Tungabhadra River: కాలుష్య కోరల్లో తుంగభద్రా.. నదిలోకి చేరుతున్న డ్రైనేజీ నీరు.. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు
కర్నూలు నగర జనాభా 7 లక్షల పైనే. నగరంలోని 14 పాయింట్స్ నుంచి డ్రైనేజీ నీరు తుంగభద్ర నదిలో కలుస్తున్నది. డ్రైనేజీ నీటితోపాటు బయో వేస్ట్ ఇతర వ్యర్తపదార్థాలన్నీ తుంగభద్ర లోనే పారవేస్తున్నారు. దీంతో నగరం చుట్టూ నది కంపు కొడుతోంది దుర్వాసన వెదజల్లుతోంది.
Tungabhadra River: ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు సరిహద్దు పట్టణం కర్నూలు నగరానికి ఆనుకొని ఉన్న తుంగభద్రా నది కాలుష్యపు కోరల్లో చిక్కుకుంది. ఈ విషయాన్ని కాలుష్య నియంత్రణ మండలి అధికారులే ధ్రువీకరిస్తున్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నగరపాలక సంస్థ డ్రైనేజీ నీటిని మొత్తం నదిలోకి వదిలేసింది. మురుగునీటి చేరికతో నదీ జలాలు కలుషితం అవుతున్నట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తేల్చారు. కాలుష్యాన్ని నియంత్రించలేనందుకు నగరపాలక సంస్థకు ఐదు కోట్లకు పైగా జరిమానా విధించారు. కాలుష్యపు కోరల్లో చిక్కుకొని కంపు కొడుతూ దుర్వాసన వెదజల్లుతున్న కర్నూలు తుంగభద్రా నది దుస్థితిపై టీవీ 9 స్పెషల్ కథనం..
గత మున్సిపల్ ఎన్నికల లెక్కల ప్రకారం కర్నూలు నగర జనాభా 7 లక్షల పైనే. నగరంలోని 14 పాయింట్స్ నుంచి డ్రైనేజీ నీరు తుంగభద్ర నదిలో కలుస్తున్నది. డ్రైనేజీ నీటితోపాటు బయో వేస్ట్ ఇతర వ్యర్తపదార్థాలన్నీ తుంగభద్ర లోనే పారవేస్తున్నారు. దీంతో నగరం చుట్టూ నది కంపు కొడుతోంది దుర్వాసన వెదజల్లుతోంది.
కర్నూలు నగరానికి ప్రతిరోజు 75 మిలియన్ లీటర్లు నీరు సరఫరా అవుతుంది. అందులో 80 శాతం నీరు మురికి నీరు రూపంలో తుంగభద్ర నదిలోకి చేరుతున్నట్లు అధికారులు ధ్రువీకరించారు. ఇలా చేరిన మురికి నీటి నుంచి శాంపిల్స్ స్వీకరించిన అధికారులు విషపూరితాలు ఉన్నట్లు గుర్తించారు. కర్నూలు నగరంలో ఆసుపత్రులు కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చాయి. వీటి వ్యర్థాలు నదిలో పారవేస్తున్నట్లు గుర్తించారు. దీనితోపాటు అనేక రకాల వ్యర్థాలు నదిలోనే పారవేస్తున్నారు, వీటి ద్వారా వివిధ రూపాలలో మనుషులకు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరాలతో పాటు శ్వాసకోశ సంబంధ వ్యాధులు ప్రబలే ఆస్కారం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు
మూడేళ్ల క్రితమే ప్రధాన నదులలోకి మురికి నీటి ప్రవేశాన్ని నిర్మూలించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. నదుల కాలుష్యం పట్ల అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదు. అందుకే కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఐదు కోట్లకు పైగా మున్సిపల్ కార్పొరేషన్ కు జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేశారు. నగరంలోని మురికి నీటిని అంతటిని పైపుల ద్వారా ఒక చోటికి తరలించి ఎక్కడైతే నదిలోకి ప్రవేశిస్తుందో అక్కడ మురికినీటి శుద్ధి ప్లాంటును ఏర్పాటు చేస్తే సరిపోతుందని గతంలోనే నిర్ణయించారు కానీ ఇంతవరకు అమలు కాలేదు. నది పూర్తి కాలుష్యం కావడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని నగర కార్పొరేటర్లు వాపోతున్నారు
తుంగభద్ర నది కాలుష్యంపై కర్నూల్ కమిషనర్ భార్గవ తేజ మాట్లాడుతూ.. నగరంలో మురికినీటి శుద్ధి కేంద్రాలు అవసరమని ఇందుకోసం ప్రభుత్వం నిధులు కూడా కేటాయించింది అని వివరణ ఇచ్చారు. కచ్చితంగా నదిలో కలవకుండా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.
దాదాపు ఆరు లక్షల జనాభా పైన ఉన్న కర్నూలు నగరవాసులు తుంగభద్ర నది కాలుష్యం తలుచుకుంటేనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పుష్కరాల సమయంలో నగర మురికి జలాలు తుంగభద్ర నదిలో కలవకుండా ఉండేందుకు నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో పైపులు కొనుగోలు చేశారు. అయితే ఆ పైపులు ఎక్కడున్నాయో తెలియలేదు. అసలు పైపులు కొనకుండానే కొన్నట్లు చూపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అంతర్గతంగా విచారణ కూడా జరుగుతుంది. నగర కాలుష్యం పైన ప్రజల ఆరోగ్యం పైన మున్సిపల్ అధికారుల తీరుకు ఇది అద్దం పడుతోంది.
మురికి జలాలు తుంగభద్రలో కలుస్తున్న విషయం నిజమే. కానీ నగరవాసుల తాగునీటికి నదీ కలుషితానికి ఎలాంటి సంబంధం లేదు. నది ఎగువ ప్రాంతంలోనే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో నిలువచేసి పూర్తిగా శుద్ధి చేసిన తర్వాతనే నీటిని పంపిణీ చేస్తున్నామని నగర మేయర్ రామయ్య చెప్పారు. నదిలో కాలుష్యం ఉన్నంత మాత్రాన ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నగరవాసుల ఆరోగ్యానికి పూర్తి భద్రత ఇస్తున్నామని తెలిపారు.
మురికి నీటి శుద్ధి ప్లాంట్లు ఇప్పటికిప్పుడే ఎలాగో పూర్తి చేయలేరు కాబట్టి తక్షణమే నది కాలుష్యంపై దృష్టి సారించి విషపూరితం అయిన బ్యాక్టీరియాను నిర్మూలించే చర్యలు తక్షణం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు ప్రజలు. అలాగే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నది కలుషితం కాకుండా సాశ్విత పరిష్కార మార్గాలను చూడాల్సిన అవసరం ఉంది…
Reporter : Nagireddy , Tv9 Telugu