AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేల కిలోమీటర్ల ప్రయాణం.. విదేశీ అతిథుల రాకతో సొబగులు విరజిమ్ముతోన్న మానేరు తీరం!

ప్రపంచంలోని పలు దేశాల నుంచి అరుదైన వలస పక్షులు మానేరు వాగు తీర ప్రాంతానికి రావడంతో మంచి సొబగులు విరజిమ్ముతోంది. అరుదైన పక్షులు మానేరు నీటి మీద తేలియాడుతూ కనిపించే దృశ్యాలు పక్షి ప్రేమికులకు పర్యాటకులకు స్వర్గధామంగా మారుతుంది. విదేశీ పక్షుల కిలకిల రాగాలతో మానేరు వాగు పరిసరాలు ప్రకృతి సంగీతంతో మార్మోగుతున్నాయి.

వేల కిలోమీటర్ల ప్రయాణం.. విదేశీ అతిథుల రాకతో సొబగులు విరజిమ్ముతోన్న మానేరు తీరం!
Rare Exotic Bird Species Flock
G Sampath Kumar
| Edited By: |

Updated on: Feb 23, 2026 | 11:12 AM

Share

ప్రపంచంలోని పలు దేశాల నుంచి అరుదైన వలస పక్షులు మానేరు వాగు తీర ప్రాంతానికి రావడంతో మంచి సొబగులు విరజిమ్ముతోంది. అరుదైన పక్షులు మానేరు నీటి మీద తేలియాడుతూ కనిపించే దృశ్యాలు పక్షి ప్రేమికులకు పర్యాటకులకు స్వర్గధామంగా మారుతుంది. విదేశీ పక్షుల కిలకిల రాగాలతో మానేరు వాగు పరిసరాలు ప్రకృతి సంగీతంతో మార్మోగుతున్నాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రకృతి మరోసారి తన అపూర్వ సౌందర్యాన్ని చాటుకుంటోంది. ఇల్లంతకుంట మండలంలోని అన్నపూర్ణ రిజర్వాయర్, మానేరువాగు తీరప్రాంతం ప్రస్తుతం వలస పక్షుల రాకతో కళకళలాడుతోంది. విదేశీ అతిథి పక్షుల కిలకిల రాగాలతో ఈ ప్రాంతం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రకృతి సంగీతంతో మార్మోగుతోంది. ప్రతి సంవత్సరం నవంబర్ నెల ప్రారంభం నుంచి ఫిబ్రవరి వరకు శీతాకాలంలో వేల కిలోమీటర్లు ప్రయాణించి అరుదైన పక్షి జాతులు ఇక్కడికి చేరుకుంటున్నాయి.

ముఖ్యంగా మంగోలియా, టిబేట్, యూరప్, ఆసియా, సైబీరియా లాంటి ప్రాంతాల నుంచి వచ్చే వలస పక్షులు మానేరు తీరాన్ని తమ తాత్కాలిక నివాసంగా మార్చుకుంటున్నాయి. వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇక్కడికి చేరుకునే ఈ పక్షులు ప్రకృతి వైవిధ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇక్కడికి వచ్చే పక్షుల్లో పల్లాస్ గల్, బార్ హెడెడ్ గీస్, పోచార్డ్స్, టీల్స్, వాటర్ బర్డ్స్ వంటి అరుదైన జాతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మానేరు నీటిమీద సమూహాలుగా తేలియాడుతూ, కొన్నిసార్లు గాల్లో చక్కర్లు కొడుతూ కనిపించే ఈ పక్షులు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.

ఉదయం సూర్యోదయ సమయంలో నీటిపై అలల మధ్య పక్షుల ప్రతిబింబాలు కనిపించడం ప్రకృతి చిత్రకళను తలపిస్తోంది. మానేరులో సమృద్ధిగా ఉన్న నీటి నిల్వలు, స్వచ్ఛమైన వాతావరణం, చుట్టుపక్కల పచ్చని పంట పొలాలు, ప్రశాంతమైన పరిసరాలు ఈ వలస పక్షులను ఆకర్షిస్తున్నాయని పక్షి ప్రేమికులు చెబుతున్నారు. వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి సమస్యలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఈ సమయంలో మానేరు వాగు వంటి ప్రాంతాలు వలస పక్షులకు సురక్షిత ఆశ్రయాలుగా మారడం సంతోషకర విషయం అంటున్నారు నిపుణులు.

పక్షుల రాకతో ఈ ప్రాంతం ఇప్పుడు ప్రకృతి ప్రేమికులు, ఫోటోగ్రాఫర్లుకు ప్రత్యేక కేంద్రంగా మారుతోంది. పక్షుల కిలకిల రాగాలు, నీటిమీద వాటి క్రీడలు, గాల్లో విహారం ఇవన్నీ కలిసి మానేరు వాగును ఒక ప్రకృతి పండుగలా మార్చేశాయి. అయితే ఈ సహజ సంపదను కాపాడుకోవడం మన అందరి బాధ్యత. వలస పక్షులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, కాలుష్యం రాకుండా, పర్యావరణాన్ని సంరక్షించేందుకు స్థానిక ప్రజలు, అధికారులు, పర్యాటకులు కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. మొత్తానికి, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మానేరు వాగు ప్రాంతం ప్రస్తుతం ప్రకృతి, పక్షుల, పచ్చదనం కలయికతో ఒక అందమైన దృశ్యంగా మారింది. విదేశీ అతిథి పక్షుల రాకతో మానేరు తీరం జీవంతో నిండిపోతోంది. ప్రకృతి ఇచ్చిన ఈ వరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us