AP News: మాజీ ఎమ్మెల్యే మనవడు.. సీఎంకి అత్యంత సన్నిహితుడు.. ఒక హత్య.. ఎన్నో రాజకీయ అనుమానాలు
మాజీ ఎమ్మెల్యే మనవడు. సీఎంకి అత్యంత సన్నిహితుడు- రాజకీయ ప్రాబల్యం ఉన్న కుటుంబ సభ్యుడు. అలాంటి వ్యక్తి మర్డర్. ఒక హత్య. ఎన్నో రాజకీయ అనుమానాలు. ఇంతకీ హత్య వెనక గల అసలు కారణాలేంటి?

సత్యసాయి జిల్లా, హిందూపురం మండలం, చౌలూరు గ్రామం.. 8వ తేదీ రాత్రి 9 గంటలకు.. తన బార్ అండ్ రెస్టారెంట్ నిర్మాణ కార్యకలాపాలను ముగించుకుని.. ఇంటికొచ్చిన రామకృష్ణారెడ్డి.. కార్ పార్కింగ్ చేయబోతుండగా.. అన్నా అని ఎవరో పిలిస్తే.. వెనుదిరిగి చూశారు.. ఇంతలో ఓ ఐదుగురు ముసుగు ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు రామకృష్ణారెడ్డిపై కత్తితో దాడికి తెగబడ్డారు. రామకృష్ణారెడ్డిని దారుణంగా హత్య చేసి పరారై పోయారు. ఈ వార్త తెలిసిన హిందూపుర్ ఒక్కసారిగా ఉలిక్కడి పడింది. ఇలాంటి హత్యాకాండ తమ ప్రాంతంలో ఇదే తొలిసారనీ.. తమ ప్రాంతంలో ఇలాంటి నీచమైన సంస్కృతిలేదనీ వాపోతున్నారు రామకృష్ణారెడ్డి సన్నిహితులు. రామకృష్ణారెడ్డి.. మరెవరో కాదు.. ఈప్రాంతంలోనే పేరున్న రాజకీయ కుటుంబం. వైయస్ఆర్సీపీ స్థాపించిన తొలినాళ్లలో హిందూపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ గా పని చేశారు. అంతే కాదు ఎన్టీఆర్ కన్నా ముందు.. హిందూపూర్ ఎమ్మెల్యేగా పని చేశారు రామకృష్ణారెడ్డి తాతయ్య. ఇక రామకృష్ణారెడ్డి మద్దెలచెరువు సూరికి స్వయానా కజిన్ అవుతారు. అలాంటి రాజకీయ ప్రాముఖ్యమున్న నేతను హతమార్చారు.
మొన్నటి వరకూ ప్రశాంతంగానే ఉన్న హిందూపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఇక్బాల్ ఎంట్రీ ఇచ్చాకే ఇలాంటి గొడవలు మొదలయ్యాయని అంటారు స్థానికులు. ఇక్బాల్ MLC కన్నా ముందు హిందూపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి బాలకృష్ణ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. ఇక్బాల్ రిటైర్డ్ ఐపీఎస్, మాజీ రాయలసీమ ఐజి కూడా. అయితే ఇక్బాల్ వచ్చినప్పటి నుంచి హిందూపూర్ సెగ్మెంట్లో గ్రూపు తగాదాలు మొదలయ్యాయని అంటారు ఇక్కడి వారు. ఇక్బాల్ పీఏ, గోపీకృష్ణకూ రామకృష్ణారెడ్డికి గత కొంత కాలంగా గొడవలున్నట్టు చెబుతున్నారు. ఈ గొడవలే ఆధిపత్య పోరుకు దారి తీసినట్టు అంచనా. ఈ కారణాలే.. రామకృష్ణారెడ్డి హత్యకు తెరలేచినట్టు అనుమానిస్తున్నారు. రామకృష్ణారెడ్డికి గత కొంత కాలంగా థ్రెట్ ఉన్న విషయం.. తమకు తెలుసంటారు ఆయన సన్నిహితులు. అంతే కాదు పోలీసుల నుంచి కూడా తగిన సహకారం లభించలేదన్న మాట వినిపిస్తోంది. రామకృష్ణారెడ్డి తల్లికి సీఎం జగన్ ఫోన్ చేసినపుడు ఈ విషయం కూడా చెప్పడంతో.. పావుగంటకల్లా.. హిందూపూర్ రూరల్ సీఐ జీటీ నాయుడు, ఎస్సై కరీంలను తక్షణమే వీఆర్ కు అటాచ్ చేశారు. వీరిపై తదుపరి విచారణ జరుగుతుందని అంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు.
ఇంతకీ ఈ హత్యవెనక ఉన్న రక్తపు చేతులు ఎవరివి? ఇది గ్రూపు తగాదాల్లో భాగంగా జరిగిందా? లేక మరేదైనా కారణముందా? అంటే రామకృష్ణారెడ్డి ఉన్నత విద్యావంతుడు. కెనడా వెళ్లి చదువుకుని వచ్చారు. హిందూపూర్ కు 20 కిలోమీటర్ల దూరంలోని కర్ణాటక బోర్డర్ లో ఒక బార్ అండ్ రెస్టారెంట్ నిర్మిస్తున్నారు. ఇటు తన కుటుంబ వారసత్వంగా వచ్చిన రాజకీయాల్లో పాల్గొంటూనే.. అటు వ్యాపారం సైతం చేయాలన్నది రామకృష్ణారెడ్డి ఆలోచన. ఈలోగా ఈ హత్య జరగడం తమను తీవ్రంగా కలచి వేస్తోందని వాపోతున్నారు రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు. రామకృష్ణారెడ్డి తల్లి లక్ష్మీనారాయణమ్మ ఫిర్యాదుతో ఐదు మందిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ కంప్లయింట్ లో ఎమ్మెల్సీ పేరు ఎక్కడా లేదు. కానీ ఎమ్మెల్సీ అనధికారిక పీఏ గోపీకృష్ణతో పాటు రవి, వరుణ్, మురళీ, నాగన్నలపై కేసు పెట్టారు. రామకృష్ణారెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. ఈ హత్యతో చౌల్లూరు ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..