Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఈ పేదోడి.. ఆస్తులు ఒక్కసారిగా పెరిగిపోయాయి.. నజర్ పెట్టిన పోలీసులు షాక్

విజయనగరం జిల్లా పోలీసులు గంజాయి స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. కోరాపుట్ జిల్లాకు చెందిన గంజాయి వ్యాపారి పతిఖిల అలియాస్ గురు ఆస్తులు ఫ్రీజ్ చేసి, చట్టపరమైన చర్యలు చేపట్టారు. అక్రమ రవాణా ద్వారా సంపాదించిన 43 లక్షల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి వ్యాపారులపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు.

Andhra: ఈ పేదోడి.. ఆస్తులు ఒక్కసారిగా పెరిగిపోయాయి.. నజర్ పెట్టిన పోలీసులు షాక్
Pathikila
Gamidi Koteswara Rao
| Edited By: Ram Naramaneni|

Updated on: Jun 13, 2025 | 12:05 PM

Share

విజయనగరం జిల్లా పోలీసులు గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఓ వైపు గంజాయి అక్రమ రవాణాపై ముమ్మర దాడులు చేస్తూ మరోవైపు భవిష్యత్తులో గంజాయి స్మగ్లింగ్ వైపు కన్నెత్తి చూడకుండా చర్యలకు దిగుతున్నారు. అందులో భాగంగా ప్రధాన నిందితుల ఆస్తుల స్వాధీనం దిశగా చర్యలకు దిగుతున్నారు. అందులో భాగంగా ఒడిశాలోని కోరాపుట్ జిల్లా నందపూర్ మండలం బసుపుట్ గ్రామానికి చెందిన పతిఖిల అలియాస్ గురు (32) అనే గంజాయి వ్యాపారి ఆస్తులను పోలీసులు ఫ్రీజ్ చేశారు. అతను గంజాయి అక్రమ రవాణా ద్వారా సంపాదించిన 43 లక్షల విలువైన స్థిర, చరాస్తులను స్వాధీనం చేసుకున్నారు.

గత ఏడాది అక్టోబర్ 6న ఎస్ కోటలో ఇద్దరు వ్యక్తులు 200 కిలోల గంజాయితో పట్టుబడ్డారు. వారి సమాచారం మేరకు పతిఖిలను అక్టోబర్ 10న పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. విచారణలో అతడు గంజాయి అక్రమ రవాణాతో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించినట్టు తెలిసింది. ఆ డబ్బుతో కోరాపుట్‌లో నలభై లక్షల విలువైన ఇంటిని నిర్మించడంతో పాటు, లక్షన్నరతో ఆటో, లక్షకు పైగా నగదుతో టీవీఎస్ అపాచే బైక్‌ను కొనుగోలు చేశాడు. అలాగే ఏప్రిల్ 2023లో అతని బ్యాంకు ఖాతాలో ఒక్కసారిగా 38.28 లక్షలు జమైనట్టు గుర్తించారు. మరోవైపు, గంజాయి వ్యాపారుల నుంచి రూ.6.87 లక్షల నగదు కూడా ఖాతాకు జమైంది. వీరందరికీ ఇతర రాష్ట్రాల్లో కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పతిఖిల సంపాదించిన ఆస్తులన్నీ చట్టపరంగా ఫ్రీజ్ చేసి, ఎవరికీ విక్రయించకుండా నోటీసులు జారీ చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ ఆస్తులు కోలకతాలోని కాంపిటెంట్ అథారిటీ పరిధిలో ఉండటంతో వాటిని కొనుగోలు చేసినా చెల్లవని హెచ్చరించారు. ప్రజలు ఇటువంటి అక్రమ కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే భవిష్యత్తులో మరిన్ని చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..