అలా చేస్తే ఏపీ, తెలంగాణకు తీవ్ర నష్టం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రానికి ఎంపీ విజయసాయి వినతి

లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను కేవలం జనాభా ప్రాతిపదికన చేయడం వలన ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, కేరళ తీవ్రంగా నష్టపోతాయని వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

అలా చేస్తే ఏపీ, తెలంగాణకు తీవ్ర నష్టం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రానికి ఎంపీ విజయసాయి వినతి
Vijayasai Reddy
Follow us
Janardhan Veluru

|

Updated on: Aug 08, 2022 | 6:54 PM

లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను కేవలం జనాభా ప్రాతిపదికన చేయడం వలన ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, కేరళ తీవ్రంగా నష్టపోతాయని వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. రాజ్యసభలో సోమవారం ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆయన ఈ అంశాన్ని ఆయన లేవనెత్తారు.  జనాభాయేతర అంశాలైన ఆ రాష్ట్ర భూభాగము, అడవులు, జీవావరణం, ఆర్థిక అంతరాలు, జనాభా నియంత్రణ వంటి వాటిని కూడా నియోజకవర్గ పునర్విభజనలో పరిగణలోకి తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పునర్విభజన కమీషన్ ఏర్పాటు చేసేందుకు ఎప్పుడు చట్టం చేసినా అందులో పైన తెలిపిన జనాభాయేతర అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం తప్పనిసరి చేయాలని కోరారు. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం ప్రక్రియను ఆహ్వానించిన విజయసాయి.. అది చైతన్యవంతమైన భారత ఆధునిక ప్రజాస్వామ్యానికి చిహ్నం అవుతుందని అన్నారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 888 సీట్లతో కొత్త పార్లమెంట్ ఏర్పాటు కాబోతుందన్న విషయం సంతోషించదగ్గదేనన్నారు. అయినప్పటికీ నియోజకవర్గాల పెంపు కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే జరుగుతుందా అన్న అంశం ఆందోళన కలిగిస్తోందన్నారు.

ప్రస్తుతం నియోజకవర్గాల పునర్విభజన 2001 జనాభా లెక్కల ఆధారంగా జరిగినప్పటికీ, దేశంలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య మాత్రం మారలేదు. 1971 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా ఉత్తరప్రదేశ్ జనాభాలో 49.2% మాత్రమే. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తర ప్రదేశ్ జనాభాతో పోల్చుకుంటే ఏపీ జనాభా 6.8% తగ్గి 42.4% కి చేరింది. కొన్ని అంచనాల ప్రకారం ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాభా ఉత్తరప్రదేశ్ జనాభాలో కేవలం 39.6% మాత్రమేనని విజయసాయిరెడ్డి తెలిపారు. లోక్‌సభ నియోజకవర్గాల పెంపు కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే జరిగితే ఉత్తర ప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాల సంఖ్య 50% పెరిగి 120కి చేరుకుంటుంది. అదే సయమంలో ఆంధ్రప్రదేశ్ కేవలం 20% పెంపుతో 30 సీట్లకు పరిమితమవుతుందని అన్నారు. కాబట్టి డీలిమిటేషన్‌ కమిషన్‌ కోసం ఎప్పుడు చట్టం చేసినా జనాభాయేతర అంశాలను కూడా ప్రాతిపదికగా తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన జరిగేలా చూడాలని తద్వారా దక్షిణాది రాష్ట్రాలకు ఈ ప్రక్రియలో అన్యాయం జరగకుండా నివారించవచ్చని విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

పెండింగ్ రైల్వే అంశాలు.. రాజ్యసభలో లేవనెత్తిన విజయసాయిరెడ్డి..

అటు ఏపీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న రైల్వే అంశాలను రాజ్యసభలో విజయసాయిరెడ్డి లేవనెత్తారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌ను తక్షణమే నిర్వహణలోకి తీసుకురావాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కోరారు. అలాగే రైల్వే రిక్రూట్‌మెంట్స్‌ను వేగవంతం చేయాలని కోరారు.

ప్రధాని నరేంద్ర మోదీతో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రత్యేక భేటీ..

కాగా ప్రధాని నరేంద్ర మోదీతో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నీతి ఆయోగ్ సమావేశం విజయవంతం కావడంపై ప్రధాని మోదీతో చర్చించినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో మాట్లాడినట్లు తెలిపారు.పార్లమెంటు ఆవరణలోని ప్రధాని కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఏపీ పురోగతికి కేంద్ర సహకారం అవసరమని పేర్కొన్నారు.

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..