Watch Video: ప్రాణం మీదకు తెచ్చిన రీల్స్ పిచ్చి.. జలపాతంలో దూకి యువకుడి గల్లంతు! వీడియో వైరల్
Man drowned in Kalyanarevula waterfall: ఓ యువకుడు రీల్స్ కోసం జలపాతంలో దూకి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన చిత్తూరు జిల్లాలోని పలమనేరు పట్టణంలో గురువారం (అక్టోబర్ 16) చోటు చేసుకుంది. గల్లంతైన యువకుడు, అతడిస్నేహితులు తీసుకున్న ఫొటోలు, దూకేందుకు రెండు నిమిషాల ముందు తీసుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది..

పలమనేరు, అక్టోబర్ 18: ఇటీవల కురిసిన వానలకు ఎక్కడ చూసినా నదులు, వాగులు నిండి కుండగలా పొంగి పొర్లుతున్నాయి. అయితే కొందరు యువత రీల్స్‌పై మోజుతో ప్రమాదకరంగా వీడియోలు చిత్రీకరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు రీల్స్ కోసం జలపాతంలో దూకి గల్లంతయ్యాడు. ఈ షాకింగ్ ఘటన చిత్తూరు జిల్లాలోని పలమనేరు పట్టణంలో గురువారం (అక్టోబర్ 16) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
చిత్తూరు జిల్లాలోని పలమనేరు పట్టణంలోని చికెన్ దుకాణంలో పనిచేసే యూనస్ (24) అనే వ్యక్తి స్నేహితులతో కలిసి గురువారం కల్యాణరేవుల జలపాతానికి వెళ్లాడు. రీల్స్ కోసం విన్యాసాలు చేసేందుకు యువకుడు నీళ్లలోకి దూకాడు. తిరిగి గట్టుపైకి వచ్చేలోప అనూహ్యంగా గల్లంతయ్యాడు. కల్యాణరేవుల జలపాతం ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో ఆ యువకుడు ప్రవాహంలో కొట్టుకుపోయాడు. స్నేహితులు ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. గత రెండు రోజులుగా అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినా యువకుడి ఆచూకీ తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. యువకుడు తిరిగి పైకి చేరుతున్న క్రమంలో కనిపించకుండా పోయాడని, ఇందులో ఎవరి ప్రమేయం లేదని పలమనేరు అటవీ శాఖ అధికారి నారాయణ తెలిపారు.
ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమై కల్యాణరేవుల వద్ద పర్యాటకుల సందర్శనను నిలిపివేశారు. ప్రవాహ ఉద్ధృతి ఎక్కువగా ఎండటంతో కల్యాణరేవుల జలపాతం వద్దకు పర్యాటకులను అధికారులు నిషేధించారు. గల్లంతైన యువకుడు యూనస్, అతడిస్నేహితులు తీసుకున్న ఫొటోలు, దూకేందుకు రెండు నిమిషాల ముందు తీసుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




