Andhra Pradesh: ఏపీలో మరో ‘చెత్త’ వార్త వీడియో హల్‌చల్‌.. పన్ను కట్టలేదని ఓ అపార్ట్‌ ముందు పోశారు..

అపార్ట్‌మెంట్‌ వాసులు, కాలనీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనేక రూపాల్లో అనేక వ‌స్తువుల‌పై ప‌న్నులు వసూలు చేస్తున్న ప్ర‌భుత్వం.. ఇప్పుడు చెత్త ప‌న్ను కోసం.. ఇంత చెత్త‌ప‌నులు చేయాలా? అంటూ ..

Andhra Pradesh: ఏపీలో మరో ‘చెత్త’ వార్త వీడియో హల్‌చల్‌.. పన్ను కట్టలేదని ఓ అపార్ట్‌ ముందు పోశారు..
Sewerage
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 25, 2022 | 9:01 PM

Andhra Pradesh: ఏపీలో మున్సిపల్‌ అధికారుల అత్యుత్సాహంతో మరోమారు ప్రభుత్వానికి విమర్శలు తప్పటం లేదు. ప్ర‌జ‌ల ముక్కు పిండి మరీ చెత్త‌ప‌న్నును వ‌సూలు చేయాలని భావిస్తున్నారు మున్సిపల్‌ అధికారులు. ఈ క్రమంలోనే విజ‌య‌న‌గ‌రం జిల్లాలో చెత్త ప‌న్నుక‌ట్ట లేద‌నే కారణంతో ఇక్కడి అధికారులు, సిబ్బంది విచిత్రంగా ప్రవర్తించారు. ఏకంగా భౌతిక దాడులకు దిగుతూ..ఓ అపార్ట్‌మెంట్ ముందు.. మునిసిప‌ల్ అధికారులు త‌మ సిబ్బందితో చెత్త‌ను పోయించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. ఘటన మొత్తం వీడియో తీసిన స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు.దాంతో వీడియో కాస్త వైరల్‌ అవుతోంది.

విజయనగరం పూల్‌బాగ్ కాలనీలోని సాయి అమృత అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న వారు గత కొంతకాలంగా చెత్త పన్నుకట్టలేదు. దీంతో మున్సిపల్ సిబ్బంది చెత్త తీసుకెళ్లి అదే అపార్ట్‌మెంట్‌ గేటు ముందు వేశారు. దీన్ని చిత్రీకరించిన వ్యక్తి సెల్‌ఫోన్‌ను ధ్వంసం చేసి స్థానికులపై దాడికి పాల్పడ్డారు మున్సిపల్ సిబ్బంది. కేవ‌లం చెత్త ప‌న్ను క‌ట్ట లేద‌నే వంక‌తో.. అపార్ట్‌మెంటు వాసుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తూ.. చెత్త‌ను అపార్ట్‌మెంటుకు వెళ్లే దారిలో కుమ్మ‌రించారు. దాంతో అపార్ట్‌మెంట్‌ వాసులు, కాలనీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనేక రూపాల్లో అనేక వ‌స్తువుల‌పై ప‌న్నులు వసూలు చేస్తున్న ప్ర‌భుత్వం.. ఇప్పుడు చెత్త ప‌న్ను కోసం.. ఇంత చెత్త‌ప‌నులు చేయాలా? అంటూ ప్ర‌జ‌లు విరుచుకుప‌డుతున్నారు.

ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. చెత్త పన్ను కట్టలేదని చెత్త తెచ్చి వేయడం దారుణమని పేర్కొన్నారు. చెత్త పన్ను పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని పీడిస్తోందని ఆరోపించారు. చెత్త పన్ను కట్టకపోతే సామాన్లు జప్తు చెయ్యడం.. ఇంటి ముందు చెత్త వెయ్యడం ఏపీలో నిత్యకృత్యమయ్యారని మండిపడ్డారు. సీఎం జగన్ చెత్తపన్నును వెంటనే రద్దు చేసి, స్థానికులపై దాడికి పాల్పడ్డ మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి