- Telugu News Photo Gallery Spiritual photos Andhra pradesh Linked to the End of Kaliyuga , Mysteries sri soumyanatha alayam
Mystery Temple: ఏపీలోని ఈ గుడిలో ఉన్న రాతి చేపకు జీవం వచ్చి ఈత కొడితే కలియుగాంతం..
మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యంత పురాతన ఆలయాలు ఉన్నాయి. కొన్ని ఆలయాలు దేవతల నిర్మాణం అని.. స్వయం భువులుగా స్వామీ వెలిసినట్లు చారిత్రక కథలు ద్వారా తెలుస్తూ ఉంటాయి. అంతేకాదు కొన్ని ఆలయాలు నేటికీ మానవ మేథస్సుకి, సైన్స్ కి సవాల్ విసురుతూనే ఉన్నాయి. మరికొన్ని దైవ ఘటనలతో నమ్మకాలతో ముడిపడి అందమైన శిల్పకళా సంపదతో అలరిస్తూ ఉంటాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం.. ఈ ఆలయంలోని చేపకు జీవం వస్తే కలియుగాంతం అట.. ఆంధ్రప్రదేశ్ లో ఆ ఆలయం ఎక్కడ ఉంది? విశేషాలు ఏమిటో తెలుసుకుందాం..
Updated on: Oct 18, 2025 | 4:23 PM

భారత దేశం ఆధ్యాత్మికకు నెలవు. మన దేశంలో అత్యంత ప్రాచీన పురాతన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు మన దేశ ప్రాచీన సంస్కృతిని తెలియజేసే కట్టడాలు, చారిత్రాత్మక కట్టడాలు, పుణ్యక్షేత్రాలు, వాస్తు కళా సంపద, ప్రకృతి అందాలకు నెలవు. అలాంటి అందమైన పురాతన ఆలయాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని నందలూరులో వెలసిన శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయం. ఈ ఆలయానికి సంబంధించి అనేక నమ్మకాలు విశ్వాసాలు ఉన్నాయి. అందులో ఒకటి పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఈ ఆలయం గోడపై ఉన్న ఒక చేపకు జీవం వచ్చిన రోజు కలియుగాంతం అవుతుందట.

బాహుదానదీ తీరాన అహ్లదకరమైన ప్రశాంత వాతావరణంలో ఉన్న శ్రీ సౌమ్యనాథాలయం.. చోళ శిల్పకళా సంపదకు సజీవ సాక్ష్యం. ఈ నందలూరును పూర్వకాలంలో నీరందనూరు, నిరంతరపురం, నెలందలూరు అని పిలిచేవారు. ఇక్కడ గుడిలో ఉన్న స్వామివారు తిరుపతిలో ఉన్న శ్రీవారి విగ్రహాన్ని పోలి ఉంటుంది. సౌమ్యనాథుడు ప్రశాంతమూర్తిగా ఇక్కడ కొలువైవున్నాడు. భక్తుల కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే దైవంగా కీర్తింపబడుతున్నాడు. శ్రీ సౌమ్యనాధుని ఆలయం దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఆలయ వాస్తు శిల్పకళా సంపద నేటికీ చూపరులను కట్టిపడేస్తుంది.

ఆలయ నిర్మాణ చరిత్ర 11వ శతాబ్దం పూర్వార్థంలో కుళుతుంగ చోళుడు శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయాన్ని పునర్మించాడని.. స్వామికి 20 ఎకరాల మాన్యం ఇచ్చినట్లు ఆలయంలోని శాసనాల ద్వారా తెలుస్తుంది. కాలక్రమంలో ఈ ఆలయన్ని చోళ, పాండ్య, కాకతీయ, మట్టి, విజయనగరం మొదలైన రాజులు 17వ శతాబ్దం వరకు దశల వారీగా ఆలయ నిర్మాణాలను చేస్తూనే ఉన్నారు. ఈ ఆలయంలో 54 శాసనాలు ఉన్నాయి. ఎక్కువగా తమిళంలోనే కనిపిస్తాయి. తొలిశాసనం క్రీస్తు శకం 1078కి సంబంధించిన కాగా.. క్రీ.శ 1619లో శాసనం చివరి శాసనం.

ఆలయం గురించి పురాణ కథ ఏమిటంటే.. బ్రహ్మమానసపుత్రుడు, తిలోకసంచారి , కలహాప్రియుడు నారదుడు కోరిక మేరకు విహారానికి వచ్చిన శ్రీ మహా విష్ణువు ఈ ప్రాంతం పై మనసు పడ్డాడని.. అప్పుడు నారదుడు సౌమ్యనాథస్వామి మూలవిరాట్‌ను ప్రతిష్టించారని.. దేవతలు ఆలయాన్ని నిర్మించారని ప్రతీతి. అయితే కాలక్రమంలో ఆలయం శిధిలం కాగా.. కుళుతుంగ చోళుడు సహా పలువురు రాజులు మళ్ళీ ఈ ఆలయాన్ని నిర్మించారని ఓ కథనం వినిపిస్తుంది.

స్వామివారి పేర్లు శ్రీ సౌమ్యనాథునికి.. చొక్కనాథుడని, చొక్కనాథ పెరుమాళ్‌యని, కులోతుంగ చోళఎంబరు మన్నార్ విన్నగర్ వంటి అనేక పేర్లతో భక్తులు పిలుస్తూ ఉంటారు. సౌమ్యనాథుడనగా సౌమ్యకు (శ్రీలక్ష్మి) నాథుడని అర్థం. శ్రీ సౌమ్యనాథునిపై అన్నమాచార్యులు పది వరకూ కీర్తినలు రచించినట్లు తెలుస్తోంది. ఇక్కడ 9 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు తీరుస్తాడని నమ్మకం. తర్వాత 108 ప్రదక్షిణలు చేయాలని విశ్వాసం.

ఈ ఆలయ నిర్మాణం ఎర్ర రాతితో జరిగింది. ఆలయనిర్మాణం, శిల్ప కళా సంపద అబ్బుర పరుస్తుంది. గాలి గోపురం అంటే సింహద్వారం, ఉత్తర గోపురం, దక్షిణ గోపుర ద్వారం, రాతి దీపస్థంభం , బలిపీఠం , ధ్వజ స్తంభం,గరుడ మందిరం, శ్రీ ఆంజనేయస్వామి మండపం వంటివి అద్భుతంగా ఉంటాయి. ఆలయ గోడపై, మత్య్సం, సింహం వంటి శ్రీ మహా విష్ణువు అవతారాల బొమ్మలు ఉన్నాయి. 108 స్తంభాలపై భాగవతం చిత్రించి ఉంటుంది. అంతేకాదు ఆలయ అంతర్భాగంపై ఉన్న చేపకు కలియుగాంతానికి సంబంధం ఉందని అంటారు.

ఆలయంలోని అంతర్భాగంపై ఒక గోడపై చేప ఆకారంలో ఒక శిల్పం ఉంటుంది. స్థానిక పండితులు ఈ చేప గురించి.. ఆలయం గురించి చెబుతూ.. భవిష్యత్ లో భారీ వరదలు వస్తాయని.. అప్పుడు వరద నీరు ఈ ఆలయంలోకి చేరుకుంటుందని చెప్పారు. ఆ వరద నీరు ఈ చేపని తాకిన వెంటనే ఈ చేపకు ప్రాణం వస్తుందని... అప్పుడు నీటిలో ఈదుతుందని అప్పుడు కలియుగాంతం అవుతుందని పురాణాలు చెబుతున్నాయని చెప్పారు.( ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగాఅందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు)
