Chittoor District: తెల్లవారుజూమున ఇంటి ముందు నుంచి భయానక శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా
చిత్తూరు జిల్లాలో ఏనుగులు భయపెడుతూనే ఉన్నాయి. తాజాగా.. పలమనేరు పరిధిలో ఒంటరి ఏనుగు ఓ ఇంటిపై దాడి చేసి స్థానికులను హడలెత్తిస్తోంది.

చిత్తూరు జిల్లా పలమనేరు నియోజవర్గంలో ఏనుగులు వణికిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకూ ఏనుగుల గుంపులు భయపెడితే.. ఇప్పుడు.. కొద్దిరోజుల నుంచి ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది. గంగవరం మండలం బండమీదజర్రావారిపల్లిలో పొలంలోని ఓ ఇంటిపై ఒంటరి ఏనుగు దాడి చేసింది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో రేకుల షెడ్డును ధ్వంసం చేసింది. ఇంట్లో నిద్ర పోతున్న కుటుంబ సభ్యులు భారీ శబ్ధాలతో ఉలిక్కిపడ్డారు. ప్రాణ భయంతో ఇంట్లో నుంచి పరుగులు తీశారు. వంటగదిలో ఉన్న బియ్యం, రాగులను తిని ధ్వంసం చేసింది. దాంతో.. సరుకులను నాశనం చేయడంతో కన్నీళ్లు పెట్టుకున్నారు కుటుంబసభ్యులు. ఇక.. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు.. ఒంటరి ఏనుగును అడవిలోకి పంపేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు.. ఒంటరి ఏనుగు సంచారంతో భయాందోళనకు గురవుతున్నారు.
వాస్తవానికి.. ఇప్పటికే.. ఏనుగుల దాడులతో చిత్తూరు జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. ఏనుగుల గుంపు సంచారంతో స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఇళ్ల నుండి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. సాయంత్రం ఐదు అయితే గ్రామాల్లో ఆందోళన మొదలవుతోంది. అర్థరాత్రి గ్రామాల్లోకి ప్రవేశించి పెద్ద ఎత్తున ఘీంకారాలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఏనుగులు ఎప్పుడు ఎటు వైపు నుంచి వచ్చి ఎవరిపై దాడి చేస్తాయోనని కంగారు పడిపోతున్నారు. ఇప్పటికైనా.. అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుని.. ఏనుగు దాడుల నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నారు.
బాధితుల వీడియో దిగువన చూడండి….
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి