Telugu Astrology: గురుతో బుధుడు యుతి.. ఆ రాశుల వారికి అనూహ్య శుభ యోగాలు
Mercury and Jupiter Conjunction in Gemini: జూన్ 7 నుండి బుధుడు మిథున రాశిలో సంచరిస్తాడు. ఇప్పటికే అక్కడే గురువు సంచరిస్తున్నాడు. మిథున రాశిలో బుధుడు, గురువు యుతి కారణంగా కొన్ని రాశుల వారు ఊహించని శుభ యోగాలు పొందనున్నారు. ఆర్థిక ప్రగతి, ఉద్యోగంలో ఉన్నత స్థానం, ఆరోగ్యం, కుటుంబ సుఖం వంటి అంశాలలో మంచి మార్పులు కనిపిస్తాయి. ఈ బుధ, గురు యుతి జూన్ 21 వరకు ఉంటుంది.

Budh Guru Yuti
Budh Guru Yuti: జూన్ 7వ తేదీన బుధుడు వృషభ రాశిని వదిలిపెట్టి తన స్వక్షేత్రమైన మిథున రాశిలో సంచారం ప్రారంభించడం జరుగుతుంది. ఇప్పటికే మిథున రాశిలో సంచారం చేస్తున్న గురువుతో ఈ బుధుడు యుతి చెందడం వల్ల ఇటు ప్రాపంచిక విషయాల్లోనూ, అటు ఆధ్మాత్మిక విషయాల్లోనూ విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. బుదుడు విజ్ఞానానికి, గురువు జ్ఞానానికి కారకులు. ఈ రెండు గ్రహాలు కలవడం వల్ల కొన్ని రాశుల వారు తమ తమ రంగాల్లో ఊహించని ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ నెల 21 వరకు సాగే ఈ అపురూప కలయిక వల్ల వృషభం, మిథునం, సింహం, కన్య, తుల, ధనూ రాశులు అత్యధికంగా ప్రయోజనం పొందుతాయి.
- వృషభం: ఈ రాశికి ధన స్థానంలో ఈ రెండు శుభ గ్రహాల కలయిక వల్ల అనేక వైపుల నుంచి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందడంతో పాటు కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఉన్నతస్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
- మిథునం: ఈ రాశిలో బుధ, గురువులు కలవడం అత్యంత శుభ ప్రదమైన యోగం. మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరుతాయి. పలుకుబడి బాగా పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలతో పాటు జీతభత్యాలు, రాబడి, లాభాల వల్ల కూడా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. రాజపూజ్యాలు ఎక్కువగా కలుగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుతాయి. సంతాన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. శుభ వార్తలు ఎక్కువగా వింటారు.
- సింహం: ఈ రాశికి లాభ స్థానంలో బుధ, గురువుల కలయిక వల్ల ముఖ్యమైన ఆర్థిక, ఆరోగ్య, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడే అవకాశం ఉంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు వృద్ధి చెందుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. కుటుంబంతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. సంతాన యోగం కలుగుతుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ఆశించిన శుభవార్తలు వింటారు.
- కన్య: రాశ్యధిపతి బుదుడు దశమ స్థానంలో గురువుతో కలవడం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరగడం, పదోన్నతులు లభించడం వంటివి జరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి.
- తుల: భాగ్య స్థానంలో బుధ, గురువులు కలవడం వల్ల విదేశీయానానికి అవకాశాలు ఏర్పడతాయి. వీసా సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. విదేశాల్లో స్థిరత్వం పొందడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. అనేక విధాలుగా ఆదా యం పెరిగే అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
- ధనుస్సు: రాశ్యధిపతి గురువుతో బుధుడు కలవడం వల్ల ఈ రాశివారికి విపరీత రాజయోగం కలుగుతుంది. రాజపూజ్యాలకు అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి కావడం వంటివి జరుగుతాయి. శుభ వార్తలు ఎక్కువగా వింటారు. తీర్థయాత్రలు చేస్తారు. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి.



