AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: మేనత్తతో యవ్వారం.. అడ్డుగా ఉన్న మేనమామని ఎంత పనిచేశాడో తెలుసా

విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కెరటం గ్రామంలో వివాహేతర సంబంధం నేపధ్యంలో మేనమామను మేనల్లుడు హత్య చేసిన ఘటన కలకలం రేపింది. నారపాటి సాయి అనే యువకుడు, మేనత్తతో అక్రమ బంధం పెట్టుకొని అడ్డుగా ఉన్న మేనమామ నిడిగెట్టి కృష్ణను మద్యం తాగించి గొంతు నులిమి చంపాడు.

Andhra: మేనత్తతో యవ్వారం.. అడ్డుగా ఉన్న మేనమామని ఎంత పనిచేశాడో తెలుసా
Family Dispute Murder
Gamidi Koteswara Rao
| Edited By: Ram Naramaneni|

Updated on: Aug 11, 2025 | 3:44 PM

Share

వావివరుసలు మరిచి పశువుల్లా వివాహేతర సంబంధాలు నెరుపుతూ సభ్య సమాజం అసహ్యించుకునేలా ప్రవర్తిస్తున్నారు కొందరు దుర్మార్గులు. అయినవారని కూడా చూడకుండా వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్న వారిని అత్యంత కిరాతకంగా హతమారుస్తున్నారు. విజయనగరం జిల్లాలో జరిగిన ఓ దారుణ ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కెరటాంలో దారుణ హత్య జరిగింది. అక్రమ సంబంధం నేపథ్యంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. విశాఖపట్నం సిటీ గోపాలపట్నంకు చెందిన నారపాటి సాయి(24) అనే యువకుడు పాత నేరస్తుడు. సాయిపై గతంలో పలు క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే సాయి తల్లిదండ్రులు గోపాలపట్నంలోనే ఉంటే మరిన్ని నేరాలకు పాల్పడతాడని కెరటాంలో ఉన్న తమ సమీప బంధువు అయిన నిడిగెట్టి కృష్ణ(40) ఇంటికి పంపించారు. అలా గత రెండేళ్ల క్రితం వచ్చిన సాయి.. మేనమామ కృష్ణ ఇంట్లోనే నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలోనే మేనమామ భార్య అయిన మేనత్త రాజుతో చనువుగా ఉండటం ప్రారంభించాడు. ఆ చనువు కాస్తా వివాహేతర సంబంధంకి దారి తీసింది. అలా మేనమామ ఇంట్లో ఉంటూ మేనత్తతో అక్రమ సంబందం కొనసాగిస్తున్నాడు సాయి. అయితే ఈ విషయాన్ని మద్యం మత్తులో మేనమామ కృష్ణతో చెప్పాడు సాయి.

ఆశ్రయమిచ్చిన తనకే ఇంత వెన్నుపొడుచిన సాయిని తన ఇంటిలో ఉండొద్దని కృష్ణ వారిస్తూ తరుచూ  గొడవపెడుతూ ఉండేవాడు. అంతేకాకుండా సాయి తన భార్యతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని గ్రామంలోనే పలువురితో కూడా చెప్పుకొస్తున్నాడు కృష్ణ. ఈ విషయంలో వారిద్దరి మధ్య నిత్యం గొడవలు జరిగేవి.  వారి వివాదం మరింత ముదిరి తన అక్రమ సంబంధంకి అడ్డుగా ఉన్న మేనమామ కృష్ణని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు సాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల తొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో మద్యం తాగుదామని నమ్మించి కృష్ణను ఊరు బయటకు తీసుకెళ్లాడు సాయి. అలా బయటకు వెళ్లిన తరువాత కృష్ణకి పూటుగా మద్యం తాగించాడు. తరువాత మద్యం మత్తులో ఉన్న కృష్ణ పై ఒక్కసారిగా దాడి చేసి గొంతు నులిమి హతమార్చాడు. కృష్ణ మృతి చెందిన తరువాత ఇంటికి వెళ్లి కృష్ణ కుమారుడికి విషయం చెప్పి కృష్ణ కొడుకును తీసుకొని మృతదేహం వద్దకు తీసుకెళ్లాడు నిందితుడు సాయి. అక్కడ నుండి ఇద్దరు కలిసి బైక్ పై వెనక కూర్చోబెట్టుకొని ఇంటికి తీసుకొచ్చి పడుకోబెట్టారు. అలా నిందితుడు సాయికి కృష్ణ కొడుకు జస్వంత్ కూడా సహాయం చేశాడు. తరువాత విషయాన్ని మృతుడు కృష్ణ భార్యకి విషయం చెప్పారు. అలా ముగ్గురు కలిసి కృష్ణ హత్యను..  సహజ మరణంగా చిత్రీకరించి మృతదేహాన్ని గ్రామం బయట ఖననం చేసి చేతులు దులుపుకున్నారు. అయితే గ్రామస్తులకు అనుమానం వచ్చి వెంటనే 100కు ఫోన్ చేసి పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు విషయం తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

పోలీసుల దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కృష్ణ మృతికి వివాహేతర బంధమే కారణంగా తేల్చారు. వెంటనే పూడ్చి పెట్టిన కృష్ణ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గ్రామంలో సాయి ఉండటంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు సాయిని నిలదీసి చితకబాదారు. ఆ ఘటనలో గ్రామస్తులు దాడి నుండి తప్పించుకుని నిందితుడు సాయి పరారవ్వడంతో పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు.

ఈ హత్యలో కృష్ణ భార్య రాజు, కృష్ణ కొడుకు జశ్వంత్ పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధం ఉందని కృష్ణ భార్య కూడా అంగీకరించడంతో కేసు ఒక కొలిక్కి వచ్చినట్లు అయ్యింది. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న దారుణ ఘటనలు అందరినీ భయాందోళనకు గురిచేస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.