Munagaku: ఆషాడ మాసంలో మునగాకు కూర ఎందుకు తింటారు..? అసలు దీని ప్రయోజనాలు ఏంటి..?
ఆషాఢం వస్తే చాలు.. బోనాలు శాకంబరీ ఉత్సవాల తీరే వేరు. తెలంగాణ సంప్రదాయం ఇలా ఉంటే.. ఏపీలో ఆషాడాన్ని ఆరోగ్య పరిరక్షణ మీద ఎక్కువగా దృష్టి సారిస్తారు.
ఆషాఢం వస్తే చాలు.. బోనాలు, శాకంబరీ ఉత్సవాల తీరే వేరు. తెలంగాణ సంప్రదాయం ఇలా ఉంటే.. ఏపీలో ఆషాడాన్ని ఆరోగ్య పరిరక్షణ మీద ఎక్కువగా దృష్టి సారిస్తారు. మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఇది మరింత ఎక్కువ. ఇక్కడ ఆషాఢం ప్రారంభమైతే.. ప్రతి ఇంట్లో మునగాకు కూర మునగాకు తెలగపిండి, మునగాకు పప్పు.. ఇలా రకరకాల కూరలు. ఇంతకీ ఏంటి మునగాకు గొప్పదనం.. మునగాకు ఈ మాసంలోనే ఎందుకు తింటారో తెలుసుకుందాం పదండి. మునగకాడల పులుసు- అంటే చెప్పేదేముందీ.. లొట్టలేసుకుని మరీ తింటారు. అసలా టేస్టే వేరు. మునగ అంటే ధాతుపుష్టికి బాగా పనికొస్తుంది.. కాబట్టి ఎగేసుకుని తినేవాళ్లు చాలా మందే ఉంటారు. మునక్కాడలే కాదు మునగాకు కూడా ఎంతో పవర్ఫుల్. మునగాకు వాడకం నిన్న మొన్నటి అలవాటు కాదు. మొరింగ బలిఫెర అనే శాస్త్రీయ నామం గల మునగాకు వాడకం దక్షిణాదిలో సుమారు 5 వేల ఏళ్ల నాటి నుంచి ఉంది. గోదావరి జిల్లా వాసులైతే.. మునగాకును అతి గొప్ప ఆయుర్వేద ఔషధంగా పరిగణిస్తారు. మునగాకులో ఏ, సీ విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్లతో పాటు మినరల్స్ సైతం మునగాకులో అధికంగా ఉంటాయి. కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలం.
మన పూర్వికులు ఆయుర్వేదంలో మూడు వందలకు పైగా వ్యాధులను నయం చేయడంలో భాగంగా.. మునగాకును వాడుతారంటే దీని ఘనతేమిటో ఊహించుకోవచ్చు. మునగాకు ఎంతటి ఆరోగ్యదాయిని అంటే.. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగించడంలో దీని తర్వాతే ఏదైనా. ఇక చక్కెరలను నియంత్రించడంలోనూ మునగాకు మునగాకే. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలోనూ మునగ మొనగాడే. రక్తంలో చక్కెర, కొవ్వులను నియంత్రించి.. గుండె పని తీరు మెరుగు పరచడంలో నెంబర్ వన్ మునగాకు. అలెర్జీ, ఆస్తమా, శ్వాసకోశ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాన్సర్ కణాలతో పోరాడీ ముఖ్యంగా గర్భాశయ ముఖద్వార, అండాశయ కాన్సర్లను నిరోధిస్తుంది. మెదడును కూడా చురుకుగా ఉంచుతుంది. శరీరంలో నీటి సాంద్రతను సమస్థితిలో ఉంచుతుంది మునగాకు. అందుకే మునగాకును అంతగా వాడుతుంటామని అంటారు గోదావరి జిల్లా వాసులు.
Also Read:నెల్లూరు స్వామి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు.. అసలు కథ వేరే ఉంది..