అరుదైన పంచగ్రహ కూటమి…ఆ రాశుల వారికి దశ తిరగడం ఖాయం..!
Telugu Astrology: ఫిబ్రవరి 24 నుంచి కుంభ రాశిలో అయిదు గ్రహాల అరుదైన పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. ఈ గ్రహయుతిని మిథున రాశిలోని గురుడు వీక్షించడం ప్రత్యేకతగా మారింది. ఒకే రాశిలో ప్రధాన గ్రహాలు కూడడం వల్ల కొన్ని రాశులకు అసమతౌల్యం కలిగినా, వృషభం, మిథునం, తుల, ధనుస్సు, మకరం, కుంభ రాశులవారికి మాత్రం ఆదాయం, అధికారం, కొత్త అవకాశాల్లో శుభఫలితాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా మారే అవకాశం ఉంది.

Panchagraha Kutami
ప్రస్తుతం కుంభ రాశిలో గ్రహాల సంఖ్య పెరుగుతోంది. ఈ రాశిలో ఈ నెల (ఫిబ్రవరి) 24 నుంచి వారం రోజుల పాటు అయిదు గ్రహాలు సంచారం చేయడంతో పాటు, ఈ పంచగ్రహ కూటమిని మిథున రాశి నుంచి గురువు వీక్షించడం కూడా జరుగుతోంది. ఈ విధంగా ఒకే రాశిలో అత్యధిక సంఖ్యాక గ్రహాలు యుతి చెందడం వల్ల, గురు ప్రభావం కూడా పడడం వల్ల కొన్ని రాశులకు దశ తిరిగే అవకాశం ఉంది. ఒకే రాశిలో అయిదు ప్రధాన గ్రహాలు యుతి చెందడం వల్ల అసమతౌల్యం ఏర్పడుతున్నప్పటికీ, వృషభం, మిథునం, తుల, ధనుస్సు, మకరం, కుంభ రాశులకు మాత్రం ఈ అరుదైన యుతి అత్యధికంగా లాభాలు, యోగాలు కలిగించే అవకాశం ఉంది.
- వృషభం: ఈ రాశికి దశమ స్థానంలో రాశ్యధిపతి శుక్రుడితో పాటు అయిదు గ్రహాలు యుతి చెందడం, దాన్ని ధన స్థానం నుంచి గురువు వీక్షించడం వల్ల అనేక విధాలుగా లాభాలు కలిగే అవకాశం ఉంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సిద్ధిస్తాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులకు చేరుకోవడం జరుగుతుంది. అత్యంత ప్రముఖులతో సైతం సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి.
- మిథునం: ఈ రాశిలో సంచారం చేస్తున్న గురువు భాగ్య స్థానంలో యుతి చెందిన అయిదు గ్రహాలను వీక్షించడం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. పదోన్నతులు లభిస్తాయి. శీఘ్ర పురోగతికి అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అయిపోతాయి. కీర్తి ప్రతిష్ఠలు బాగా పెరుగుతాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది.
- తుల: ఈ రాశికి సంచారం ప్రారంభించిన అయిదు గ్రహాలను భాగ్య స్థానం నుంచి గురువు వీక్షించడం వల్ల అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. విదేశీ సంపాదన అనుభవించే యోగం కూడా పడుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు లభిస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
- ధనుస్సు: ఈ రాశికి తృతీయ స్థానంలో ప్రధాన గ్రహాలన్నీ చేరడం, దాన్ని రాశ్యధిపతి గురువు చూడడం వల్ల విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసుల్లో విజయాలు సాధిస్తారు. వ్యక్తిగత, ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కష్టనష్టాల నుంచి పూర్తిగా బయటపడతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది.
- మకరం: ఈ రాశికి ధన స్థానంలో గ్రహాల సంఖ్య పెరగడం వల్ల జీవితం నిత్య కల్యాణం, పచ్చ తోరణంలా సాగిపోతుంది. ఉద్యోగంలో అంచనాల్ని మించిన పురోగతి ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలను మించి లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. సంతాన యోగం కలిగే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. బంధుమిత్రులు మీ వల్ల లబ్ధి పొందుతారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు వరిస్తాయి.
- కుంభం: ఈ రాశిలో అయిదు గ్రహాలు సంచారం చేస్తుండడం, ఈ యుతిని పంచమ స్థానం నుంచి గురువు వీక్షించడం వల్ల ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఉద్యోగంలో ప్రాభవం, ప్రాధాన్యంతో పాటు జీతభత్యాలు బాగా పెరుగుతాయి. పదోన్నతులు లభించే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు సైతం అందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభించే అవకాశం ఉంది.
Follow Us