Jupiter Transit 2025: గురు దృష్టి.. ఆ రాశుల వారికి ఏడాదికి పైగా అదృష్టాలు, శుభాలు..!
Guru Gochar 2025: మే 25న మిథున రాశిలో గురువు ప్రవేశించబోతున్నాడు. అక్కడి నుంచి తుల, ధనుస్సు, కుంభ రాశులను గురువు వీక్షించడం జరుగుతుంది. దీని ప్రభావంతో ఈ మూడు రాశులతో పాటు మరికొన్ని రాశుల వారికి 13 నెలల పాటు అదృష్టం కలిగే అవకాశం ఉంది. ఆర్థిక పురోగతి, ఉద్యోగంలో పదోన్నతులు, ఆరోగ్య మెరుగుదల, సంతాన ప్రాప్తి వంటి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది.

Guru Grah Gochar 2025
ఈ నెల (మే) 25న మిథున రాశిలో ప్రవేశించబోతున్న గురువు అక్కడి నుంచి తుల, ధనుస్సు, కుంభ రాశులను వీక్షించడం జరుగుతుంది. గురువు తానున్న రాశి నుంచి 5, 7, 9 స్థానాలను వీక్షిస్తాడు. గురువు సంచారం చేస్తున్న రాశులతో పాటు, ఈ మూడు రాశులకు కూడా చాలావరకు అదృష్టాలు కలిగే అవకాశం ఉంది. వృషభం, సింహ రాశులతో పాటు మిథునం, తుల, ధనుస్సు, కుంభ రాశులకు ఈ గురు సంచారం వల్ల సుమారు 13 నెలల పాటు శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి.
- వృషభం: ఈ రాశికి ధన స్థానమైన ద్వితీయ స్థానంలో గురువు ప్రవేశం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుందనడంలో సందేహం లేదు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలోనే కాక, ఇంటా బయటా కూడా మీ సలహాల వల్ల పలువురు లబ్ధి పొందుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ ధన స్థానం నుంచి గురువు షష్ట, అష్టమ, దశమ స్థానాలను వీక్షించడం వల్ల ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడం, ఆకస్మిక ధన లాభాలు కలగడం, వారసత్వ సంపద లభించడం, ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకోవడం వంటివి తప్పకుండా జరుగుతాయి.
- మిథునం: ఈ రాశిలో గురువు సంచారం వల్ల తప్పకుండా వ్యక్తిగత జీవితంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఈ స్థానం నుంచి గురువు అయిదు, ఏడు, తొమ్మిది స్థానాలను వీక్షించడం వల్ల పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి లాభిస్తాయి. సృజనాత్మకత పెరుగుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. పిత్రార్జితం లభిస్తుంది.
- సింహం: ఈ రాశికి లాభ స్థానంలో గురువు సంచారం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఈ రాశి నుంచి మూడు, అయిదు, ఏడు స్థానాల్ని గురువు వీక్షించడం వల్ల తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి. కమ్యూనికేషన్ పెరుగుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
- తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో గురువు ప్రవేశం వల్ల అనేక విధాలుగా అదృష్టాలు కలుగుతాయి. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల నెరవేరుతుంది. వారసత్వ సంపద లభిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆస్తి లాభం కలుగుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఈ రాశి నుంచి గురువు మూడు, అయిదు, ఏడు స్థానాలను వీక్షించడం వల్ల మంచి పరిచయాలు కలుగుతాయి. వాగ్ధాటి పెరుగుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. సంపన్న వ్యక్తితో పెళ్లి కుదురుతుంది.
- ధనుస్సు: ఈ రాశికి సప్తమ స్థానంలో గురు సంచారం వల్ల కొద్ది శ్రమతో అత్యధికంగా లాభాలు కలుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు, వేతనాల పెరుగుదలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి కావడం లేదా ప్రేమలో పడడం జరుగుతుంది. గురువు ఈ రాశిని వీక్షించడంతో పాటు లాభ, తృతీయ స్థానాలను కూడా వీక్షించడం వల్ల నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆధ్మాత్మిక చింతన బాగా పెరుగుతుంది. మంచి పరిచయాలు కలుగుతాయి.
- కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో గురు సంచారం వల్ల ఈ రాశివారిలో సృజనాత్మకత వృద్ది చెందుతుంది. నైపుణ్యాలు పెరుగుతాయి. ఆదాయం వృద్ది చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. పిల్లలు బాగా వృద్దిలోకి వస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపు లభించి హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. గురువు ఈ రాశితో పాటు, భాగ్య, లాభ స్థానాలను కూడా వీక్షించడం వల్ల వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. వారసత్వపు సంపద లభిస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి.



