Vrushaba Rasi | Ugadi Horoscope 2023: శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో వృషభరాశి వారికి జ్యోతిష్య ఫలితాలు ఇలా..
Vrushaba Rasi Ugadi Horoscope: తెలుగువారి నూతన సంవత్సర కాలంలో వృషభ రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నది ఇక్కడ పరిశీలిద్దాం.
తెలుగువారి కొత్స సంవత్సరాదినే ఉగాది అని అంటారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం బుధవారం (మార్చి 22) నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్ 23 నుంచి గురుగ్రహం మేషరాశిలో సంచారం ప్రారంభిస్తుంది. అదేవిధంగా, అక్టోబర్ 24న మీనరాశిలో రాహు సంచారం కన్యారాశిలో కేతువు సంచారం ప్రారంభం అవుతుంది. శని గ్రహం ఈ ఏడాదంతా కుంభ రాశిలో కొనసాగుతుంది. మిగిలిన గ్రహాలు సుమారుగా నెలరోజులు చొప్పున వివిధ రాశుల్లో సంచరించడం జరుగుతుంది. గ్రహాల సంచారం ఆధారంగా శ్రీ శోభకృత్ నామ సంవత్సర కాలంలో వృషభ రాశి వారికి జ్యోతిష్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నది ఇక్కడ పరిశీలిద్దాం.
వృషభ రాశి (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆదాయం 14, వ్యయం 11 | రాజపూజ్యం 6, అవమానం 1
ఈ రాశి వారికి ఏప్రిల్ 23 నుంచి గురువు వ్యయం లోనూ, అక్టోబర్ చివరి వారి నుంచి రాహువు లాభ స్థానంలోనూ, కేతువు పంచమ స్థానం లోనూ సంచరించడం జరుగుతుంది. ఈ ఏడా దంతా శని దశమ స్థానంలో కొనసాగటం వల్ల ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా తిరుగులేని అదృష్టం పట్టడం ఖాయమని చెప్పవచ్చు. ఆదాయానికి, సంపాదనకు, లాభాలకు లోటు ఉండదు కానీ అనవసర ఖర్చులు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. గురు గ్రహం వ్యయ రాశి సంచారం వల్ల డబ్బు విషయంలో మోసపోవటం కానీ, మిత్రుల వల్ల నష్టపోవటం కానీ జరుగుతుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి.
కుటుంబం కోసం కాస్తంత ఎక్కువగా కష్టపడటం జరుగుతుంది. పిల్లల చదువుల కోసం ఎక్కువగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. దీర్ఘకాలంగా అనా రోగ్యంతో ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. తోబుట్టు వులు మీ మీద ఆధారపడటం జరుగుతుంది. ఉద్యోగంలో సహచరుల బాధ్యతలను కూడా మోయవలసి వస్తుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం వల్ల భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారు ప్రస్తుతానికి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఇంటి పెద్దల నుంచి అండదండలు ఉంటాయి.
త్వరలో మంచి మలుపు
మనశ్శాంతి ఏర్పడుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. గృహ, వాహన యోగం పట్టవచ్చు. ఆహార విహారాల విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం. బంధు వర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఈ ఏడాది మే మొదటి వారం నుంచి వీరికి అనేక విషయాలలో అదృష్టం పట్టడం ప్రారంభం అవుతుంది.
పరిహారం అవసరం
ఈ రాశి వారు అనవసర పరిచయాలకు, విలాసాలకు, అక్రమ సంబంధాలకు దూరంగా ఉండటం మంచిది. కృత్తిక, మృగశిర నక్షత్రాల వారి కంటే రోహిణి నక్షత్రం వారికి మరిన్ని శుభ పరిణామాలు అనుభవానికి రావడం జరుగుతుంది. ఈ రాశి వారు ఎక్కువగా శివార్చన చేయటం వల్ల శుభ ఫలితాలు ఎక్కువగా పొందుతారు.
(Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..)
మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..