Andhra: మహిళలకు ఏయే బస్సుల్లో ప్రయాణం ఉచితం.. ఏ గుర్తింపు కార్డు ఉండాలి.. ఫుల్ డీటేల్స్
ఏపీ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఆగస్టు 15న ప్రారంభించబోతోంది. ఇది ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన 'సూపర్ సిక్స్' హామీల్లో ఒకటి. తాజాగా ఏపీ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆ డీటేల్స్ ఇప్పుడు తెలుసుకుందాం...

రాఖీ పండుగ కానుకగా.. ఎన్నికల ముందు హామి ఇచ్చిన విధంగా ఆగస్టు 15 నుంచి ఏపీలోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనుంది. అయితే ఏయే బస్సుల్లో ప్రయాణం ఉచితం… ఏయా ప్రాంతాల్లో ఉచితం.. ప్రయాణించే సమయంలో ఏయే పత్రాలు ఉండాలి.. వంటి మార్గదర్శకాలను తాజాగా ప్రభుత్వం విడుదల చేసింది. ఆ డీటేల్స్ ఇప్పుడు తెలుసుకుందాం…
ముందుగా ఎవరెవరికి ఉచితం: బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుంది
ఏయే బస్సుల్లో ఉచితం: పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ మొత్తం 5 కేటగిరీలకు చెందిన బస్సులో గుర్తింపు కార్డు చూపించి.. ఉచితంగా ప్రయాణించవచ్చు.
ఏయే బస్సుల్లో ఈ ప్రయాణం వర్తించదు: సూపర్ లగ్జరీ, నాన్ ఏసీ స్లీపర్ స్టార్‌లైనర్, ఏసీ, ఆల్ట్రా డీలక్స్ బస్సుల్లో ఈ సౌకర్యం ఉండదు. తిరుమల-తిరుపతి మధ్య తిరిగే సప్తగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. అలానే నాన్ స్టాప్, ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతర్రాష్ట్ర బస్సులు, చార్టర్డ్, ప్యాకేజ్ టూర్ సర్వీసుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి వీలుండదు.
ఏ గుర్తింపు కార్డులు చూపించాలి: ఉచిత ప్రయాణం కోసం మహిళలు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుంది. ఉదాహారణకు ఆధార్ కార్డు, ఓటరు ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి. అయితే సదరు మహిళలు ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసితులై ఉండాలి.
ఈ పథకాన్ని ‘స్త్రీ శక్తి’ పథకంగా పిలుస్తున్నారు. అర్హులైన మహిళా ప్రయాణికులకు జీరో ఫేర్ టికెట్లు జారీ చేస్తారు. ఖర్చును RTCకి ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ స్కీమ్ అమలుతో బస్సుల్లో రద్దీ పెరగనుంది. దీంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు, కండక్టర్లకు బాడీ ఓర్న్ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. బస్టాండ్లలో మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీకి ఆదేశాలు జారీ అయ్యాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




