Vizag Steel : కరోనా నుంచి ఎన్నో ప్రాణాలు కాపాడిన ఘనత వైజాగ్ స్టీల్ దే.. ప్రైవేటీకరిస్తే ఇంత సేవ చేసి ఉండేదా? : విజయసాయి
విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరిస్తే కరోనా సమయంలో దేశానికి ఇంత సేవ చేయగలిగి ఉండేదా? అని అన్నారు వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి
Vijayasai Reddy on Vizag Steel : ప్రతిష్టాత్మక విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరిస్తే కరోనా సమయంలో దేశానికి ఇంత సేవ చేయగలిగి ఉండేదా? అని అన్నారు వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి. కొవిడ్ కష్టకాలంలో ఆక్సిజన్ ని దేశానికి ఇచ్చి ఎన్నో ప్రాణాలు కాపాడిన ఘనత విశాఖ స్టీల్ ప్లాంట్‌దేనని ఆయన కొనియాడారు. దేశం మెడికల్ లిక్విడ్ ఆక్సిజన్ సంక్షోభంతో కొట్టమిట్టాడుతోన్న సమయంలో నేనున్నానంటూ దేశానికి ప్రాణవాయువు అందించిన ఘనత ఆర్ ఎన్ ఐ ఎల్ ఆధ్వర్యంలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ దేనని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రశంశించారు. ఆదివారం వైజాగ్ స్టీల్ ప్లాంట్ టౌన్ షిప్ లో మొదటిదశగా ఏర్పాటు చేసిన 300 పడకల కోవిడ్ కేర్ హాస్పిటల్ ని కేంద్ర స్టీల్ మంత్రి ధర్మేంద్ర ప్రధాని తో కలిసి వర్చ్యువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సాయిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..
స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించి ఉంటే దేశానికి ఇంత సేవలు అందించగలిగేదా? ఒక్కసారి ఆలోచించాలని కేంద్ర మంత్రిని కోరారు. ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించాల్సిన సందర్భం కాకపోయినప్పటికీ మరొక్కసారి ఆ నిర్ణయాన్ని పున: సమీక్షించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసారు. రాష్ట్రానికే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాలకు ప్రాణవాయువు అందించి ఎందరో ప్రాణాలను కాపాడిన స్టీల్ ప్లాంట్ ని ప్రతిఒక్కరూ అభినందించి తీరాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.