Amara Raja Issue: ‘అమరరాజా’ వ్యవహారం ఏంటి?.. ఇన్ని విమర్శలెందుకు వస్తున్నాయి?.. ప్రభుత్వం ఏమంటోంది?.. పూర్తి వివరాలివే..

Amara Raja Issue: అమర రాజా కంపెనీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌ను ఊపేస్తోంది. ప్రభుత్వ వైఖరితో పరిశ్రమలన్నీ తరలిపోతున్నాయంటూ..

Amara Raja Issue: ‘అమరరాజా’ వ్యవహారం ఏంటి?.. ఇన్ని విమర్శలెందుకు వస్తున్నాయి?.. ప్రభుత్వం ఏమంటోంది?.. పూర్తి వివరాలివే..
Amararaja Batteries
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 04, 2021 | 10:56 AM

Amara Raja Issue: అమర రాజా కంపెనీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌ను ఊపేస్తోంది. ప్రభుత్వ వైఖరితో పరిశ్రమలన్నీ తరలిపోతున్నాయంటూ.. విపక్షాలు ఆరోపిస్తుంటే.. అమరరాజా వెళ్లడం లేదని, తామే పంపిస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి తీవ్రంగా హానీ చేస్తున్న పరిశ్రమ ఉండటం నిరర్థకం అని భావించి తామే పంపిస్తున్నామంటూ ఏపీ సర్కార్ తేల్చి చెప్పింది.

అసలేం జరిగింది.. చిత్తూరు జిల్లా తిరుపతి శివారులోని కరకకంబాడిలో అమరరాజా బ్యాటరీస్ ఫ్యాక్టరీ ఉంది. బ్యాటరీల తయారీలో దేశంలోని అగ్రగామి సంస్థల్లో ఒకటై ఈ సంస్థ ద్వారా వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. అయితే, ఈ సంస్థకు గత కొన్ని నెలలుగా కష్టాలు మొదలయ్యాయి. ఈ ప్లాంటు నుంచి పరిమితికి మించి కాలుష్యం వెలువడుతోందని, నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఏప్రిల్‌లో కంపెనీకి నోటీసులు జారీ చేసింది. ఒకవేళ.. కాలుష్యాన్ని నియంత్రించకపోతే ఫ్యాక్టరీని మూసివేయాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ వెంటనే.. కార్మిక శాఖ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆరోగ్యశాఖలు ఫ్యాక్టరీలో తనిఖీలు నిర్వహించాయి. కంపెనీ నుంచి కాలుష్య ఉద్గారాలు విపరీతంగా విడుదల అవుతున్నాయంటూ ఆయా శాఖలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే.. అమరరాజా యాజమాన్యం.. తమ ఫ్యాక్టరీని ఇతర రాష్ట్రాలకు తరలించాలని నిర్ణయించింది. విషయం తెలుసుకున్న తమిళనాడు రాష్ట్రం.. అమరరాజాను తమ రాష్ట్రానికి ఆహ్వానించింది. అన్ని వసతులు కల్పిస్తామంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.

టీడీపీ ఆరోపణలు.. అమరరాజా కంపెనీ తరలిపోవడంపై ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు టీడీపీ నేతలు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయంటూ మండిపడుతున్నారు. కావాలనే కక్షగట్టి పరిశ్రమలను వెళ్లగొడుతున్నారంటూ టీడీపీ అగ్రనేతలు ఫైర్ అవుతున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు తక్కువైందని, వెళ్లే పరిశ్రమల సంఖ్య పెరిగిందంటూ విమర్శలు గుప్పి్స్తున్నారు. ఇలా ఈ వివాదం మరింత ముదిరింది.

వివాదంపై స్పందించిన సజ్జల, బొత్స.. అమరరాజా తరలిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. పర్యావరణానికి ముప్పు కలిగించే పరిశ్రమల కంటే ప్రజల ప్రాణాలే తమ ప్రభుత్వానికి ముఖ్యమని సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. లాభాల కోసమే అమరరా జా పరిశ్రమ చిత్తూరు జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిపోయేందుకు ప్రయత్నం చేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అమర రాజా పరిశ్రమ తరలిపోయేలా ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందన్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని మంత్రి బొత్స స్పష్టం చేశారు.

పర్యావరణానికి హానీ చేస్తోంది.. అమర రాజా బ్యాటరీస్ వల్ల విషతుల్యమైన వాతావరణం మనుషుల ప్రాణాలకు హాని కలిగించేలా ఉందని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇప్పటికే ధ్రువీకరించింది. ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థాల కారణంగా స్థానికంగా నేల, నీరు, గాలి దెబ్బతినిందని ప్రభుత్వానికి పీసీబీ నివేదిక అందజేసింది. సీసం సాధారణం కంటే అధికశాతం ఉండడంవల్ల మనుషులు, జంతువులు, మొక్కలకు హానీ కలుగుతోందని పీసీబీ రిపోర్ట్‌లో వెల్లడించింది. అమరరాజా బ్యాటరీస్ ప్రాంతంలోని మల్లెమడుగు రిజర్వాయర్ తోపాటు కొన్ని చెరువుల్లోని నీటిలో లెడ్ శాతం అధికంగా ఉండటం ఆందోళన కలిగించే అంశంగా పరిగణించింది. కాలుష్యమైన వాతావరణాన్ని పునరుద్ధరించాలని, ఉద్యోగులను, చుట్టుపక్కల గ్రామాలను కాపాడాలని సమయం ఇచ్చినా యాజమాన్యం చర్యలు చేపట్టలేదని ప్రభుత్వం ఆరోపిస్తోంది. అమరరాజా వ్యవహారంలో సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగానే వ్యవహరించామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలాఉంటే.. ప్రభుత్వ చర్యలు, ఫ్యాక్టరీ తరలింపు విషయాలపై అమరరాజా కంపెనీ యాజమాన్యం ఇప్పటి వరకు నోరు మెదపలేదు.

Also read:

Andhra Pradesh: దివిసీమను భయపెడుతున్న విషసర్పాలు.. మూడు రోజుల్లో 21 మందిని కాటేశాయి..

Andhra Pradesh: కీలక వివరాలు లీక్ చేస్తున్నారంటూ ఆ ముగ్గురిపై వేటు.. ఏపీ సర్కార్ సంచలన ఉత్తర్వులు..

Andhra Pradesh: ప్రమోషన్ అంటూ పార్టీ ఇస్తాడు.. ఆపై అందినకాడికి దోచుకెళ్తాడు.. వీడి మోసాలు అన్నీఇన్ని కావు..