AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: శని, బుధ గ్రహాల వీక్షణతో వారికి కొత్త జీవితం.. ఆ రాశివారికి అనేక మార్గాల్లో ధన ప్రాప్తి..!

Saturn and Mercury: బుధ, శని గ్రహాలు మిత్రులు కనుక మిత్రులు కనుక ఎక్కువగా శుభ ఫలితాలనే ఇచ్చే అవకాశం ఉంది. ఈ పరస్పర దృష్టి ఫలితంగా దాదాపు ప్రతి రాశివారూ తమ ఆలోచనలను తీవ్రతరం చేయడం, తమ ప్రయత్నాలను ముమ్మరం చేయడం జరుగుతుంది. దాదాపు ప్రతివారి జీవితమూ తీరిక లేని జీవితంగా, విశ్రాంతి లేని జీవితంగా మారుతుంది. ప్రతి వారి జీవితంలోనూ యాక్టివిటీ పెరుగుతుంది.

Astrology: శని, బుధ గ్రహాల వీక్షణతో వారికి కొత్త జీవితం.. ఆ రాశివారికి అనేక మార్గాల్లో ధన ప్రాప్తి..!
Zodiac SignsImage Credit source: TV9 Telugu
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Aug 08, 2023 | 4:29 PM

Share

ప్రస్తుతం గ్రహచారం ప్రకారం శని, బుధ గ్రహాలు పరస్పరం వీక్షించుకుంటున్నాయి. సాధారణంగా సింహ రాశిలో ఉన్న బుధ గ్రహం అపారమైన తెలివితేటలను, ఊహాశక్తిని ఇస్తుంది. సింహ రాశి రవికి స్వక్షేత్రమైనందువల్ల ఈ రాశిలో బుధ గ్రహం దాదాపు బుధాదిత్య యోగం మాదిరిగా పనిచేస్తుంది. అటువంటి గ్రహం మీద కుంభ రాశి నుంచి శనీశ్వరుడి దృష్టి పడడం వల్ల ఆలోచించే విధానంలో, ప్రయత్నాలు సాగించే తీరులో మార్పు వస్తుంది. బుధ, శని గ్రహాలు మిత్రులు కనుక మిత్రులు కనుక ఎక్కువగా శుభ ఫలితాలనే ఇచ్చే అవకాశం ఉంది. ఈ పరస్పర దృష్టి ఫలితంగా దాదాపు ప్రతి రాశివారూ తమ ఆలోచనలను తీవ్రతరం చేయడం, తమ ప్రయత్నాలను ముమ్మరం చేయడం జరుగుతుంది. దాదాపు ప్రతివారి జీవితమూ తీరిక లేని జీవితంగా, విశ్రాంతి లేని జీవితంగా మారుతుంది. ప్రతి వారి జీవితంలోనూ యాక్టివిటీ పెరుగుతుంది. బద్ధకించకుండా ప్రతి పనినీ త్వరగా పూర్తి చేయాలనే తపన పెరుగుతుంది. ఈ ధోరణి వల్ల జీవితాలలో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం కలుగుతుంది. ఈ పరిస్థితి వివిధ రాశుల వారిని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో పరిశీలిద్దాం.

  1. మేషం: ఈ రాశివారికి పంచమ స్థానంలో బుధుడు, లాభ స్థానంలో శనీశ్వరుడు ఉన్నందువల్ల ఏ ప్రయత్నమైనా ఫలవంతం అవుతుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. జీవితానికి ఉపయోగపడే పనులను చేయడం జరుగుతుంది. సన్నిహితులు, జ్యేష్ట సోదరులు, మంచి పరిచయాల కారణంగా పురోగతి సాధించగలుగుతారు. ముఖ్యంగా గాడ్ ఫాదర్స్ తయారవుతారు. సరై ప్రయత్నాలతో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది.
  2. వృషభం: ఈ రాశివారికి చతుర్థ, దశమ స్థానాల మీద శని, బుధ గ్రహాల ప్రభావం పడినందువల్ల, ఉద్యోగంలో వీరి తెలివితేటలకు, వీరి సమయస్ఫూర్తికి, వీరి ఆలోచనలు, ప్రయత్నాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో అధికారులు మంచి ప్రాజెక్టులను అప్పగించడం జరుగుతుంది. ఈ రాశివారికి ఇది ఒక విధంగా విపరీత రాజయోగాన్నిస్తుంది. ఆత్మవిశ్వాసం, ఉత్సాహం పెరిగి ఎటువంటి బాధ్యతనైనా స్వీకరించే అవకాశం ఉంటుంది. తగిన ప్రతిఫలం కూడా ఉంటుంది.
  3. మిథునం: ఈ రెండు గ్రహాల ప్రభావం తృతీయ, భాగ్య స్థానాల మీద పడినందువల్ల ఎటువంటి ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని లబ్ధి పొందుతారు. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. కనిష్ట సోదరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. మారుబేరాలు చేయడంలో, మధ్యవర్తిత్వం జరపడంలో, కౌన్సెలింగ్ ఇవ్వడంలో సిద్ధహస్తులవుతారు. అనేక మార్గాలలో ధన ప్రాప్తి ఉంటుంది.
  4. కర్కాటకం: ఈ రాశివారికి అష్టమ, ద్వితీయ స్థానాల మీద ఈ ప్రాణ స్నేహితుల దృష్టి పడినందువల్ల, కొద్ది ప్రయత్నంతో, సరైన వ్యూహంతో ఆదాయాన్ని పెంచుకోవడం, రావలసిన డబ్బును వసూలు చేసుకోవడం వంటివి తప్పకుండా జరుగుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం అయి, కుటుంబ పరిస్థితులు చక్కబడి ప్రశాంతత ఏర్పడుతుంది. సమాజంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఆదాయ మార్గాలపై ఇతరులకు సలహాలు ఇస్తారు.
  5. సింహం: ఈ రాశిలోనే సంచరిస్తున్న బుధ గ్రహం శని వీక్షణ పొందడం వల్ల ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించి వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. తిమ్మిని బమ్మిని చేయగల సామర్థ్యం ఏర్పడుతుంది. సప్తమ స్థానంలో ఉన్న శనీశ్వరుడి ప్రభావం నుంచి విముక్తి లభిస్తుంది. పనిభారం నుంచి తప్పించుకోవడం, ఒత్తిడికి దూరం కావడం వంటివి జరుగుతాయి. తన హోదాను, స్థాయిని పెంచుకునే ప్రయత్నం జరుగుతుంది. ప్రతిభకు సరైన గుర్తింపు లభిస్తుంది.
  6. కన్య: ఈ రాశికి అధిపతి అయిన బుధ గ్రహం శనీశ్వరుడితో పరస్పర వీక్షణ కలిగి ఉండడం వల్ల, ఈ రాశివారికి కెరీర్ పరంగా అదృష్ట యోగం పట్టే అవకాశం ఉంది. వీరిలో సృజనాత్మకత పెరుగుతుంది. ఎన్నడూ లేని ఆలోచనలు పుట్టుకు వస్తాయి. కొత్త కొత్త ప్రయత్నాలతో, వ్యూహాలతో వృత్తి, వ్యాపారాల్లో సైతం మంచి గుర్తింపు తెచ్చుకోవడం జరుగుతుంది. సాధారణంగా సాంప్రదాయికంగా వ్యవహరించే ఈ రాశివారిలో ఆధునిక ధోరణులు ప్రబలుతాయి.
  7. తుల: ఈ రెండు గ్రహాల పరస్పర దృష్టి ఈ రాశివారికి రాజయోగం కలిగిస్తుందనడంలో సందేహం లేదు. పంచమ, లాభ స్థానాలకు బలం లభించినందువల్ల, దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆలోచనలు, ప్రయత్నాలు కలిసి వస్తాయి. తాము వృద్ధిలోకి రావడమే కాక, కుటుంబానికి ఒక మంచి మార్గం ఏర్పరచడం, మిత్రులకు మార్గ నిర్దేశనం చేయడం జరుగుతుంది. వృత్తి, వ్యాపా రాల్లో సరికొత్త ప్రయోగాలు చేయడం వల్ల లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది.
  8. వృశ్చికం: ఆధునిక జీవితానికి సరిపడే విధంగా వ్యూహాలను, ప్రణాళికలను మార్చుకోవడం జరుగుతుంది. ఒక కొత్త రకం జీవితానికి నాంది పలుకుతారు. ముఖ్యంగా కెరీర్ పరంగా కొత్త విధానాలను అను సరిస్తారు. వృత్తి, వ్యాపారాలే కాకుండా, ఉద్యోగంలో సైతం కొత్త ఆలోచనలను ప్రవేశపెడతారు. కొత్త ఆలోచనలు చేయడానికైనా, కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టడానికైనా ఇది అనుకూల సమయం. శత్రువుల ఎత్తులను తిప్పికొట్టగల సామర్థ్యాన్ని అలవరచుకుంటారు.
  9. ధనుస్సు: భాగ్య స్థానంలో ఉన్న బుధ గ్రహం మీద తృతీయ స్థానం నుంచి శనీశ్వరుడి దృష్టి పడడం ఈ రాశివారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. దాదాపు ప్రతి ఆలోచనా, ప్రతి ప్రయత్నమూ కలసి వస్తుంది. కొద్ది ప్రయత్నంతో విదేశాలలో ఉన్నత విద్యకు, ఉద్యోగాలకు అవకాశం ఉంది. ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. ఏ విషయంలోనైనా దూసుకుపోయే తత్వం, చొరవ, తెగింపు, సాహసాలు అలవడతాయి. ఆధ్యాత్మిక చింతనలో కూడా మార్పులు వస్తాయి.
  10. మకరం: రాశ్యధిపతి అయిన శనీశ్వరుడితో శుభగ్రహమైన బుధుడికి శుభ దృష్టి ఏర్పడినందువల్ల బాగా యాక్టివిటీ పెరుగుతుంది. క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త ఆదాయ మార్గాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్థాయి. దృఢమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రాశి వారిలోని ప్రతిభా పాటవాలు, సృజనాత్మక శక్తి బయటికి వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త పుంతలు తొక్కడం జరుగుతుంది. సమయస్ఫూర్తితో సమస్యలను పరిష్కరించుకుంటారు.
  11. కుంభం: రాశిలోని రాశ్యధిపతి శనీశ్వరుడితో బుధ గ్రహానికి శుభ వీక్షణ ఏర్పడినందువల్ల, మరింతగా క్రియాశీలంగా వ్యవహరించడం జరుగుతుంది. దీర్ఘకాలంగా ఇబ్బంది పెడుతున్న కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి నడుం బిగించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఎవరి సహకారమూ లేకుండానే బాధ్యతలను, లక్ష్యాలను సమర్థవంతంగా పూర్తి చేయడం కూడా జరుగుతుంది.
  12. మీనం: ఈ గ్రహాల పరస్పర వీక్షణ వల్ల ఈ రాశివారి వ్యవహార శైలిలో, ఆలోచనా ధోరణిలో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల పరంగా కొన్ని సరైన నిర్ణయాలు తీసుకుని ఆచర ణలో పెట్టడం జరుగుతుంది. అధికారులకే కాక, బంధుమిత్రులకు సైతం వీరి ఆలోచనలు, సలహాలు, సూచనలు ఉపయోగపడతాయి. వ్యక్తిగత ఆర్థిక, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. కెరీర్ కు సంబంధించి కొత్త ఆలోచనలు చేసి లబ్ధి పొందుతారు.

Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుందని గమనించగలరు. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి