Andhra Pradesh: ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు దంచుడే.. వెదర్ రిపోర్ట్ ఇదిగో
సోమవారం అల్లూరి సీతారామ రాజు, పార్వతీపురం మన్యం, ఎన్టీఆర్, అనంతపురం, శ్రీ సత్య సాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తెలిపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ తెలిపింది.. వచ్చే 3 రోజులు వెదర్ రిపోర్ట్ తెలుసుకుందాం పదండి...
ఐఎండి సూచనల ప్రకారం దక్షిణ అంతర్గత తమిళనాడు & పరిసరాల్లో ఆవర్తనం కొనసాగుతుందని, దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇది ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి వాయుగుండంగా కేంద్రీకృతమై అవకాశం ఉందన్నారు.
దీని ప్రభావంతో మే 19, ఆదివారం శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, అల్లూరిసీతారామ రాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ సూచించారు.
సోమవారం అల్లూరి సీతారామ రాజు, పార్వతీపురం మన్యం, ఎన్టీఆర్, అనంతపురం, శ్రీ సత్య సాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తెలిపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.
కాగా… శనివారం సాయంత్రం 6 గంటల నాటికి పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలిలో 67.7మిమీ, ప్రకాశం కురిచేడులో 40.5మిమీ, పల్నాడు జిల్లా దాచేపల్లి, శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లిలో 40మిమీ, పల్నాడు జిల్లా నూజెండ్లలో 39.5మిమీ, అల్లూరి జిల్లా పాడేరులో 34.2మిమీ, నంద్యాల జిల్లా రుద్రవరం,అనంతపురం రాయదుర్గ్ లో 27.5మిమీ, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 27మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు. దాదాపు 62 ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడినట్లు తెలిపారు.
మరోవైపు మే 19, ఆదివారం శ్రీకాకుళం 6, విజయనగరం 15, మన్యం 9 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. శనివారం వైయస్ఆర్ జిల్లా ఖాజీపేటలో 39.9°C, నెల్లూరు జిల్లా రాపూరులో 39.7°C,తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో 39.6°C, నంద్యాల జిల్లా చాగలమర్రిలో 39.4°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…