Ongole: వైసీపీ ప్లీనరీలో సీఎం తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన అసంతృప్త ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు.. పరిస్థితి చక్కదిద్దాలంటున్న కేడర్..

ఒంగోలులో జరిగిన వైసిపి జిల్లా ప్లీనరీలో కార్యకర్తలకు, ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి ఉందని కుండబద్దలు కొట్టారు.. పరిస్థితి ఇలాగే ఉంటే పార్టీకి తీవ్ర నష్టం తప్పదని హెచ్చరించారు. అనుభవంతో చెబుతున్నా, ఇప్పటికైనా పరిస్థితిని చక్కదిద్దండని సభాముఖంగా హెచ్చరించారు..

Ongole: వైసీపీ ప్లీనరీలో సీఎం తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన అసంతృప్త ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు.. పరిస్థితి చక్కదిద్దాలంటున్న కేడర్..
Ongole Ycp Meeting
Surya Kala

|

Jul 01, 2022 | 7:27 AM

Ongole YCP Meeting: ఓ మాజీ మంత్రి తనపై స్వంత పార్టీవారే కుట్రలు చేస్తున్నారని బాంబు పేలుస్తారు… ఒక ఎంపి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు, నేతలకు మధ్య విబేధాలు ఉన్నాయని కుండబద్దలు కొడతారు… అదేబాటలో ఎమ్మెల్యేలు మరింత రెచ్చిపోయి ఏకంగా సీఎం పైనే వ్యాఖ్యలు చేస్తారు… చేసిన అభివృద్ది పనులకు బిల్లులు రావడం లేదంటూ పెదవివిరుస్తారు.. బిల్లులు రాకుంటే జిల్లా అధ్యక్షుడి ఇంటికి వెళ్ళి నిలదీయాలని ఒక ఎమ్మెల్యేపై కార్యకర్తలను మరో ఎమ్మెల్యే ఉసిగొలుపుతారు.. రండి చూసుకుందాం.. తగ్గేదేలే.. అంటూ ఆ ఎమ్మెల్యే గడ్డం అడ్డంగా సవరదీస్తాడు.  అసంతృప్త జ్వాలలను తొలుత రాజేసిన ఆ పెద్దాయన పరిస్థితి దిగజారిపోతుందని గ్రహించి చివరకు సర్దుబాటు చేసేందుకు ప్రయత్నిస్తారు.. గందరగోళంగా మారిన ప్రకాశంజిల్లా వైసీపీ ప్రజాప్రతినిధుల అసంతృప్త వ్యాఖ్యల నడుమ కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారట. వీళ్ళంతా మన పార్టీవాళ్ళేనా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారట.

ఇటీవల మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారారు.. టిడిపి నేతలతో పాటు స్వంత పార్టీ నేతలు కూడా తనపై కుట్రలు చేస్తున్నారని బాంబు పేల్చారు.. దీంతో వైసిపి పార్టీలో ఆధిపత్యపోరు ప్రారంభమైందని కేడర్‌ మదనపడుతున్నదట. బాలినేనికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆ స్వంత పార్టీ నేతలెవరో తెలుసుకునేందుకు వైసిపి నేతలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారట.. ఇది చాలదన్నట్టు ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి అగ్నికి ఆజ్యం పోసినట్టు ఒంగోలులో జరిగిన వైసిపి జిల్లా ప్లీనరీలో కార్యకర్తలకు, ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి ఉందని కుండబద్దలు కొట్టారు.. పరిస్థితి ఇలాగే ఉంటే పార్టీకి తీవ్ర నష్టం తప్పదని హెచ్చరించారు. అనుభవంతో చెబుతున్నా, ఇప్పటికైనా పరిస్థితిని చక్కదిద్దండని సభాముఖంగా హెచ్చరించారు..

అదే ప్లీనరీ సభలో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా గళం విప్పారు.. పెండింగ్ బిల్లులు మంజూరు కాకపోవడంతో నియోజకవర్గాల్లో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు… దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ ఒకింత అడుగు ముందుకు వేసి సీఎం వైయస్‌ జగన్‌పైనే సంచలన వ్యాఖ్యలు చేశారు… సంక్షేమ పధకాలను నేరుగా బటన్‌ నొక్కడం ద్వారా లబ్దిదారుల ఖాతాల్లోకి వెళితే సీఎంకు పేరొస్తుంది కానీ, ఎమ్మెల్యేలకు కాదుకదా అని ఆయన బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.. అలాగే కార్యకర్తలు చేపట్టిన అభివృద్ది పనుల బిల్లులు ఆగిపోయాయని, ఒక్క దర్శి నియోకవర్గంలోనే 100 కోట్ల బిల్లులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.. కార్యకర్తలు పనులు ఇచ్చి బిల్లులు రాకపోవడంతో తానే వారిని అప్పులపాలు చేశానని సభలో వాపోయారు.. వారంరోజుల్లో బిల్లులు తెప్పిస్తానని వైసిపి జిల్లా అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్‌యాదవ్‌ చెబుతున్నారని, వారం లోపల బిల్లులు రాకపోతే నేరుగా కనిగిరి ఎమ్మెల్యే ఇంటికే వెళ్ళాలని తాను కూడా వస్తానని చెప్పడంతో వేదికపై ఉన్న నేతలంతా బిత్తరపోయారు.. అయితే వెంటనే తేరుకున్న కనిగిరి ఎమ్మెల్యే మధుసూధన్‌ యాదవ్‌, ఎమ్మెల్యే వేణుగోపాల్ చేతిలో ఉన్న మైకు లాక్కుని ”తగ్గేదేలే” … అంటూ పుష్ఫ సినిమా స్టైల్లో గడ్దం అడ్డంగా సవరదీసి మరీ సమాధానం ఇచ్చారు… దీంతో వేదికపై ఎమ్మెల్యేల అసంతృప్త ప్రసంగాలు, నేరుగా సీఎంనే టార్గెట్‌ చేసి మాట్లాడిన అంశాలపై కార్యకర్తలు తీవ్ర గందరగోళానికి గురయ్యారు.. ఇది గమనించిన బాలినేని తన ప్రసంగంలో ఎమ్మెల్యేలు మాట్లాడిన తీరుకు సమాధానం ఇవ్వాల్సి వచ్చింది…సీఎం వైయస్‌ జగన్‌ నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి సంక్షేమ పధకాల నిధులను బటన్‌ నొక్కి పంపించడం ద్వారా అవినీతి రహిత పాలన అందించడానికేనని వివరించారు.. దీనివల్ల సీఎంకు పేరు వస్తే మనకు కూడా వచ్చినట్టే కదా అని అన్నారు..

ఒంగోలులో జరిగిన జిల్లా ప్లీనరీలో కార్యకర్తల మనోభావాలు తెలుసుకునే అవకాశం లేకపోవటంతో పాటు అసమ్మతివాదుల వాదనలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. కార్యకర్తలతో పాటు ప్రజల్లో కూడా ప్రభుత్వం పట్ల సానుకూలత లేదనే అంశాలపైనే ఎక్కువగా నేతలు మాట్లాడారు.. దీంతో మూడేళ్ళకాలంలో ప్రభుత్వం విజయవంతంగా అమలుచేస్తున్న అభివృద్ది, సంక్షేమ పధకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలన్న ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన ప్లీనరీల్లో అందుకు సంబంధించిన అంశాల కన్నా అసంతృప్త ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు వ్యక్తం చేసిన ఆవేదనే ఎక్కువగా హైలెట్‌ అయింది.. సంక్షేమ పధకాలు నేరుగా లబ్డిదారులకు అందితే ఇక ఎమ్మెల్యేలను ఎవరు లెక్కచేస్తారన్న మనస్థాపమే ఎక్కువగా కనిపించింది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ప్రాధాన్యం తగ్గిపోతోందని, రానున్న రోజుల్లో జనం తమని మర్చిపోయే ప్రమాదం ఉందన్న భావన కొంతమంది ఎమ్మెల్యేల్లో కనిపించింది. మొత్తం మీద ఒంగోలులో జరిగిన వైసిపి ప్లీనరీ ద్వారా ప్రభుత్వం చేసే అభివృద్ది పనులకన్నా ఎమ్మెల్యేలు వ్యక్తం చేసిన అసంతృప్తి అంశాలే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళినట్టు కనిపించింది.. ఒంగోలు ప్లీనరీ పరిస్థితి కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడినచందంలా మారిందని వైసిపిలోనే కేడరే చెప్పుకుంటున్నారట.. ఇకనైనా అధిష్గానం రాష్ట ప్లీనరీలో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి మరి.

Reporter: FAIROZ, TV9 Telugu

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu