Andhra: మంకీ క్యాప్‌తో వచ్చి అఖిలపై దాడి చేసింది ఎవరు..? మిస్టరీగా మారిన వ్యవహారం..
గరివిడి మండలం శివరాంలో యువతిపై దాడి జరిగింది. మంకీ క్యాప్ పెట్టుకుని వచ్చి దుండగుడు ఈ దాడికి పాల్పడ్డాడు. అయితే ఈ కేసులో ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే అతను తనకు ఏ పాపం తెలియదని చెబుతున్నాడు. మరి దాడికి పాల్పడింది ఎవరు...?

విజయనగరం జిల్లాలో అఖిల అనే యువతిపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. గరివిడి మండలం శివరాంలో జరిగిన ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. ప్రస్తుతం అఖిల తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అఖిల తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. ఉదయం 9 గంటలకు కూలీ పనుల నిమిత్తం ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులు బయటికి వెళ్లడం గమనించిన నిందితుడు ఇంటి పెరటి వైపు నుండి మంకీ క్యాప్ పెట్టుకుని లోపలికి ప్రవేశించాడు. అప్పటివరకు ఇంటి ముందు ఉన్న అఖిల ఇంట్లోకి రాగానే ఒకసారిగా అఖిలను కొట్టి కత్తితో దాడి చేసి హత్యకు యత్నించాడు. దీంతో అఖిల ఒక్కసారిగా పెద్ద పెద్దగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగున ఉన్న స్థానికులు పరుగు పరుగున వచ్చారు. వెంటనే తీవ్ర గాయాలతో రక్తస్రావంలో అఖిలను సమీపంలో ఉన్న చీపురుపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు. ప్రాథమికంగా అక్కడ చికిత్స అందించి అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరం జిల్లా కేంద్రంలోని తిరుమల మెడికవర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతానికి అఖిల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. అయితే ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా అఖిల ఇచ్చిన ఆధారాల మేరకు అదే గ్రామానికి చెందిన బుర్లి ఆది అనే అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. అఖిల ఇంటికి ఎదురుగా నివాసం ఉంటున్న ఆది తరచూ వస్తుంటాడు. అఖిల సోదరుడు ఆదికి స్నేహితుడికి కావడంతో ఇంట్లో జరుగుతున్న పరిణామాలన్నీ గమనించి దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అఖిలపై ఆది దాడి చేయడానికి గల కారణాలు మాత్రం తెలియటం లేదు. అఖిల తండ్రి కూలీ కావడంతో తోటి కూలీలకు కూలీ డబ్బులు ఇచ్చేందుకు ముందు రోజు సాయంత్రం లక్ష రూపాయల నగదు తమ కాంట్రాక్టర్ వద్ద నుండి ఇంటికి తీసుకుని వచ్చాడు. అయితే ఆ డబ్బును దొంగిలించడానికి వచ్చిన ఆదిని అఖిల చూడడంతో కత్తితో దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి నిందితుడు ఆదిని పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులు అనుమానిస్తున్నట్లు ఆది దొంగతనానికి వచ్చాడా? లేక మరేమైనా ప్రేమ వ్యవహారం కారణమా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న ఆది.. అఖిలపై జరిగిన దాడి గురించి తనకు తెలియదని అంటున్నాడు. జరిగిన ఘట పై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అఖిలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరామర్శించారు. అఖిల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు మంత్రి కొండపల్లి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి