Health Astrology: శనీశ్వరుడి కటాక్షం.. ఉగాది నుంచి ఆ రాశుల వారికి ఆరోగ్య భాగ్యం..!
Lord Shani Dev: ఆరోగ్యానికి శనీశ్వరుడు కారకుడు. మార్చి 29న శని కుంభం నుండి మీన రాశికి మారడం వల్ల ఉగాది (మార్చి 30) నుండి కొన్ని రాశుల వారికి ఆరోగ్యంలో మెరుగైన మార్పులు కనిపిస్తాయి. శని యొక్క స్థానం ఆధారంగా, ఈ రాశుల వారు దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం పొందుతున్నారు. ఆరోగ్య సంరక్షణపై దృష్టి పెంచుకోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం వంటివి కూడా ఈ సమయంలో చేయాలి.

Health Astrology 2025
Ugadi Astrology 2025: మార్చి 29న శనీశ్వరుడు కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశించడంతో, మార్చి 30న ఉగాది నుంచి కొన్ని రాశుల వారికి జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకోవడం ప్రారంభం అవుతుంది. ఉగాదితో ప్రారంభమయ్యే తెలుగు నూతన సంవత్సరంతో ప్రారంభమై, వచ్చే ఏడాది ఉగాది వరకు వీరికి భాగ్య యోగం, అధికార యోగం, ఉద్యోగ యోగంతో పాటు ఆరోగ్య భాగ్యం కూడా కలిగి, సుఖ సంతోషాలతో జీవితం గడిపే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం అనేది 6, 11 స్థానాల మీదా, వాటి అధిపతుల మీదా ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యానికి శనీశ్వరుడు కారకుడు. వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశుల వారు ఉగాది నుంచి అనారోగ్యాల నుంచి కోలుకునే అవకాశం ఉంది.
- వృషభం: ఈ రాశికి 11వ స్థానంలో శనీశ్వరుడు ప్రవేశిస్తున్నందువల్ల కొత్త సంవత్సరమంతా ఆరోగ్య భాగ్యం కలిగే అవకాశం ఉంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కోలుకోవడం లేదా సరైన చికిత్స లభించడంతో పాటు, స్వల్పకాలిక అనారోగ్యాలు కలిగే అవకాశం కూడా ఉండకపోవచ్చు. శని 11వ స్థానంలో ప్రవేశించినప్పుడు ఆరోగ్య సంబంధమైన క్రమశిక్షణ అలవడుతుంది. ఆహార, విహారాల్లో తగిన జాగ్రత్తలు పాటించే అవకాశం ఉంటుంది. ఏడాదంతా ఆరోగ్య సమస్యలు ఉండకపోవచ్చు.
- కర్కాటకం: ఆరోగ్య కారకుడైన శని భాగ్య స్థానంలో ప్రవేశించిన దగ్గర నుంచి ఈ రాశివారు అనారోగ్యాల నుంచి కోలుకోవడం ప్రారంభమవుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీద ఈ రాశివారికి శ్రద్ద పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా బాగా ప్రయాణాలుచేసే అవకాశం ఉన్నప్పటికీ వీరికి అనారోగ్యాలు పీడించే సూచనలు కనిపించడం లేదు. శస్త్ర చికిత్సలకు, మొండి వ్యాధులకు అవకాశాలు ఉండక పోవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి త్వరగా కోలుకోవడానికి చికిత్సలు లభించే అవకాశం ఉంది.
- తుల: ఆరోగ్యానికి సంబంధించినంత వరకూ ఈ రాశివారు అదృష్టవంతులని భావించవచ్చు. ఆరవ స్థానంలో శనీశ్వరుడు ప్రవేశించడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్యాలకు అవకాశం ఉండదు. శస్త్ర చికిత్సల అవసరం కూడా ఉండకపోవచ్చు. స్వల్పకాలిక అనారోగ్యాలు సైతం పీడించడానికి అవకాశం లేదు. అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నవారికి సరైన వైద్య చికిత్సలు లభించే అవకాశం ఉంటుంది. ఉగాది నుంచి రెండు నెలల కాలంలో అనారోగ్యాల నుంచి బాగా ఊరట లభిస్తుంది.
- వృశ్చికం: ఈ రాశికి అర్ధాష్టమ శని తొలగిపోయిన తర్వాత నుంచి, అంటే ఉగాది తర్వాత నుంచి ఈ రాశి వారు అనారోగ్యాల నుంచి కోలుకోవడం ప్రారంభమవుతుంది. సరైన వైద్య చికిత్సలు, ఔషధాలు లభించడం వల్ల రెండు నెలల కాలంలో చాలావరకు కోలుకోవడం జరుగుతుంది. ఏడాదంతో ఆరోగ్యంతో ఉండడంతో పాటు అత్యధికంగా ప్రయాణాలు, యాత్రలు చేసే అవకాశం ఉంది. స్వల్పకాలిక అనారోగ్యాలు కూడా ఉండకపోవచ్చు. శస్త్రచికిత్సలు, వాహన ప్రమాదాలు జరిగే అవకాశం లేదు.
- మకరం: ఈ రాశికి 6, 11 స్థానాల అధిపతులతో పాటు, శనీశ్వరుడు కూడా అనుకూలంగా మారుతున్నందు వల్ల ఉగాది నుంచి వీరికి వివిధ అనారోగ్యాల నుంచి బాగా ఉపశమనం లభించే అవకాశం ఉంది. మొండి వ్యాధులు కూడా చాలావరకు తగ్గి ఉండే సూచనలున్నాయి. ఈ రాశివారికి ఆరోగ్య స్పృహ ఎక్కువ. అందువల్ల స్వల్పకాలిక అనారోగ్యాలకు కూడా అవకాశం ఉండకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆరోగ్య భాగ్యానికి లోటుండదు.