TDP Utharandhra: పార్టీ దిగ్గజ నేతలు ఏమయ్యారు.. రిటైర్మెంట్ తీసుకున్నారా? ఇచ్చారా?
తెలుగుదేశం పార్టీలో సీనియర్లపై ఉత్తరాంధ్రలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఒకప్పటి ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ దిగ్గజ నేతలు ఏమయ్యారు? సీనియర్లకు అధిష్టానం పొలిటికల్‌గా రిటైర్మెంట్ ఇచ్చేసిందా? లేదంటే వాళ్లే తీసేసుకున్నారా? దశాబ్దాలుగా పొలిట్‌బ్యూరోలో ఉన్న నేతల పేర్లు ఎన్నికల సమయంలో ఎందుకు చర్చకు ఎందుకు నోచుకోవడం లేదు?
తెలుగుదేశం పార్టీలో సీనియర్లపై ఉత్తరాంధ్రలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఒకప్పటి ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ దిగ్గజ నేతలు ఏమయ్యారు? సీనియర్లకు అధిష్టానం పొలిటికల్‌గా రిటైర్మెంట్ ఇచ్చేసిందా? లేదంటే వాళ్లే తీసేసుకున్నారా? దశాబ్దాలుగా పొలిట్‌బ్యూరోలో ఉన్న నేతల పేర్లు ఎన్నికల సమయంలో ఎందుకు చర్చకు ఎందుకు నోచుకోవడం లేదు? మొన్నటి వరకు ఈ ప్రాంత రాజకీయాలను శాసించిన వాళ్లంతా ఏమయ్యారు? ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొనసాగుతన్న చర్చ. శ్రీకాకుళం మొదలు విజయనగరం, బొబ్బిలి, నెల్లిమర్ల, ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజకీయ ఉద్దండులు 2024 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారా లేక వారిని దూరం పెట్టారా? ఈ సమయంలో కాకలు తీరిన నేతల పేర్లు వినిపించకపోవడం చర్చకు దారితీసింది.
విజయనగరం జిల్లాను అప్పట్లో పాలించిన రాజులు ప్రజాస్వామ్య దేశంలోనూ తమ పాత్ర పోషిస్తూ వస్తున్నారు. పూసపాటి సంస్థానం నుంచి బొబ్బిలి రాజుల వరకు జిల్లాలో ప్రత్యక్ష రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన వారే. కేంద్ర మంత్రిగా పనిచేసిన పూసపాటి అశోక్ గజపతిరాజు జిల్లా రాజకీయాలను నాలుగున్నర దశాబ్దాలుగా శాసిస్తూ వస్తున్నారు. 1978 నుంచి వరుసగా పోటీచేస్తూనే ఉన్నారు. ఈ ఎన్నికల్లో మాత్రం ఆయనకు ఇంకా ఎంపీ టికెట్ ప్రకటించలేదు. అది బీసీలకు ఇస్తారన్న టాక్ వినిపిస్తోంది. అశోక్ గజపతి రాజు కూడా వయసు రీత్యా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్న సమయంలో పార్టీ కూడా ప్రత్యామ్నాయాలు వెతుకుతోంది. ఈసారి ఆయన ఎంపీగా బరిలో లేకపోతే ఇక ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ఖాయం అయినట్లే. ఇదే జిల్లా బొబ్బిలికి చెందిన కీలక నేత, మాజీ మంత్రి సుజయ క్రిష్ణ రంగారావుకు కూడా టికెట్ ఇవ్వలేదు. ఆయన సోదరుడు బేబీ నాయనకు దక్కడంతో సుజయ క్రిష్ణ రంగారావు రాజకీయం ముగిసినట్లేనా అన్న అనుమానాలు టీడీపీ శ్రేణుల్లో వ్యక్తం అవుతున్నాయి.
ఇక నెల్లిమర్ల విషయానికి వస్తే, 1983 నుంచి వరుసగా పోటీ చేస్తూ అనేక సార్లు గెలిచి మంత్రిగా పనిచేసిన పతివాడ నారాయణస్వామి నాయుడు కుటుంబానికి అధిష్టాననం ఈసారి నో టికెట్ అని చెప్పేసిందట. పొత్తులో భాగంగా ఇక్కడ జనసేన నేత లోకం మాధవికు టికెట్ కేటాయించారు. దీంతో పతివాడ వారసులు షాక్‌కి గుర య్యారు. పెద్దాయన పతివాడ కూడా రాజకీయాల నుంచి తప్పుకున్నట్లే అని టీడీపీ శ్రేణులు చెప్తున్నాయి.
ఇక మరో కీలక నేత కిమిడి కళా వెంకటరావు. ఏపీలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కళా వెంకటరావు రాష్ట్ర అధ్యక్షుడు. ఈయనది 1983 బ్యాచ్. అప్పటి నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నారు. కళా వెంకటరావు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల టికెట్ కోరుకుంటున్నారు. అధినాయకత్వం మాత్రం నో అని చెప్పేందట. అక్కడ కలిసెట్టి అప్పలనాయుడు పేరు పరిశీలిస్తుండటంతో కళా వెంకటరావు తీవ్రంగా నొచ్చుకుంటున్నారని ఆయన అనుచరులు చెప్తున్నారు. చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని ఆయనను అప్పట్లో కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే కళా వెంకటరావు మాత్రం ఎచ్చెర్ల ఇస్తేనే పోటీ చేస్తానని అంటున్నారట. ఎచ్చెర్ల టిక్కెట్ ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పడంతో ఈయన కూడా రిటైర్మెంట్ తీసుకున్నట్లే అన్న చర్చ నడుస్తోంది.
మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ కుటుంబానికి కూడా ఈసారి శ్రీకాకుళం టికెట్ డౌటే అని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇక్కడ యువనేత గోండు శంకర్‌ను హైకమాండ్ ప్రోత్సహిస్తోంది. ఇటీవల బాబు రా.. కదలిరా.. సభలో కూడా శంకర్‌కే ప్రోత్సాహం లభించిందట. భారీ జనసమీకరణతో శంకర్ తన సత్తా చూపారట. 1983 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్న గుండ అప్పల సూర్యనారాయణ కుటుంబానికి టికెట్ దక్కకపోతే రాజకీయంగా తప్పుకున్నట్లే అంటున్నారు విశ్లేషకులు.
ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో కీలక నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి టికెట్ డైలమాలో పడింది. ఆయన ఆశిస్తున్న పెందుర్తి టికెట్ జనసేనకు ఇస్తే బండారు సైతం పదవీవిరమణ చేసినట్లే. భవిష్యత్‌లో ఆయన కుమారుడు అప్పల నాయుడిని పార్టీ ఎలా గుర్తిస్తుందో చూడాలి అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. మొత్తం మీద అర డజన్‌కి పైగా మాజీ మంత్రులు, సీనియర్ నేతలను ఈసారి పోటీ నుంచి తప్పిస్తోందన్న చర్చ ఉత్తరాంధ్రలో నడుస్తోంది. అయితే ఈ నేతలకు ఈసారి టికెట్ లభించకపోతే.. రిటైర్మెంటే అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…