డబ్బుతో లగ్జరీలు, వేలు, లక్షల కోట్లు అవినీతి చేస్తున్న మంత్రులు తమ విలాసాలు తగ్గించుకుని మాకు డిస్కౌంట్‌ ఇవ్వాలంటూ సెటైర్‌ వేశారు. ఈ వ్యాఖ్యలపై మంత్రులు బొత్స, కొడాలి నాని, కన్నబాబు లేటెస్టుగా అనిల్‌ యాదవ్‌ కౌంటర్‌ ఎటాక్‌లు ఇస్తున్నారు. హీరోలు తమ రెమ్యునరేషన్లు తగ్గించుకోవాలని వకీల్‌సాబ్‌, బీమ్లా నాయక్‌ సినిమాల ఖర్చెంత. పవన్‌ కల్యాణకు ఇచ్చిన రెమ్యునరేషన్‌ ఎంతంటూ ప్రశ్నించారు మంత్రి అనిల్‌.మంత్రి అనిల్‌ వ్యాఖ్యలతో వ్యవహారం రాజకీయ మలుపు తీసుకుంది. ఒక్కరిని టార్గెట్‌ చేసి ఇండస్ట్రీ మొత్తాన్ని ఇబ్బందులు పెడుతున్నారంటున్నాయి ప్రతిపక్షాలు.

జీవో అనంతర పరిణామాలపై చర్చలతో వివాదానికి క్లైమాక్స్‌ పడుతుందని అంతా ఆశించారు. మంత్రి పేర్ని నానికి సినిమాటొగ్రఫి శాఖ అప్పగించింది ప్రభుత్వం. కానీ రచ్చ రోజురోజుకు రావణ కాష్టంలా ఎగసిపడుతూనే ఉంది. మరి సర్కార్‌ వర్సెస్‌ సినిమా ఇండస్ట్రీకి ఎండ్‌ కార్డ్‌ ఎప్పుడు పడుతుందో. ఎలా పడుతుందో చూడాలి.?— బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్

ఈ ఇష్యూపై టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ డిబేట్ నిర్వహించారు. ఆ వీడియో దిగువన చూడండి.