- Telugu News Astrology Wedding Horoscope: These five zodiac signs will get married soon Telugu Astrology
Wedding Horoscope: వారి ఇళ్లలో త్వరలోనే పెళ్లి సందడి..! వివాహ యోగమున్న ఆ రాశులు వారు ఎవరంటే..?
జీవితంలో వివాహం అనేది ఎంతో ప్రాధాన్యం కలిగిన అంశం. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహ సంచారాల ఆధారంగా ఐదు రాశుల వారికి త్వరలోనే వివాహ యోగం పట్టనుంది. జాతక చక్రం ఆధారంగా కూడా కొందరికి వివాహం జరగొచ్చు. మరి ఏయే రాశి వారికి ఎప్పుడు వివాహం జరిగే అవకాశముందో..
Updated on: Apr 17, 2023 | 3:18 PM

జీవితంలో వివాహం అనేది ఎంతో ప్రాధాన్యం కలిగిన అంశం. గ్రహ సంచారాలను పరిగణలోకి తీసుకుంటే జ్యోతిష్య శాస్త్రం మేరకు కొన్ని రాశుల వారికి త్వరలోనే వివాహ యోగం ఉంది. ఈ ఏడాది వైశాఖ శ్రావణ కార్తీక మాఘ మాసాలలో మిధునం, సింహం, తుల, ధనస్సు, మీనరాశుల వారికి వివాహయోగం పట్టబోతోంది. ఈ రాశుల వారికి అప్రయత్నంగా, సునాయాసంగా పెళ్లి సంబంధం కుదిరి అవకాశం ఉంది. వ్యక్తిగత జాతక చక్రాన్ని బట్టి ఇతర రాశుల వారికి కూడా పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉండవచ్చు కానీ గట్టి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. పైన చెప్పిన ఐదు రాశుల వారు మాత్రం తగిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండటం మంచిది. ఇందులో ఏ రాశి వారికి ఎప్పుడు, ఏ విధంగా వివాహయోగం పట్టబోయేదీ పరిశీలిద్దాం.

మిధున రాశి: ఈ రాశి వారికి మే నెల నుంచి జూలై నెల లోపల, అంటే వైశాఖ మాసంలో కానీ శ్రావణమాసంలో కానీ తప్పకుండా పెళ్లి నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. వరుడు లేదా వధువు దక్షిణ దిశ నుంచి జీవిత భాగస్వామిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇష్టమైన వారితో పెళ్లి అయ్యే సూచనలు ఉన్నాయి. పెద్దల అంగీకారంతో సంప్రదాయ బద్ధంగా పెళ్లి జరగడానికి అవకాశం ఉంది. సాధారణంగా గతంలో ఎప్పుడో చూసిన సంబంధమే ఖాయం కావొచ్చు. పెళ్లికి భారీగా ఖర్చు అయ్యే సూచనలు కూడా ఉన్నాయి.

సింహ రాశి: ఈ రాశి వారికి జూలై లేదా ఆగస్టు నెలలో అంటే శ్రావణ మాసంలో పెళ్లి నిశ్చయం అవటం గానీ, పెళ్లి జరగటం గానీ జరుగుతుంది. వధువు లేదా వరుడు విదేశీ సంబంధం కావొచ్చు. వధువు లేదా వరుడు తమకంటే బాగా ఉన్నత స్థితిలో ఉండటం జరుగుతుంది. వివాహం సాంప్రదాయబద్ధంగా జరిగే సూచనలే ఉన్నాయి. పెద్దలు కుదిర్చిన వివాహం జరగటానికే ఎక్కువగా అవకాశం ఉంది. పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతాయి అని చెప్పవచ్చు.

తులా రాశి: ఈ రాశి వారికి వైశాఖ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ తప్పకుండా పెళ్లి సంబంధం ఖాయం అయ్యే లేదా పెళ్లి జరిగే సూచనలు ఉన్నాయి. అంటే మే నెలలో గానీ, నవంబర్ లో గానీ పెళ్లి జరుగుతుంది. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పెద్దల సమక్షంలో సంప్రదాయ బద్ధంగా పెళ్లి జరిగే సూచనలు ఉన్నాయి. సాధారణంగా నిరాడంబరంగా తక్కువ ఖర్చుతో పెళ్లి జరగవచ్చు. సమాజంలో బాగా పలుకుబడి గౌరవ మర్యాదలు ఉన్నవారితో పెళ్లి సంబంధం కుదురుతుంది.

ధనుస్సు రాశి: ఈ రాశి వారికి తప్పకుండా శ్రావణమాసం లోపల వివాహం జరిగే అవకాశం ఉంది. వధువు లేదా వరుడు ఇతర కులాలకు లేదా ఇతర శాఖలకు చెందిన వ్యక్తి అయి ఉండే సూచనలు ఉన్నాయి. ఉత్తర ప్రాంతం నుంచి పెళ్లి సంబంధం రావచ్చు. సమాజంలో ఉన్నత స్థాయికి చెందిన కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వివాహం లేదా ఇష్టపూర్వక వివాహం జరగటానికి కూడా అవకాశం ఉంది. పెళ్లి పెద్దల సమక్షంలో సంప్రదాయబద్ధంగానే ఆడంబరంగా, ఆర్భాటంగా జరగవచ్చు.

మీన రాశి: ఈ రాశి వారికి కార్తీక మాసంలో గానీ లేదా మాఘమాసంలో గానీ తప్పకుండా వివాహం జరిగే అవకాశం ఉంది. అంటే ఈ ఏడాది నవంబర్ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి లోపల పెళ్లి తప్పకుండా జరుగుతుంది. విదేశీ సంబంధం కుదరటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇష్టపూర్వక వివాహం కూడా కావచ్చు. పెద్దల అంగీకారంతోనే వివాహం జరుగుతుంది. సాధారణంగా వధూవరులు ఒకే చోట ఉద్యోగం చేస్తూ ఉండే అవకాశం ఉంది. బాగా తెలిసిన సంబంధం అయి ఉంటుంది.

ముఖ్యమైన పరిహారాలు: ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు లేకుండా పెళ్లి సంబంధం కుదరటానికి, పెళ్లి కార్యక్రమం పూర్తి కావడానికి అమ్మాయి లేదా అబ్బాయి తరచూ శివాలయానికి వెళ్లి అర్చన చేయించడం వల్ల ఎంతగానో ఉపయోగముంటుంది. వస్త్ర దానం చేయటం వల్ల కూడా సత్ఫలితాలు అనుభవానికి వస్తాయి. త్వరగా సంబంధం కుదరాలన్నా, పెళ్లి కావాలన్నా ఎక్కువగా తెలుపు గోధుమ రంగు లేదా పసుపు రంగు వస్త్రాలను ధరించడం మంచిది. ఈ పరిహారాలు పైన పేర్కొన్న ఐదు రాశుల వారికే కాకుండా అన్ని రాశుల వారికి వర్తిస్తాయని గమనించాలి.



