AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ys sharmila: వైసీపీపై షర్మిల ఫైర్… ఆ అంశాన్ని హైలెట్ చేస్తూ టార్గెట్

జగన్‌ వర్సెస్ షర్మిల ఎపిసోడ్‌ కొనసాగుతూనే ఉంది. వైసీపీ నుంచి దూరమై కాంగ్రెస్‌లో చేరిన షర్మిల సొంత అన్నపైనే తిరుగుబాటు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగన్‌పై మాటల యుద్ధం చేసిన షర్మిల.. ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా జగన్‌ మోహన్‌ రెడ్డిపై విమర్శలు ఎక్కుపెడుతూనే ఉంది. ఈ క్రమంలోనే...

ys sharmila: వైసీపీపై షర్మిల ఫైర్... ఆ అంశాన్ని హైలెట్ చేస్తూ టార్గెట్
Ys Sharmila
Narender Vaitla
|

Updated on: Jul 29, 2024 | 1:37 PM

Share

జగన్‌ వర్సెస్ షర్మిల ఎపిసోడ్‌ కొనసాగుతూనే ఉంది. వైసీపీ నుంచి దూరమై కాంగ్రెస్‌లో చేరిన షర్మిల సొంత అన్నపైనే తిరుగుబాటు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగన్‌పై మాటల యుద్ధం చేసిన షర్మిల.. ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా జగన్‌ మోహన్‌ రెడ్డిపై విమర్శలు ఎక్కుపెడుతూనే ఉంది. ఈ క్రమంలోనే ట్విట్టర్‌ వేదికగా ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యింది.

జగన్‌ మోహన్‌ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడంపై షర్మిల వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతానని జగన్ అనడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని షర్మిల విమర్శించారు. ఈ మేరకు షర్మిల ఓ సుదీర్ఘ పోస్ట్‌ చేశారు. ఇంతకీ ట్వీట్‌లో ఏముందంటే.. ‘సిగ్గు సిగ్గు!! మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు! ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం జగన్ గారి అజ్ఞానానికి నిదర్శనం. ఇంతకుముంచిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడ కనపడవు, వినపడవు. మోసం చేయడం మీకు కొత్తేమీ కాదు, జగన్ మోహన్ రెడ్డి గారు, కానీ మిమ్మల్ని ఎన్నుకుని, అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా, వింతగా మోసం చేయడం, ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లింది. అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాళాకోరుతనం అని పేర్కొన్నారు.

ఇక ఎమ్మెల్యే అంటే అర్థం Member of Legislative Assembly, Member of Media Assembly కాదంటూ షర్మిల ట్వీట్‌లో రాసుకొచ్చారు. అలాగే ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతుక అవ్వడానికా, లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా? అంటూ ప్రశ్నించారు. ఐదేళ్ల పాలన అంతా అవినీతి, దోపిడి అని… రాష్ట్రాన్ని మీరు అప్పుల కుప్ప చేసి పెట్టారని… నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే… తాపిగా ప్యాలస్ లో కూర్చుని మీడియా మీట్ లు పెట్టడానికి కాదు ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేను చేసిందని షర్మిల ఫైర్‌ అయ్యారు. గత పాలనపై జరుగుతోన్న విమర్శలకు అసెంబ్లీలో ఆన్ రికార్డు సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీది కాదా..? అంటూ షర్మిల ప్రశ్నించారు. ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ అఫ్ ది హౌస్ లో ప్రశ్నించే బాధ్యత మీది కాదా? అసెంబ్లీకి పోనని చెప్పే మీరు, ప్రతిపక్ష హోదాకే కాదు, ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కారు. వెంటనే రాజీనామా చేయండి!! అంటూ షర్మిల డిమాండ్ చేశారు.

షర్మిల చేసిన ట్వీట్..

ఇక ‘బడికి పోను అనే పిల్లోడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు, ఆఫీసుకు పోననే పనిదొంగను వెంటనే పనిలోంచి పీకేస్తారు. ప్రజాతీర్పును గౌరవించకుండా, అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు మీరు ఆఫ్రికా అడవులకు పోతారో, అంటార్టికా మంచులోకే పోతారో ఎవడికి కావాలి అప్పుడు’ అంటూ ఎద్దేవ చేశారు. అసెంబ్లీకి పోని జగన్ అండ్ కో తక్షణం మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోందని షర్మిల తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. మరి షర్మిల చేసిన ఈ విమర్శలపై జగన్‌ స్పందిస్తారో లేదో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..