Zodiac Signs: కష్టాల నుంచి మీకు విముక్తి లభించేదెప్పుడు..? 12 రాశుల వారికి పరిహారాలు ఏంటి..?
జీవితంలో భారీ కష్టాలకు, సమస్యలకు కారణం అష్టమాధిపతి, అష్టమ స్థానం. వాటిని బట్టి కష్టాలు తక్కువగా ఉంటాయా, ఎక్కువగా ఉంటాయా అన్నది నిర్ణయించాల్సి ఉంటుంది. ఏయే రాశుల వారు ఎటువంటి కష్టాలు పడడానికి అవకాశం ఉంటుంది, వీటి నుంచి ఏ విధంగా బయటపడాల్సి ఉంటుంది, పరిహారాలేమిటి..
మానవ జీవితంలో చిన్న చిన్న సమస్యలు, కష్టనష్టాలు సహజం. మధ్య మధ్య అనారోగ్యాలు కూడా సహజమే. అయితే, జీవితాన్ని ప్రభావితం చేసేవిగా, కుంగదీసేవిగా, జీవితాన్ని అతలాకుతలం చేసేవిగా ఉన్నప్పుడు మాత్రం మానసిక ధైర్యం దెబ్బతింటుంది. జీవితం మీద విరక్తి కలుగుతుంది. జీవితంలో భారీ కష్టాలకు, సమస్యలకు కారణం అష్టమాధిపతి, అష్టమ స్థానం. వాటిని బట్టి కష్టాలు తక్కువగా ఉంటాయా, ఎక్కువగా ఉంటాయా అన్నది నిర్ణయించాల్సి ఉంటుంది. ఏయే రాశుల వారు ఎటువంటి కష్టాలు పడడానికి అవకాశం ఉంటుంది, వీటి నుంచి ఏ విధంగా బయటపడాల్సి ఉంటుంది, పరిహారాలేమిటి అన్నది ఇక్కడ చర్చనీయాంశం.
మేషం: ఈ రాశివారికి ఏ కష్టం వచ్చినా అందుకు ఎక్కువగా స్వయంకృతాపరాధమే కారణం అవుతుంది. ఎవరినీ లెక్కచేయకపోవడం వల్ల, అహంకారం వల్ల కష్టాలు కొని తెచ్చుకుంటారు. జీవితంలో ఏదో ఒక దశలో బంధుమిత్రులకు దూరం అవుతారు.దీర్ఘకాలిక అనారోగ్యాలు బాగా ఇబ్బంది పెడతాయి. అష్టమాధిపతి అయిన కుజుడు ప్రస్తుతం అనుకూలంగా ఉన్నందువల్ల వీరు కష్టాల నుంచి చాలావరకు గట్టెక్కుతారు. ప్రతి నిత్యం సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం చాలా మంచిది.
వృషభం: ఈ రాశివారికి అష్టమాధిపతి అయిన గురువు, అష్టమ స్థానమైన ధనుస్సు ఏ కొద్దిగా బాగున్నా అంతగా సమస్యలు, కష్టాలు ఉండే అవకాశం లేదు. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల వల్ల తీవ్ర స్థాయి కష్టాలు, టెన్షన్లు పడే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులు పట్టుకుంటే వదిలిపెట్టే అవ కాశం ఉండదు. విష్ణు సహస్ర నామం పారాయణం చేయడం వల్ల కష్టాలు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం గురువు వ్యయ స్థానంలో ఉన్నందువల్ల తీవ్రస్థాయి కష్టాలకు అవకాశం లేదు.
మిథునం: ఈ రాశికి అష్టమాధిపతి శనీశ్వరుడు కావడం, అష్టమ స్థానం మకరం కావడం వల్ల తన కింద పనిచేసే ఉద్యోగుల వల్ల ఇబ్బందులు పడడం జరుగుతుంది. జీవిత భాగస్వామి కారణంగా కూడా కష్టాలు పడాల్సి వస్తుంది. నడి వయసు దాటిన తర్వాత ఆరోగ్యపరంగా కష్టనష్టాలకు లోను కావడం జరుగుతుంది. ప్రతి నిత్యం సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా జీవించ గలుగుతారు. ప్రస్తుతం శనీశ్వరుడు అనుకూలంగా ఉన్నందువల్ల దుర్భర కష్టాలకు అవకాశం లేదు.
కర్కాటకం: ఈ రాశివారికి కూడా శనీశ్వరుడే అష్టమాధిపతి అయినప్పటికీ, అష్టమ స్థానం కుంభ రాశి అయినందువల్ల కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సాటి ఉద్యోగులు ఏదో ఒక ఇబ్బందిని సృష్టిస్తూ పురోగతికి అడ్డుపడుతుంటారు. శ్వాసకోశ సంబంధమైన సమస్యలు రాకుండా చూసుకోవాలి. లలితా సహస్ర నామం చదువుకోవడం వల్ల శుభ ఫలితా లుంటాయి. ప్రస్తుతం శనీశ్వరుడు అనుకూలంగా ఉన్నందువల్ల పెద్దగా కష్టాలు ఉండకపోవచ్చు.
సింహం: సాధారణంగా వీరికి ధన సంబంధమైన కష్టాలే ఎక్కువగా ఉంటుంటాయి. ఈ రాశివారు ఎవరికైనా డబ్బు ఇచ్చినా, తీసుకున్నా కష్టాలు తప్పవు. అష్టమాధిపతి అయిన గురువు, అష్టమ స్థానమైన మీనరాశి అనుకూలంగా ఉన్న పక్షంలో కొద్దిగా కష్టాలు అదుపులో ఉండే అవకాశం ఉంటుంది. పిల్లల ద్వారా కూడా కష్టాలు పడడం జరుగుతుంది. ప్రస్తుతం గురువు అనుకూలంగా ఉన్నందు వల్ల పెద్దగా కష్టనష్టాలు ఉండకపోవచ్చు. తరచూ శివార్చన చేయించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
కన్య: ఈ రాశివారికి అష్టమాధిపతి కుజుడు అయినందువల్ల జీవితంలో ఏదో ఒక దశలో వాహన ప్రమాదాలు, శస్త్రచికిత్సలతో కష్టాలు పడడం జరుగుతుంది. శరీర సంబంధమైన బాధలు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సుబ్రహ్మణ్యాష్టకం లేదా సుందరకాండ పారాయణం వల్ల వీటి నుంచి గట్టెక్కవచ్చు. ప్రస్తుతం ఈ రాశిలో కుజుడు సంచరిస్తూ ఉండడం వల్ల వాహన ప్రమాదాలతో అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
తుల: రాశినాథుడైన శుక్రుడే ఈ రాశికి అష్టమాధిపతి అయినందువల్ల జీవితంలో చాలా భాగం ఆరోగ్యంగా, కష్టాలకు అతీతంగా సాగిపోతుంది కానీ, వ్యసనాల కారణంగా వృద్ధాప్యంలో దీర్ఘకాలిక అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు ఆహార, విహారాల్లో మొదటి నుంచీ జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లలితా సహస్ర నామ పఠనం వల్ల ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. ప్రస్తుతం శుక్ర సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల కష్టాలేమీ ఉండకపోవచ్చు.
వృశ్చికం: ఈ రాశికి అష్టమ స్థానాధిపతి బుధుడు అవడం, అష్టమ స్థానం మిథునం కావడం వల్ల సాధారణంగా వీరిని చూసి అసూయపడేవారు ఎక్కువగా ఉంటారు. ఈ రాశివారికి సామరస్యంతో వ్యవహరించే తత్త్వం లేనందువల్ల తరచూ కష్టాలకు, మానసిక సమస్యలకు లోనవాల్సి వస్తుం టుంది. బంధువులు బాగా కష్టాలకు గురిచేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం బుధుడు అను కూలంగా ఉన్నందువల్ల ఇబ్బందులు ఉండకపోవచ్చు. దుర్గాదేవి స్తోత్రం చదువుకోవడం చాలా అవసరం.
ధనుస్సు: ఈ రాశివారికి అష్టమాధిపతి చంద్రుడు అయినందువల్ల కష్టాలను ముందుగానే ఊహించుకుని ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా తల్లి వైపు నుంచి కష్టాలు ఎదుర్కోవలసి రావచ్చు. రక్త సంబంధమైన సమస్యలు ఎక్కువగా పీడిస్తాయి. వినాయకుడిని ఎక్కువగా అర్చించడం వల్ల శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. చంద్రుడు అనుకూలంగా ఉన్నందువల్ల అనేక మానసిక సమస్యల నుంచి, తీవ్ర స్థాయి ఆలోచనల నుంచి బయటపడడం జరుగుతుంది.
మకరం: ఈ రాశివారికి అష్టమాధిపతి రవి అయినందువల్ల ఈ రాశివారికి సాధారణంగా తండ్రి వైపు నుంచి ఇబ్బందులుంటాయి. ఉన్నతాధికారులు సమస్యలు సృష్టించడం జరుగుతుంది. విపరీతంగా బరువు బాధ్యతలు, లక్ష్యాలు అప్పగించడం, చాకిరీ పెంచడం వంటి వాటి వల్ల కొన్ని దీర్ఘకాలిక అనారోగ్యాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఆదిత్య హృదయం పఠించడం వల్ల మేలు జరుగుతుంది. ప్రస్తుతం రవి సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల ఆరోగ్య బాధలు ఉండక పోవచ్చు.
కుంభం: ఈ రాశివారికి అష్టమాధిపతి అయిన బుధుడు ప్రస్తుతం చాలావరకు అనుకూలంగా ఉండడం వల్ల కొన్ని దీర్ఘకాలిక సమస్యల నుంచి, కష్టాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి సాధారణంగా బంధువుల నుంచి, ముఖ్యంగా తండ్రి వైపు నుంచి కష్టాలుంటాయి. కీళ్ల నొప్పులు బాగా పీడిస్తాయి. ఈ రాశి వారు ఏ బాధనూ ఇతరులతో పంచుకోకపోవడం మరో ప్రధాన సమస్యగా ఉంటుంది. ప్రతి నిత్యం సుందరకాండ పారాయణం వల్ల ఎంతో ప్రయోజనం పొందుతారు.
మీనం: ఈ రాశివారికి అష్టమాధిపతి అయిన శుక్రుడు సాధారణంగా దీర్ఘకాలిక కష్టాలు, తీవ్రస్థాయి సమ స్యలు ఇవ్వకపోవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్యాలకు అవకాశం చాలా తక్కువ. ఆర్థిక సంబంధమైన సమస్యలు మాత్రం బాగానే చుట్టుముడతాయి. ఈ రాశివారు ఎక్కువగా శివారాధన చేయడం వల్ల కష్టనష్టాలకు దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆధ్మాత్మిక చింతన వీరిని ఎల్లప్పుడూ ప్రశాం తంగా ఉంచుతుంది. శుక్ర గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల హాయిగా గడిచిపోతుంది.
Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.