Kakinada: అమ్మా అన్న పిలుపుతో అచేతనంగా ఉన్న ఆమెలో చలనం.. అంతలోనే కమ్మేసిన మరణం
పుట్టుక, మరణాన్ని ఎవరూ శాసించలేరు. అది నిజమే. కానీ ఇక మన మనిషి కాదు అనుకున్న మహిళను కూడా అమ్మ అన్న ఒక్క పిలుపు కదిలించింది. ఇక కోలుకుంటుంది లే అనుకున్న కుటుంబ సభ్యుల్ని ఆమె అనూహ్య మరణం కుదిపేసింది. వివరాలు ఇలా ఉన్నాయి....

బిడ్డ అమ్మా అని పిలవడంతో అచేతనంగా ఉన్న ఆమెలో కదిలోక వచ్చింది. తనయుడు ప్రేమగా పిలిచిన పిలుపుతో.. ఆమెలో కొత్త ప్రాణం పురుడు పోసుకుంది. ఆ తల్లి కోలుకుంటుందని.. తల్లీబిడ్డా సంతోషంగా ఉంటారని అందరూ సంతోషపడ్డారు. కానీ విధి మరోలా తలచింది. మృత్యువు ముందు ఆ తల్లి ప్రేమ ఓడిపోయి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. కాకినాడ జిల్లాలో ఈ హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ జిల్లా అన్నవరం గవర్నమెంట్ స్కూల్లో అనపర్తి వీరవెంకట కనకదుర్గ అఖిల అనే వివాహిత టీచర్‌గా పనిచేస్తున్నారు. సేవా కార్యక్రమాలు చేసేందుకు తోటి ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులతో కలిసి ఆమె ‘సంకల్పం’ పేరిట స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేశారు. తమకు కుదిరనంతలో ఆమె సాయం చేస్తూనే ఉన్నారు.
సాఫీగా సాగిపోతున్న జీవితంలో పెద్ద కుదుపు. అఖిల గత శనివారం టెన్త్ క్లాస్ చివరి పరీక్ష విధులకు హాజరై తిరిగి వస్తుండగా కత్తిపూడి వద్ద.. యాక్సిడెంట్ అయ్యింది. రాంగ్ రూట్‌లో వచ్చిన ఓ లారీ ఆమె బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. డాక్టర్లు ఆమె బ్రెయిన్‌డెడ్ అయినట్లు తెలిపారు. తన మరణాంతరం ఆర్గాన్ డొనేషన్‌కు ముందుగానే ఆమె సమ్మతి తెలపడంతో డాక్టర్లు అందుకు ఏర్పాట్లు ప్రారంభించారు.
ఆమెను ఆపరేషన్ థియేటర్‌కు తరలిస్తున్న సమయంలో.. చేయి కొద్దిగా కదపడంతో కొత్త ఆశలు చిగురించాయి. దీంతో ఆమె 2 ఏళ్ల తనయుడిని తల్లి దగ్గరికి తీసుకెళ్లి అమ్మా అంటూ.. పిలిపించారు. బిడ్డ పిలుపుకు ఆమె మరోసారి చేయి కదపడంతో వెంటనే ఆర్గాన్ డొనేషన్ నిలిపివేశారు. ఆపైన ట్రీట్మెంట్ కొనసాగించడంతో… అఖిల 40 శాతం వరకు కోలుకున్నారు. కానీ బుధవారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
