ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాల్లో వైసీపీని ఓడిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే ఈ మాటలను మాజీ మంత్రి పేర్ని నాని ఎగతాలి చేశారు. అసలు 175 నియోజకవర్గాల్లో టీడీపీ ఉందా అని ప్రశ్నించారు. చాలా నియోజకవర్గాల్లో టీడీపీకి కనీసం పోటీ చేసేందుకు అభ్యర్థులేరని విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. పది పార్టీలను కలుపుకుంటే గాని ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు లేదని విమర్శించారు. అలాగే వైనాట్ పులివెందుల అంటున్న చంద్రబాబు.. ధైర్యం ఉంటే పులివెందులలోనే ఆయనైనా లేదా పవన్ కల్యాణ్ పోటీ చేయాలని సవాల్ విసిరారు.
సినిమా డైలాగులు కొట్టడం కాదని ఉత్తరకుమార ప్రగల్భాలు పలకడం మానుకోవాలని చంద్రబాబుకు సూచించారు. అలాగే పేద ప్రజల కోసం, దేశప్రయోజనాల కోసం అనుక్షణం పనిచేసిన కమ్యూనిస్టు పార్టీ నేడు ఏపీలో టీడీపీకి తాకట్టుగా మారిందని విమర్శించారు నాని. సీపీఐ తీరు చూసి అసలైన కమ్యూనిస్టులు తల్లడిల్లుతున్నారని తెలిపారు. ఎన్ని పార్టీలను కలుపుకొని పోయినా, తలకిందులుగా తపస్సు చేసినా చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రారని స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..